వెరీ గుడ్ న్యూస్: ఎండ తీవ్రత- వడగాల్పులకు చెక్ పెట్టే రోజు ఇంకెంతో దూరంలో లేదు!
నగరీకరణ వేగంగా సాగుతోంది. చిన్న పట్టణాలు పెద్ద టౌన్లుగా మారుతున్నాయి. పారిశ్రామికీకరణ కూడా వేగంగానే సాగుతోంది.
By: Sivaji Kontham | 19 May 2026 12:00 PM ISTనగరీకరణ వేగంగా సాగుతోంది. చిన్న పట్టణాలు పెద్ద టౌన్లుగా మారుతున్నాయి. పారిశ్రామికీకరణ కూడా వేగంగానే సాగుతోంది. దీంతో పాటే గ్రీన్ హౌస్ ఉద్గారాలు విస్త్రతంగా విడుదలవుతున్నాయి. ఇది పర్యావరణ కాలుష్యాన్ని పెంచడమే కాకుండా భూమిపై ప్రమాదకర స్థాయికి వేడిని పెంచుతోంది. వేసవి తాపం అంతకంతకు పెరుగుతోంది. భారతదేశం సహా ప్రపంచ దేశాలు వడగాల్పులతో అల్లాడిపోతున్నాయి. అత్యంత సున్నితమైన ఓజోన్ పొరకు చిల్లు పడటంతో సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకుతున్నాయి. అయితే ఈ పరిస్థితులన్నిటి నుంచి ప్రపంచాన్ని కాపాడాలంటే వెంటనే వాతావరణ కాలుష్యాన్ని నివారించాలి. పారిశ్రామిక కాలుష్యాలను తగ్గించగలిగితే.. వేడి దానంతట అదే తగ్గుతుంది. దీని కోసం అడవుల్ని పెంచడంతో పాటు.. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిపైనా ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఒక గొప్ప విప్లవాత్మక మార్పులకు దారి తీసే గొప్ప ఆవిష్కరణను సైంటిస్టులు చేసారు. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం కానుంది. గ్లోబల్ వార్మింగ్ కి చెక్ పెట్టేందుకు ఇది గొప్పగా ఉపకరిస్తుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
జల కాలుష్యాన్ని, వాయు కాలుష్యాన్ని నియంత్రించి.. భూతాపాన్ని.. విపరీతమైన ఎండ వేడిని తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా రకరకాల ప్రయోగాలు సాగుతున్నాయి. ఇందులో భాగంగానే అత్యంత కీలకమైన హరిత (గ్రీన్) హైడ్రోజన్ పరిశోధనలు వేగవంతమయ్యాయి. నీటి అణువులోని హైడ్రోజన్, ఆక్సిజన్ పరమాణువుల మధ్య ఉండే రసాయన బంధం అత్యంత బలమైనది కావడంతో వాటిని విడగొట్టడం శాస్త్రవేత్తలకు ఇప్పటివరకు ఒక ఖరీదైన సవాలుగా మిగిలింది. పాత పద్ధతులలో వాడే నీటి విద్యుత్ విశ్లేషణ పరికరాలు తక్కువ సామర్థ్యంతో ఉంటూ, బంగారం కంటే ఖరీదైన ప్లాటినం, ఇరిడియం వంటి లోహాలపై ఆధారపడటం వల్ల హరిత హైడ్రోజన్ ఉత్పత్తి వ్యయం అమాంతం పెరిగిపోయింది. అయితే ఈ అడ్డంకులను అధిగమిస్తూ వాషింగ్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం తక్కువ ఖర్చుతో కూడిన అత్యంత సమర్థవంతమైన సరికొత్త మిశ్రమ ఉత్ప్రేరకాన్ని ప్రయోగశాల స్థాయిలో విజయవంతంగా ఆవిష్కరించింది.
