గూగుల్ ఆఫీస్ కు ‘బెడ్‌బగ్స్ వెర్షన్ 2.0!’.. బెడద.. వణుకుతున్న ఉద్యోగులు..
అది ప్రపంచాన్ని గెలిచిన సంస్థ ప్రపంచానికే నడక నేర్పుతున్న సంస్థ కానీ.. ఒక చిన్న జీవిని మాత్రం గెలవలేకపోయింది.
By: Tupaki Political Desk | 21 Oct 2025 6:00 PM ISTఅది ప్రపంచాన్ని గెలిచిన సంస్థ ప్రపంచానికే నడక నేర్పుతున్న సంస్థ కానీ.. ఒక చిన్న జీవిని మాత్రం గెలవలేకపోయింది. కనిపించని కరోనా లాంటి జీవి (వైరస్) అనుకుంటే పొరబాటే.. కంటికి కనిపించేది. చీమ కంటే కొంచెం పెద్దగా ఉండేదే.. దాని బాధను తట్టుకోలేక దెబ్బకు వర్క్ ఫ్రం హోం ఇచ్చింది. ఆ సంస్థ పేరే ‘గూగుల్’.. ఇక ఆ జీవి పేరు ‘నల్లి’.. అవును సాక్షాత్తు నల్లి.. ఇది పల్లెటూరులోని నులక మంచాల్లో కనిపించే జీవి కాదు కదా.. అనుకునేరు సాక్షాత్తు అదే.. మరి ఆఫీస్ ఉంది కూడా పల్లెటూరిలో కాదు.. ప్రపంచం కంటే వందేళ్లు ముందే డెవలప్ అయిన న్యూయార్క్ లో ఈ విషయం విన్న ప్రపంచం ముక్కుపై వేలేసుకుంటుంది.
న్యూయార్క్ లోని మాన్ హట్టన్ ఆఫీస్ లో..
సాంకేతిక ప్రపంచంలో ఎత్తైన ఆకాశహర్మ్యాలు, మిలియన్ డాలర్ల సర్వర్లు, అత్యాధునిక సాఫ్ట్‌వేర్ వ్యవస్థలు ఉన్నా.. ప్రకృతి మనిషికి ఎప్పుడూ ఒక సవాల్ విసురుతూనే ఉంటుంది. ‘నువ్వు ఎంత పెద్దవాడివైనా, జీవన మౌలిక స్థాయిలను మరచిపోకు.’ న్యూయార్క్ మాన్‌హట్టన్‌లోని గూగుల్ చెల్సియా క్యాంపస్‌లో ఇటీవల చోటుచేసుకున్న నల్లుల బెడద ఇదే పాఠాన్ని గుర్తు చేసింది. ప్రపంచాన్ని కదిలించే డిజిటల్ శక్తి కేంద్రం కూడా చివరికి ఒక చిన్న నల్లిపై గెలవలేక ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ జారీ చేయాల్సి వచ్చింది.
నల్లులను గుర్తించిన స్నీపర్ డాగ్..
ఈ ఘటన హాస్యంగా ఉన్నా.. దాని వెనక ఉన్న సత్యం మరింత లోతైనది. గూగుల్ పర్యావరణ, ఆరోగ్య భద్రత విభాగం ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్ ప్రకారం.. స్నీపర్ డాగ్ ఆఫీస్ ప్రాంగణంలో నల్లులను గుర్తించింది. వెంటనే సంస్థ అక్కడి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేసి, ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేయమని ఆదేశించింది. ఇది ఏ చిన్న కంపెనీ చేసిన చర్య కాదు.. ప్రపంచంలోని అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సంస్థ తీసుకున్న నిర్ణయం.
స్థానికంగా వినియోగించే వస్తువుల్లో దాక్కున్న బగ్స్..
