Begin typing your search above and press return to search.

రోడ్డు పక్కన చిన్న బండీపై టీ షాపు.. కానీ కోట్లలో మనీ.. ఎలా సాధ్యం..?

ఆర్థిక స్వాతంత్రం పెరగడం.. ఫోన్లు బ్యాంకు అకౌంట్లకు లింక్ కావడంతో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయి.

By:  Tupaki Political Desk   |   21 Oct 2025 4:00 PM IST
రోడ్డు పక్కన చిన్న బండీపై టీ షాపు.. కానీ కోట్లలో మనీ.. ఎలా సాధ్యం..?
X

ఆర్థిక స్వాతంత్రం పెరగడం.. ఫోన్లు బ్యాంకు అకౌంట్లకు లింక్ కావడంతో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయి. కోట్లకు కోట్లను సైబర్ నేరగాళ్లు కొళ్లగొడుతూ భారీ సామ్రాజ్యాన్న సృష్టిస్తు్న్నారు. బిహార్ లోని ‘గోపాల్‌గంజ్‌’ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చల్లోకి ఎక్కింది. ఇది కేవలం సాధారణ పట్టణం మాత్రమే కానీ అక్కడ ఉన్న చాయ్‌ షాపు ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్. ఒక చాయ్ అమ్మే వ్యక్తి ఇంటి నుంచి పోలీసులు ఏకంగా రూ. 1.05 కోట్ల నగదు, బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. ఇది సాధారణ దోపిడీ కాదు.. ఇది సాధారణ వ్యాపారం కాదు.. ఇది దేశ సైబర్‌ నేరాల వలయంలో ఉన్న చీకటి చరిత్రలో మరో పేజీ. ఒక టీ షాపు వెనక ఇంత పెద్ద ఆర్థిక నెట్‌వర్క్‌ ఉండడం అనేది ఎంత విస్మయపరిచే విషయమో.

భారీగా పట్టుబడిన వస్తువులు..

ఈ ఘటన సైబర్‌ మోసాలపై పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌ సమయంలో వెలుగులోకి వచ్చింది. సైబర్‌ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిచ్చిన సమాచారం ఆధారంగా టీ షాపు యజమాని ఇంటిని తనిఖీ చేశారు. ఆ ఇంట్లో బయటపడింది నగదు కట్టలే కాదు.. 85 ATM కార్డులు, 75 బ్యాంక్ పాస్‌బుక్కులు, 28 చెక్‌బుక్కులు, 2 ల్యాప్‌టాప్‌లు, 3 మొబైల్ ఫోన్లు, ఒక లగ్జరీ కారు కూడా. ఇవి కేవలం వస్తువులు కావు ఇవన్నీ ఒక పెద్ద సైబర్‌ క్రైమ్‌ సిండికేట్‌ కు చిహ్నాలు.

టీ షాపులో పెట్టి వైట్ గా మార్చడం..

దర్యాప్తులో తేలిన విషయాలు మరింత భయపెడుతున్నాయి. ఈ ముఠా వివిధ బ్యాంకుల ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసి, దానిని వేర్వేరు ఖాతాల్లోకి మళ్లిస్తూ.. చివరికి నగదు రూపంలో మార్చి ఈ టీ షాపు వంటి సాధారణ వ్యాపారాలలో పెట్టి వైట్ గా మార్చేది. చాయ్‌ కప్పులో లెక్కించలేని లావాదేవీలు జరిగేవి. సైబర్‌ ప్రపంచంలో ‘డిజిటల్‌ చాయ్‌’ అని చెప్పవచ్చేమో కానీ.. దాని వాసన మాత్రం నేరానికి చెందినదే.

కేసుతో ఖాతాదారులకు జ్ఞానోదయం..