ఈ సరికొత్త సాంకేతికతలో ఖరీదైన ప్లాటినం లోహాల స్థానంలో భూమిపై సమృద్ధిగా లభించే రీనియం ఫాస్ఫైడ్, మాలిబ్డినం ఫాస్ఫైడ్ ల మిశ్రమ ఉత్ప్రేరకాన్ని పరిశోధకులు ఉపయోగించారు. ఈ రెండు పదార్థాల కలయిక వల్ల ఏర్పడిన నెగటివ్ విద్యుత్ అంచు (క్యాథోడ్) వ్యవస్థ, నీరు - విద్యుత్ వాహక ద్రవం మధ్య ఉండే హైడ్రోజన్ అణు బంధాలను సున్నితంగా నియంత్రిస్తూ విద్యుత్ నిరోధకతను కనిష్ట స్థాయికి తగ్గించింది. దీనివల్ల చాలా తక్కువ విద్యుత్ శక్తితోనే అత్యంత వేగంగా నీటి నుండి హైడ్రోజన్‌ను వేరు చేయడం సాధ్యపడింది. పారిశ్రామిక స్థాయి విద్యుత్ ప్రవాహ సాంద్రత వద్ద ఈ సరికొత్త వ్యవస్థ ఏకంగా వెయ్యి గంటలకు పైగా నిరంతరాయంగా పనిచేసి, ప్లాటినం రహిత ఉత్ప్రేరకాలలోనే అత్యంత మన్నికైనదిగా రికార్డు సృష్టించింది.
ప్రయోగశాల స్థాయిలో అద్భుతాలు సృష్టించిన ఈ సాంకేతికత పారిశ్రామిక స్థాయి వాణిజ్యీకరణకు నోచుకోవాలంటే కొన్ని ఉత్పత్తి విస్తరణ సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. గ్రాముల స్థాయిలో వాడే ఉత్ప్రేరకాలను టన్నుల కొద్దీ స్థిరంగా ఉత్పత్తి చేయడం .. హైడ్రోజన్‌ను సురక్షితంగా నిల్వ చేసే అతిశీతల మౌలిక వసతులను భారీ పెట్టుబడులతో నిర్మించడం ప్రస్తుతమున్న ప్రధాన అడ్డంకి. ఒకవేళ ఈ ప్రయోగం పారిశ్రామిక స్థాయిలో గనుక విజయవంతం అయితే.. భారతదేశం తనకున్న ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం ద్వారా సముద్రపు నీటిని లవణ రహితం చేసి లేదా నగరాల వ్యర్థ జలాలను శుద్ధి చేసి అపారమైన హరిత హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే ఒక అంతర్జాతీయ కేంద్రంగా అవతరించగలదు.
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన సౌర శక్తి, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల నుండి వచ్చే కరెంట్‌ను ఈ సరికొత్త పరికరాలకు అనుసంధానించడం ద్వారా... పర్యావరణానికి ఎంతో మేలు చేసే స్వచ్ఛమైన ఇంధనాన్ని చౌకగా నిల్వ చేసుకోవచ్చు. ఈ విధానం సఫలీకృతమైతే.. దేశంలో కాలుష్యానికి ప్రధాన కారణాలైన భారీ రవాణా రంగం (సరుకు రవాణా వాహనాలు, రైళ్లు), ఉక్కు- సిమెంట్ పరిశ్రమలలో బొగ్గు, డీజిల్ స్థానంలో హరిత హైడ్రోజన్‌ను ఇంధనంగా వాడే వీలుంటుంది. తద్వారా కర్బన ఉద్గారాలు శూన్య స్థాయికి పడిపోవడమే కాకుండా.. హరితగృహ వాయువుల ప్రభావం తగ్గి... దేశవ్యాప్తంగా ఏటేటా విపరీతంగా పెరుగుతున్న ఎండ తీవ్రత- వడగాల్పుల నుండి శాశ్వత ఉపశమనం లభిస్తుంది.
ఓవరాల్‌గా చూస్తే.. నీటి నుండి హైడ్రోజన్‌ను వేరు చేసే ఈ సరికొత్త సాంకేతికత భవిష్యత్ స్వచ్ఛమైన విద్యుదుత్పత్తి రంగానికి ఒక దిక్సూచిలా నిలుస్తోంది. సాంకేతిక లోపాలను, మౌలిక వసతుల కొరతను అధిగమించి ఈ ప్రయోగాన్ని పారిశ్రామిక స్థాయికి తీసుకెళ్లగలిగితే ప్రపంచం భూగర్భ ఇంధనాల నుండి శాశ్వతంగా విముక్తి పొందడం ఖాయం. పర్యావరణ పరిరక్షణతో పాటు దేశీయ ఇంధన భద్రతను సాధించడంలో ఈ సరికొత్త సాంకేతిక ఆవిష్కరణ భవిష్యత్ లో ఒక విప్లవాత్మక పాత్ర పోషించనుంది.
