Begin typing your search above and press return to search.

3,718 యాప్స్‌ ను బ్యాన్ చేసిన కేంద్రం.. సైబర్ దొంగలకు గట్టి షాక్!

ఈ ఏడాది జూన్ 30 నాటికి లెక్క తేల్చిన సర్కారు జనం కష్టార్జితాన్ని మింగేస్తున్న ఫేక్ లోన్ యాప్స్, స్కామర్ల ప్లాట్‌ఫామ్‌లపై పెద్ద సర్జికల్ స్ట్రైకే చేసింది.

By:  A.N.Kumar   |   12 Aug 2026 9:48 AM IST
3,718 యాప్స్‌ ను బ్యాన్ చేసిన కేంద్రం.. సైబర్ దొంగలకు గట్టి షాక్!
X

"ఆధార్ కార్డు ఇవ్వు.. క్షణాల్లో లోన్ తీసుకో".. "రెండు నిమిషాల్లో రూ. 10 వేలు మీ అకౌంట్‌లో".. ఇలాంటి బంపర్ ఆఫర్లతో మార్కెట్లోకి వచ్చి అమాయకుల జేబులు గుల్ల చేస్తూ జల్సాలు చేస్తున్న సైబర్ కిలాడీలకు కేంద్ర ప్రభుత్వం గట్టి ‘రిటర్న్ గిఫ్ట్’ ఇచ్చింది. దేశంలో ఒకే దెబ్బకు 3,718 మోసపూరిత యాప్స్‌ను డిజిటల్ దుకాణాలు మూయించేసి బాధితులకు భారీ ఊరట నిచ్చింది. "మనోళ్లు లోన్లు ఇచ్చేది పోయి.. ఉన్న డబ్బులు కాపాడుకోవాల్సి వస్తోంది" అని సెటైర్లు పేలుతున్న వేళ ఏకంగా ₹11,000 కోట్ల విలువైన నిధులను సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా రక్షించినట్లు కేంద్రం వెల్లడించింది.

₹11 వేల కోట్లు భద్రం.. కిలాడీలకు మూడిన కాలం

ఈ ఏడాది జూన్ 30 నాటికి లెక్క తేల్చిన సర్కారు జనం కష్టార్జితాన్ని మింగేస్తున్న ఫేక్ లోన్ యాప్స్, స్కామర్ల ప్లాట్‌ఫామ్‌లపై పెద్ద సర్జికల్ స్ట్రైకే చేసింది. 2021లో ప్రారంభమైన సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ పుణ్యమా అని.. జనం ఫిర్యాదు చేయడమే ఆలస్యం.. సైబర్ క్రిమినల్స్ అకౌంట్లలోకి వెళ్లిన డబ్బులు కూడా 'యూ-టర్న్' తీసుకుంటున్నాయి. మోసగాళ్ల ఖాతాల్లోకి డబ్బులు బదిలీ అయిన తర్వాత కూడా సంబంధిత బ్యాంకులు, చెల్లింపు సంస్థల సమన్వయంతో వాటిని రీ-ఫ్రీజ్ చేసేస్తున్నారు. "ఖాతాలో డబ్బులు పడ్డాయని మోసగాళ్లు పండుగ చేసుకునేలోపే.. సీన్ రివర్స్ అవుతోంది" అంటూ ఆన్‌లైన్ జనాలు ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు.

సిమ్ కార్డ్స్ బంద్.. ఐఎంఈఐలకు ప్యాకప్

కేవలం యాప్స్ తీసేస్తే సరిపోదు కదా మోసగాళ్లు కొత్త సిమ్‌లు, కొత్త ఫోన్లతో మళ్లీ దందా మొదలుపెడతారనే ఉద్దేశంతో కేంద్రం ఈసారి వేర్ల నుంచే దాడి చేసింది. ఏకంగా 15.75 లక్షల సిమ్ కార్డులను స్విచ్ ఆఫ్ చేయించగా 5.77 లక్షల ఐఎంఈఐ నంబర్లను మూలన పడేలా బ్లాక్ చేసింది. "పాపం మోసగాళ్లు.. ఇన్ని సిమ్‌లు, ఫోన్లు బ్లాక్ అయితే వాళ్లు కాల్ సెంటర్లు మూసుకొని వేరే ఏ పకోడీ కొట్లో పెట్టుకోవాల్సిందే" అని సోషల్ మీడియాలో కామెడీ మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి.

'రాజా'లా లోన్ ఇస్తారు.. 'యమరాజా'లా బాదేస్తారు

'ఇన్స్టెంట్ లోన్' అనగానే సంబరపడి యాప్స్ అడిగిన పర్మిషన్లన్నీ 'అల్లో' కొట్టేసే అమాయకులే ఈ దొంగలకు ప్రధాన టార్గెట్. లోన్ ఇచ్చేది రూ. 2,000.. వారం తిరిగేసరికి వడ్డీ, చక్రవడ్డీలు కలిపి రూ. 20,000 కట్టమంటూ మాట వినకపోతే ఫోన్ కాంటాక్ట్ లిస్టులోని బంధువులందరికీ మార్ఫింగ్ ఫొటోలు పంపిస్తామని బెదిరించడం వీళ్ల నైజం. "లోన్ ఇచ్చేటప్పుడు రాజా.. వసూలు చేసేటప్పుడు యమరాజా" తరహాలో ఉన్న ఈ యాప్‌ల ముఠాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకింగ్ సంస్థలు ఒక్కటై ఉక్కుపాదం మోపాయి.

జాగ్రత్త పడకపోతే 'జల్సా' గోవిందా!

కేంద్రం ఎన్ని వేల యాప్స్ బ్యాన్ చేసినా మనమే తెలియని లింకులు నొక్కుతూ ఓటీపీలు ఇచ్చేస్తూ ఉంటే అది "చేతులారా కొనితెచ్చుకున్నట్లే" అవుతుంది. "తెలియని లింక్ నొక్కితే ఉన్న అకౌంట్ ఖాళీ.. అపరిచితుడికి ఓటీపీ చెబితే జీవితం ఖాళీ" అనే నిజాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించాలని అధికారులు సూచిస్తున్నారు. మొత్తానికి 3,718 యాప్‌లకు బై-బై చెప్పి ₹11,000 కోట్లు కాపాడిన ప్రభుత్వం చర్యపై నెటిజన్లు మెచ్చుకుంటూనే.. "సార్.. ఆ రోజుకో వంద 'పార్ట్ టైమ్ జాబ్' మెసేజ్‌లు పంపే మహాత్ములకు కూడా ఏదైనా పరిహారం చూపించండి" అని సరదాగా రిక్వెస్ట్ చేస్తున్నారు.