ఈ కేసు ఒక పెద్ద సామాజిక సత్యాన్ని బయటపెడుతోంది. నేటి రోజుల్లో సైబర్‌ నేరాలు పుస్తకాలలో కాదు.. మన పక్కింటి గల్లీల్లో జరుగుతుంది. సాంకేతిక పరిజ్ఞానం అందరికీ అందుబాటులోకి రావడం ఒక గొప్ప మార్పు అయినా.. దాన్ని దుర్వినియోగం చేసే వారు ఈ మార్పును ఆయుధంగా మార్చుకున్నారు. చాయ్‌ షాపులు, మొబైల్‌ రీచార్జ్‌ సెంటర్లు, చిన్న వ్యాపారాలు ఇవన్నీ ఈ ముఠాల కోసం ఆర్థిక ‘మాస్క్‌’లుగా మారాయి.

ఆశ్చర్యం కలిగిస్తున్న దర్యాప్తు..

దర్యాప్తు అధికారులు చెప్తున్న విషయాలు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ నెట్‌వర్క్‌ బిహార్‌కే పరిమితం కాలేదు.. దీని లింకులు బెంగళూర్, ఢిల్లీ, గుజరాత్‌ వరకు విస్తరించినట్లు ఆధారాలు దొరికాయి. ఈ ఖాతాలు జాతీయ సైబర్‌ నెట్‌వర్క్‌ వ్యవస్థకు అనుసంధానించబడి ఉన్నాయా? లేదా? అన్నది కూడా ఇప్పుడు విచారణలో తేలాల్సి ఉంది. ఒక చిన్న పట్టణంలో ఇంత పెద్ద నెట్‌వర్క్‌ పనిచేయడం అంటే.. అది సాంకేతిక ప్రపంచంలోని సైబర్ నేరగాళ్ల సునామీ లాంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు.

అన్ని డిపార్ట్ మెంట్ల విచారణ..

ఇప్పుడు ఈ కేసులో కేవలం రాష్ట్ర పోలీసులే కాదు.. ఆదాయపు పన్ను శాఖ, ATS, సైబర్‌ క్రైమ్‌ స్పెషల్‌ యూనిట్‌ కూడా దిగాయి. ఇంత భారీగా నగదు బయటపడడం వెనుక ‘నకిలీ డిజిటల్‌ ఐడీలు’ లేదా ‘క్రిప్టో లావాదేవీలు’ ఉన్నాయా అన్నదానిపై విచారణ కొనసాగుతోంది. కానీ, ఈ కేసు మనందరికీ ఒక హెచ్చరిక. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ ఎంత సౌకర్యంగా మారిందో.. అంతే ప్రమాదకరంగా కూడా మారుతుంది. బ్యాంకు ఖాతా, మొబైల్‌ లింక్‌, ఓటీపీ (OTP) ఇవన్నీ సౌకర్యం పేరుతో మన డబ్బును మోసగాళ్లకు అందించే తాళాలుగా మారుతున్నాయా? అంటే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అవుననే అనిపిస్తుంది. ప్రతి రోజూ వేలాది మంది ‘మీ ఖాతా బ్లాక్ అయింది’ లేదా ‘మీ KYC రద్దు అవుతుంది’ అనే మెసేజ్‌లకు స్పందిస్తూ వేలాది నుంచి కోట్లాది రూపాయలను పోగొట్టుకుంటున్నారు.

సైబర్‌ నేరాలు కేవలం కంప్యూటర్‌ సిస్టమ్స్‌ను కాదు.. మన నమ్మకాన్ని కూడా దోచుకుంటున్నాయి. గోపాల్‌గంజ్‌ చాయ్‌ షాపు మనకు ఒక పాఠం నేర్పింది. ఈ కేసు చివరికి ఎంతవరకు వెళ్తుందో తెలియదు. కానీ ఒక సత్యం మాత్రం స్పష్టమైంది. సాంకేతికత పెరుగడం వెనుక మోసాలు కూడా నక్కి నక్కి ఉంటాయని.. ఏది ఏమైనా సైబర్ నేరాల విషయంలో ప్రజలు మరింత అప్పమత్తంగా ఉండాల్సిందే.