ఫుల్ హ్యాపీగా గోవా గవర్నర్.. అంత ఆనందం వెనుక కారణమేంటో తెలుసా?
గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, వైసీపీ నేత బొత్స సత్యానారాయణ మధ్య దశాబ్దాలుగా రాజకీయ వైరం కొనసాగుతోంది.
By: Tupaki Political Desk | 8 Oct 2025 11:37 AM ISTగోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు ఫుల్ హ్యాపీగా ఉన్నారట.. తన స్వస్థలం విజయనగరంలో జరుగుతున్న పైడితల్లి అమ్మవారి జాతరకు వచ్చిన అశోక్ గజపతిరాజులో మునుపెన్నడూ చూడని ఆనందం చూస్తున్నామని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గవర్నర్ గిరీతో రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి, మాజీ మంత్రి బొత్స సత్యానారాయణ విషయంలో టీడీపీ యువనేత, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున వ్యవహరించిన తీరు అశోక్ గజపతిరాజును పరవశించేలా చేసిందని టీడీపీ కేడర్ చెబుతున్నారు. ఈ కారణంగానే బొత్స కూడా గోవా గవర్నర్ పై మాటల దాడి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, వైసీపీ నేత బొత్స సత్యానారాయణ మధ్య దశాబ్దాలుగా రాజకీయ వైరం కొనసాగుతోంది. ఇద్దరిదీ సొంత ఊరు విజయనగరమే.. ఈ ఇద్దరు ఎప్పుడూ ఒకరిపై ఒకరు పోటీ చేయకపోయినా జిల్లా రాజకీయాల్లో ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. 1978లో రాజకీయ అరంగేట్రం చేసిన అశోక్ గజపతికి 1999 వరకు జిల్లాల్లో తిరుగుండేది కాదు. అప్పట్లో యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న బొత్స తొలుత డీసీసీబీ చైర్మన్, ఆ తర్వాత పార్లమెంటు సభ్యుడయ్యాక అశోక్ జోరుకు బ్రేకులు పడ్డాయని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాలు జిల్లా రాజకీయాలు శాసించిన అశోక్ గజపతికి సవాల్ విసురుతూ ఎదిగిన బొత్స 2004లో జిల్లాలో కాంగ్రెస్ స్వీప్ చేయడంలో కీలకంగా పనిచేశారు. ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బొత్స ఇప్పటివరకు అశోక్ కు దీటైన నేతగా రాజకీయాలు చేస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలో రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగిన బొత్స.. అనేక సార్లు అశోక్ గజపతిరాజును ఇరుకనపెట్టేలా వ్యవహరించారు. దీంతో రాజకీయంగా తన కంట్లో నలుసులా మారిన బొత్సను నియంత్రించేందుకు అశోక్ చాలా ప్రయత్నాలు చేశారని చెబుతున్నారు. కానీ, ఆయన వ్యూహాలు ఏవీ ఇప్పటివరకు ఫలించలేదు. ప్రధానంగా బొత్స నియంత్రణలో ఉన్న డీసీసీబీని ఇప్పటివరకు అశోక్ తన నియంత్రణలోకి తీసుకురాలేకపోయారు. ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉండటం, డీసీసీబీకి నామినేట్ పాలకవర్గం నియమించడంతో తొలిసారి బొత్సకు డీసీసీబీతో సంబంధాలు తెగిపోయాయని అంటున్నారు. బొత్స రాజకీయ ఎదుగుదలకు కారణమైన డీసీసీబీ ఇప్పుడు టీడీపీ నియంత్రణలోకి రావడం, విజయనగరం అమ్మవారి సంబరాల్లో డీసీసీబీ బ్యాంకు ఆవరణలోకి బొత్సను అడుగు పెట్టనీయకుండా చేయడంతో అశోక్ ఖుషీ అవుతున్నట్లు చెబుతున్నారు.
ఈ విషయంలో ప్రస్టేషన్ కు లోనైన బొత్స టీడీపీపైన తనపైన విమర్శలు చేయడాన్ని కూడా అశోక్ హ్యాపీగా స్వీకరిస్తున్నారని అంటున్నారు. విమర్శల ద్వారా బొత్సలో ఆవేదన చూడటమే అశోక్ గజపతిని ఆనందానికి గురిచేస్తోందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో తనపై పరుష వ్యాఖ్యలుచేస్తున్న బొత్స.. చిన్న విషయాన్ని తట్టుకోలేక గుండెలు బాధుకుంటున్నట్లు మాట్లాడటాన్ని అశోక్ తన సన్నిహితులు వద్ద ప్రస్తావిస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి కారణమైన డీసీసీబీ చైర్మన్ నాగార్జునను అభినందిస్తూ ‘కీప్ ఇట్ అప్’ అంటూ ఉత్తేజ పరిచారని, బొత్స విషయంలో మరింత దూకుడు చూపాలని నాగార్జునకు దిశానిర్దేశం చేశారని అంటున్నారు.
