Begin typing your search above and press return to search.

ఏపీకి గూగుల్ అందుకే వెళ్లింది... కర్ణాటక మంత్రి వ్యాఖ్యలు!

టెక్ దిగ్గజం గూగుల్.. విశాఖపట్నంలో 1 గిగావాట్‌ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో అక్టోబర్ 14న ఢిల్లీలో అవగాహన (ఎంఓయూ) ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   16 Oct 2025 12:01 PM IST
ఏపీకి గూగుల్  అందుకే వెళ్లింది... కర్ణాటక మంత్రి వ్యాఖ్యలు!
X

టెక్ దిగ్గజం గూగుల్.. విశాఖపట్నంలో 1 గిగావాట్‌ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో అక్టోబర్ 14న ఢిల్లీలో అవగాహన (ఎంఓయూ) ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఏపీని టెక్నాలజీ హబ్ గా తీర్చిదిద్దే విషయంలో దీన్ని కీలక ముందడుగుగా భావిస్తున్నారు. అయితే ఈ విషయం కర్ణాటకలో పొలిటికల్ వార్ కి తెరలేపింది. దీంతో అక్కడి ఐటీ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు!

అవును... విశాఖకు గూగుల్ తరలివచ్చే విషయం కర్ణాటక రాజకీయాల్లో కొత్త రచ్చకు తెరలేపిందనే చెప్పాలి. గూగుల్ తో ఏపీలోని కూటమి ప్రభుత్వ ఎంఓయూ కుదురుచుకున్న వేళ.. ఇది కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వ ఫెయిల్యూర్ గా అక్కడి ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్నాయి. ఇందులో భాగంగా... "కర్ణాటకకు నష్టం.. ఆంధ్రకు లాభం!" అని మొదలు పెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు చిక్కబళ్లాపుర ఎంపీ కే సుధాకర్.

ఈ సందర్భంగా ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ఆయన... ఒకప్పుడు ప్రపంచ టెక్ దిగ్గజాలకు ఇష్టమైన గమ్యస్థానంగా ఉన్న బెంగళూరు, కర్ణాటక.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీనత, అహంకారం, విధాన పక్షవాతం కారణంగా తమ స్థానాన్ని కోల్పోతున్నాయని అన్నారు. ఆంధ్ర ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షిస్తుండగా.. కర్ణాటక అవకాశాలు, ఉద్యోగాలు వేరే చోటికి తరలిపోవడాన్ని చూస్తోందని అన్నారు.

స్పందించిన కర్ణాటక ఐటీ మంత్రి!:

ఈ వ్యవహారంపై కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు. ఈ సందర్భంగా గూగుల్ కు ఆంధ్రప్రదేశ్ అందించే ప్రోత్సాహకాలను ప్రస్థావించారు. వాటిలో రూ.22,000 కోట్ల సబ్సిడీలు, 25% రాయితీ భూమి, 25% ఫ్రీ వాటర్ సబ్సిడీ, ఉచిత విద్యుత్ వంటివాటితో పాటు పూర్తి స్టేట్ జీఎస్టీ రీయింబర్స్ మెంట్ ఉన్నాయని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రమైనా ఇన్ని ఆఫర్స్ ఇస్తుందా అని ఆయన ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

మరోవైపు... ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు, విమర్శిస్తున్నట్లు.. ఐటీ కంపెనీలు కర్ణాటక నుండి తరలిపోతుంటే, 'గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్' ఈ సంవత్సరం రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి ఉండేది కాదని కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర వ్యాఖ్యానించారు.

డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు!:

ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ... ఆంధ్ర మంత్రి నారా లోకేష్ లేదా మరెవరి వ్యాఖ్యలకు తాను స్పందించదలచుకోలేదని మొదలుపెట్టి... మౌలిక సదుపాయాలు, మానవ వనరుల నుండి.. ఆవిష్కరణ, స్టార్టప్‌ ల వరకు.. బెంగళూరులో అన్నీ ఉన్నాయని.. సుమారు 2 లక్షల మంది విదేశీయులు సహా దాదాపు 25 లక్షల మంది ఇక్కడ పనిచేస్తున్నారని తెలిపారు.

ఇదే సమయంలో... కేంద్రానికి బెంగళూరు 39-40% ఆదాయం అందిస్తుందని.. అద్దె కార్యాలయాల నుండి పనిచేస్తున్న అనేక విదేశీ కంపెనీలు ఇప్పుడు తమ సొంత క్యాంపస్‌ లను ఏర్పాటు చేస్తున్నాయని అన్నారు. అదే బెంగళూరు శక్తి అని.. దేశంలో ఏ రాష్ట్రం దీనికి సాటిరాదని ఆయన నొక్కి చెప్పారు.