బీజేపీని పిలిచారు...విజయ్ కి మాత్రం ?
రాజ్యాంగంలో గవర్నర్లకు విచక్షణాధికారాలు ఉంటాయి. అందుకే ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా గవర్నర్లు నిర్ణయాలు ఉంటాయి.
By: Satya P | 7 May 2026 6:00 AM ISTరాజ్యాంగంలో గవర్నర్లకు విచక్షణాధికారాలు ఉంటాయి. అందుకే ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా గవర్నర్లు నిర్ణయాలు ఉంటాయి. అది వారి ఆలోచనలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ దేశంలో హంగ్ అసెంబ్లీలు హంగ్ పార్లమెంట్లు ఎన్నో సార్లు ఏర్పడ్డాయి. 1996 లో దేశంలో లోక్ సభకు ఎన్నికలు జరిగితే అతి పెద్ద పార్టీగా బీజేపీ ఆవిర్భవించింది 160 సీట్లతో ఆ పార్టీ ఉంది. అయితే మ్యాజిక్ ఫిగర్ 273కి ఎంతో దూరం ఉంది. అయినా సరే నంబర్ ని పట్టించుకోకుండా నాటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ బీజేపీని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారు అలా వాజ్ పేయి తొలిసారి ప్రధానిగా దేశంలో బాధ్యతలు స్వీకరించారు. అయితే బలం నిరూపించుకోలేక 13 రోజులకే ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
కర్ణాటకలో ఉదంతం :
ఇక 2018లో కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. అయితే బీజేపీ 104 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. దాంతో గవర్నర్ బీజేపీని ప్రభుత్వం చేయమని ఆహ్వానించారు. దాని మీద ఆనాడు 78 సీట్లు ఉన్న కాంగ్రెస్ 37 సీట్లు ఉన్న జేడీఎస్ కోర్టుని ఆశ్రయించాయి. దాంతో రెండు రోజులలో బలాన్ని నిరూపించుకోవాలని కోర్టు ఆదేశించింది. బలం లేక యడ్యూరప్ప నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కుప్ప కూలింది. అపుడు కాంగ్రెస్ జేడీయూ కలసి సర్కార్ ని ఏర్పాటు చేశాయి. ఈ రెండు సంఘటనలూ ఏమి చెబుతున్నాయంటే హంగ్ ఏర్పడినపుడు అతి పెద్ద పార్టీలని ఆహ్వానిస్తారు అని. అయితే అన్ని సందర్భాలలో అలా ఉండాలని లేదు. గవర్నర్ కి నమ్మకం కలగాలి. ఎవరు సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయగలరు అన్నది గవర్నర్ ఆలోచించి విచక్షణ మేరకు నిర్ణయం తీసుకుంటారు అని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.
విజయ్ కోరినా :
నిజానికి మే 4 నాటికే ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. విజయ్ పెద్ద పార్టీగా తమిళనాడులో ఏర్పడింది. దాంతో సాధారణంగా అతనికే గవర్నర్ పిలవాలి. ముందుగా ప్రభుత్వం చేత ప్రమాణం చేయించి రెండు వారాలు గడువు బల నిరూపణకు ఇవ్వడం కూడా ఆనవాయితీగా ఉంది. కానీ గవర్నర్ నుంచి అయితే విజయ్ కి ఏ రకమైన ఆహ్వానం లేదు. దాంతో ఆయనే నేరుగా లోక్ భవన్ కి వెళ్ళి గవర్నర్ ని కలిశారు. తన వద్ద ఉన్న నంబర్ ని చూపించారు రెండు వారాలు గడవు ఇస్తే బలం నిరూపించుకుంటాను అని ఆయన చెప్పారు. కానీ గవర్నర్ మాత్రం విజయ్ కి సంఖ్యా బలం లేదని భావించినట్లున్నారు. దాంతో ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించలేదు.
గవర్నర్ కోర్టులోనే :
చాలా చోట్ల పెద్ద పార్టీలను పిలిచి ముందు ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తారు. ఆ మీదట మెజారిటీ అసెంబ్లీలో వారు నిరూపించుకుంటారు. కానీ విజయ్ విషయంలో అలా జరగలేదు. ఈ నేపథ్యంలో గవర్నర్ కోర్టులోనే బంతి ఉందా అన్న చర్చ సాగుతోంది. విజయ్ ని ఆయన పిలుస్తారా లేదా అన్నది కూడా అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఒక ఒక్కసారి కనుక సీఎం గా విజయ్ ప్రమాణం చేస్తే ఆటోమేటిక్ గా బలం పెరుగుతుందని టీవీకే వర్గాలు అంటున్నాయి. మెజారిటీ ఉంటే ప్రమాణం అని లోక్ భవన్ చెప్పకనే చెబుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
