బెంగళూరులో రూ.45 లక్షలు VS లండన్‌లో రూ.1.15 కోట్లు: ఏది బెటర్?
జీతం అంటే ఎంత వస్తోంది అన్నదానికంటే ఆ డబ్బుతో మనం ఎలా జీవించగలుగుతున్నామన్నదే అసలు ప్రశ్న.
By: A.N.Kumar | 7 Jan 2026 2:00 AM ISTజీతం అంటే ఎంత వస్తోంది అన్నదానికంటే ఆ డబ్బుతో మనం ఎలా జీవించగలుగుతున్నామన్నదే అసలు ప్రశ్న. ఇదే అంశాన్ని తాజాగా బెంగళూరులో పని చేస్తున్న గూగుల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వైభవ్ అగర్వాల్ లింక్డిన్‌లో ఆసక్తికరంగా వివరించారు. బెంగళూరులో రూ.45 లక్షల వార్షిక జీతం వర్సెస్ లండన్‌లో 108,000 పౌండ్ల సాలరీ (రూ.1.15 కోట్లు) ఈ రెండింటి మధ్య వాస్తవ జీవన తేడాలను ఆయన ‘పర్చేసింగ్ పవర్ పారిటీ’ కోణంలో విడమరిచి చెప్పారు. అదే ఇప్పుడు వైరల్ అయ్యింది.
సాధారణంగా ఎవరైనా విదేశాల్లో కోటి రూపాయల ప్యాకేజీ వచ్చిందంటే ఆశ్చర్యంగా చూస్తాం. కానీ లండన్‌లో రూ.1.15 కోట్లు ( 108,000 పౌండ్లు) సంపాదించడం కంటే బెంగళూరులో రూ.45 లక్షలు సంవత్సరానికి సంపాదించడమే మిన్న అని వైభవ్ అగర్వాల్ లెక్కలతో సహా నిరూపించారు.
పేపర్‌పై చూస్తే £108,000 అంటే దాదాపు మన రూపాయల్లో 1.15 కోట్లు. కానీ వాస్తవ జీవితంలో లెక్కలు భిన్నంగా ఉంటాయని అగర్వాల్ స్పష్టం చేశారు. బెంగళూరులో రూ.45 లక్షలు సంవత్సరానికి జీతం పొందే వ్యక్తికి నెలకు సుమారు రూ.2.7 లక్షల వరకు చేతికి వస్తుంది. ఈ ఆదాయంతో గేటెడ్ కమ్యూనిటీలో లగ్జరీ 2 బెడ్ రూం హాల్ ఫ్లాట్, ఇంటి పనివాళ్లు, యాప్ ఆధారిత గ్రాసరీ డెలివరీలు, క్యాబ్ ప్రయాణాలు.. ఇవన్నీ సులభంగా సాధ్యమవుతాయి. సమయాన్ని ఆదా చేసుకునే సౌలభ్యం ఉండటంతో ఇలాంటి ఆదాయం కలిగిన వారు భారత్‌లో టాప్ 1 శాతం జీవనశైలిని ఆస్వాదిస్తున్నారనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
అదే సమయంలో లండన్ లో పరిస్థితి భిన్నంగా ఉంటుందని అగర్వాల్ వివరించారు. 108,000 పౌండ్ల వార్షిక జీతం నుంచి పన్నులు, నేషనల్ ఇన్సూరెన్స్ పోయాక నెలకు సుమారు 6,100 పౌండ్లు మాత్రమే మిగులుతుంది. లండన్ జోన్–2లో ఒక సాధారణ 1 బెడ్ రూం హాల్ ఫ్లాట్‌కే దాదాపు 2,200 పౌండ్లు అద్దె వెచ్చించాల్సి వస్తుంది. దాంతో ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, స్వయంగా వంట, ఇంటి పనులు చేయాల్సిన పరిస్థితి. జీవితం సౌకర్యవంతంగానే ఉన్నా అది ‘లగ్జరీ’ కంటే ‘అప్పర్ మిడిల్ క్లాస్’ జీవనశైలి మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.
ఈ పోస్టుకు స్పందించిన పలువురు ప్రొఫెషనల్స్ చర్చను మరింత విస్తరించారు. ఒకరు “విదేశాలకు వెళ్లేది కేవలం జీతం కోసం కాదు. మల్టీకల్చరల్ అనుభవం నేర్చుకునే అవకాశాలు, జీవన నాణ్యత, విద్య, ఆరోగ్య వ్యవస్థ, స్వచ్ఛమైన గాలి, తక్కువ నేరాలు .. ఇవన్నీ కూడా కారణాలు. ఇంటి పనులు మనమే చేయడం వ్యక్తిగత ఎంపిక” అని వ్యాఖ్యానించారు.
మరో యూజర్ అయితే ఈ పోలిక ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ “సోషల్ మీడియాలో రూ.కోటి, రూ.1.5 కోట్లు ప్యాకేజ్ అంటూ పోస్టులు చూస్తాం. లోతుగా చూస్తే అవి విదేశీ జీతాలు. అక్కడ ఇక్కడ పోల్చడం తప్పుదారి పట్టించే సమాచారమే” అని రాశారు.
మొత్తానికి ఈ చర్చ ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. జీతం ఎంత అన్నదికంటే ఆ డబ్బుతో మనం పొందే జీవన నాణ్యతే అసలు విలువ. దేశం మారితే జీవితం కూడా మారుతుందన్న నిజాన్ని ఈ గూగుల్ టెకీ విశ్లేషణ మరోసారి గుర్తు చేసింది.