గూగుల్ ఆఫీసులు డిజిటల్ ప్రాసెస్‌లతో నిండినా, అక్కడ కూడా మానవ శరీరాలు, వాతావరణం, గాలి, వస్త్రాలు, పుస్తకాలు ఇవన్నీ సహజ జీవ వ్యవస్థలో భాగమే. నల్లులు ఎక్కడైనా ఉండగలవు. కానీ, ఈ సమస్యను ఒక బగ్‌గా కాకుండా ఒక సిస్టమిక్ సిగ్నల్‌గా గూగుల్ చూడడం ఆసక్తికరంగా కనిపిస్తుంది. కంపెనీ తక్షణమే శానిటైజేషన్, పర్యావరణ శుభ్రత ప్రారంభించింది. సోమవారం వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించి, తర్వాత మాత్రమే ఆఫీసులు తిరిగి ప్రారంభించింది.
ఉద్యోగులకు గూగుల్ సూచనలు..
కార్యాలయంలో నల్లుల నివారణ చర్యలతో పాటు, ఉద్యోగులు తమ ఇళ్లలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సంస్థ సూచించింది. ‘దురద, చర్మంపై ఎర్రటి మచ్చలు కనిపిస్తే వెంటనే రిపోర్ట్ చేయాలి’ అని ఆదేశాలు జారీ చేసింది. ఇది కేవలం శరీర ఆరోగ్య సమస్య కాదు అది కార్పొరేట్ జీవన శైలి ఎక్కడికెళ్తోందో చూపించే సూచిక.
గతంలో కూడా ఇలాంటి సమస్యే.. అప్పుడేం చేశారంటే..?
న్యూయార్క్‌లోని గూగుల్ ఆఫీసులో ఇది మొదటిసారి కాదు. 2010లో కూడా ఇలాంటి నల్లుల బెడద తలెత్తింది. అప్పటి నుంచి ప్రొఫెషనల్స్ తో నివారణ చర్యలు తీసుకున్నప్పటికీ, ఈ సారి పరిస్థితి మరలా ఎదురవడం విస్మయం కలిగించే విషయం. ఆఫీసులో ఉన్న భారీ జంతువుల బొమ్మలు, కవర్లు, అలంకరణ వస్తువులు. ఇవి నల్లులు దాక్కునేందుకు.. అనువైన వాతావరణాన్ని కల్పించాయంటున్నారు ఆఫీస్ యాజమాన్యం.
సోషల్ మీడియాలో కామెంట్లు..
ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో సరదా వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. ‘గూగుల్ బగ్స్ ఫిక్స్ చేస్తుందే కానీ, ఆఫీసు బగ్స్ ఫిక్స్ చేయలేకపోయింది’ అంటూ ట్రోల్స్ ఊపందుకున్నాయి. ప్రపంచం ఎంత డిజిటల్ అయినా.. జీవ ప్రపంచంతో కలిసే ఉండాలి. ఒక చిన్న నల్లి, ఒక పెద్ద సంస్థలో పెద్ద సమస్య సృష్టించగలదని తెలిసింది.
ఒక చిన్న పురుగు ప్రపంచంలోని అతిపెద్ద సంస్థను తాత్కాలికంగా నిలిపివేసిందంటే.. అది ప్రకృతి మనిషికి ఇచ్చిన సున్నిత హెచ్చరికగా అర్థం చేసుకోవచ్చు. ‘నువ్వు సృష్టించిన టెక్నాలజీ ఎంత బలమైనదైనా, నన్ను మించలేవు’ అని. గూగుల్ ఉద్యోగులు మళ్లీ ఆఫీసుకు చేరుకుంటున్నారు. కానీ ఈ ఘటన తర్వాత వారు కేవలం కీబోర్డ్‌పై టైప్ చేయడం మాత్రమే కాదు.. కుర్చీ కింద కూడా చూస్తూ కూర్చోవాల్సిందే. ఎందుకంటే, సాంకేతిక ప్రపంచానికి ఇప్పుడు ఒక కొత్త సమస్య వచ్చేసింది అదే ‘బెడ్‌బగ్స్ వెర్షన్ 2.0!’
