బుచ్చయ్య గారి ఆవేదన.. రీజనేంటి ..!
గత కొన్నాళ్లుగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు.
By: Garuda Media | 24 April 2026 7:00 PM ISTగత కొన్నాళ్లుగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. మీడియా ముందుకు వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీ తరఫున ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల పైన ఆయన బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. అయితే నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టుగా ఏదో ఒక కారణం లేకుండా గోరంట్ల బుచ్చయ్య చౌదరి వరుసగా ప్రెస్ మీట్ లు పెట్టడం, వైసిపి అధినేత పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం ఉండవు కదా అనేది రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కల్పిస్తోంది.
ఈ కోణంలో చూసుకుంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి నియోజకవర్గం టెన్షన్ పట్టుకుందని కొందరు చెబుతున్నారు. మరికొందరు వయసు రీత్యా ఆయన వెనకబడిపోతున్నారన్న వాదనను తిప్పికొట్టేందుకే ఇలా చేస్తున్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి గోరంట్లకు కాకుండా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం జనసేన తీసుకునే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. దీనికి సంబంధించి తరచుగా జనసేన నాయకులు కూడా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
ఈ విషయాన్ని గోరంట్ల ఎక్కడా చెప్పడం లేదు. కూటమిలో ఉన్నాం కాబట్టి పరిశీలనలో తప్పు లేదన్నట్టుగా ఆయన భావిస్తున్నప్పటికీ.. మనసులో మాత్రం తన నియోజక వర్గాన్ని జనసేన తీసుకుంటుందన్న ఆవేదనైతే కనిపిస్తోంది. దీనికి తోడు వయసు రీత్యా కూడా ఆయనకు ప్రతిబంధకంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే తన వాయిస్‌ను బలంగా వినిపించేందుకు గోరంట్ల ప్రయత్నిస్తున్నారన్న వాదన రాజకీయాల్లో వినిపిస్తోంది. అదే సమయంలో వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేయాలన్న వ్యూహంతో కూడా గోరంట్ల ఉన్నారని సీనియర్లు అంచనా వేస్తున్నారు.
వాస్తవానికి గత ఎన్నికల్లోనే గోరంట్ల కు టికెట్ ఉండదన్న ప్రచారం జరిగింది. అప్పట్లో జనసేన నాయకుడు ప్రస్తుత మంత్రి కందుల దుర్గేష్ పోటీ చేస్తారని ప్రచారంలోకి వచ్చింది. కానీ చివరి నిమిషం వరకు ఈ విషయం తేలేకపోవడం.. చివర్లో గోరంట్లకు ఇవ్వడం తెలిసిందే. అప్పట్లో ఆయన ఇదే చివరి ఎన్నికలని కూడా ప్రకటించారు. కానీ ఇప్పుడు మళ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు సంకేతాలు ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తానే పోటీకి రెడీ అవుతున్నానన్న విషయాన్ని పరోక్షంగా మీడియాకు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే తన కార్యకలాపాలలో దూకుడు పెంచారు. పార్టీ పరంగా అదే విధంగా నాయకత్వపరంగా కూడా లోకేష్ ను వెనకేసుకు రావడం గమనార్హం. గతంలో ఇదే లోకేష్ ను గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మాత్రం లోకేష్ కు పగ్గాలు ఎంత త్వరగా అప్పగిస్తే అంత మంచిదని ఆయన చెప్పడం వెనుక వచ్చే ఎన్నికల్లో తన సీట్లు కాపాడుకునే ఉద్దేశం ఉందన్న వాదన పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మరి నిజంగానే గోరంట్ల ఆసలు ఫలిస్తాయి లేకపోతే పార్టీ కీలక నిర్ణయం తీసుకుంటుందా అనేది వేచి చూడాలి.
