Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డిని రక్షించిన ప్రియాంక్ ఖర్గే.. లోకేశ్ ట్రాప్ లో టాప్ లీడర్స్?

ఇలా ఏపీకి నలువైపులా ఉన్న మూడు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలకు గూగుల్ సెగ తగిలితే, తెలుగు రాష్ట్రం తెలంగాణలో మాత్రం చిత్రమైన పరిస్థితి నెలకొందని అంటున్నారు.

By:  Tupaki Political Desk   |   19 Oct 2025 11:00 PM IST
రేవంత్ రెడ్డిని రక్షించిన ప్రియాంక్ ఖర్గే.. లోకేశ్ ట్రాప్ లో టాప్ లీడర్స్?
X

వైజాగ్ నగరంలో గూగుల్ పెట్టుబడుల ప్రకటనతో దక్షిణాది రాజకీయాలు వేడెక్కాయి. ఏపీలో ఈ పెట్టుబడులపై అధికార, విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతుండగా, పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడుల్లో సైతం అక్కడి అధికార పక్షాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు కథనాలు వస్తున్నాయి. కర్ణాటక మంత్రులతో ఏపీ మంత్రి లోకేశ్ ఏకంగా ట్విటర్ వేదికగానే వాదనకు దిగుతున్నారు. తమిళనాడులో సైతం గూగుల్ పెట్టుబడులను ఆకర్షించడంలో అధికార డీఎంకే విఫలమైందంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తమిళ మీడియా సైతం స్టాలిన్ ప్రభుత్వంపై ప్రత్యేక కథనాలతో విరుచుకుపడుతోంది. ఇలా ఏపీకి నలువైపులా ఉన్న మూడు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలకు గూగుల్ సెగ తగిలితే, తెలుగు రాష్ట్రం తెలంగాణలో మాత్రం చిత్రమైన పరిస్థితి నెలకొందని అంటున్నారు.

నిజానికి ఏపీలో ఐటీ పెట్టుబడులు వస్తే తెలంగాణలో కొందరు నేతలు ఉలిక్కిపడుతుంటారు. ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టి లబ్ది పొందాలని చూసే కొన్ని పార్టీలు ఏపీ విషయంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తుంటారు. గతంలో ఏపీ ప్రాజెక్టులపై ఓ పార్టీ నేతలు వ్యవహరించిన తీరును ఎత్తిచూపుతున్నారు. అయితే గూగుల్ భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించిన వేళ.. ఆ పార్టీ ఎలా స్పందిస్తుందనేది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేలా రాజకీయంగా వాడుకుంటుందని పరిశీలకులు అంచనా వేశారు.

అయితే తెలంగాణలో చిత్రంగా గూగుల్ పై ఎలాంటి రాజకీయ ప్రకటన రాకపోవడం పరిశీలకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తెలంగాణలో ఫ్యూచర్ సిటీ పేరుతో ఏపీ రాజధాని అమరావతికి సమాంతరంగా మరో నగరం కట్టాలని భావిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న పార్టీలు.. గూగుల్ రూపంలో భారీ పెట్టుబడి తరలిపోయినా మారు మాట్లాడకపోవడం చర్చనీయాంశమవుతోంది. అయితే, ఈ విషయంలో కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే వల్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రోజులుగా పరిశ్రమలు, పెట్టుబడుల విషయంలో ఏపీ మంత్రి లోకేశ్ తో కర్ణాటక మంత్రులు డీకే శివకుమార్, ప్రియాంక్ ఖర్గే ఎక్స్ వేదికగా వాదులాడుకుంటున్నారు. దీంతో ఏపీ, కర్ణాటక మధ్య పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. దీంతో తెలంగాణ నేతలు ఏపీ, కర్ణాటక వార్ ను ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోవాల్సివస్తోందని అంటున్నారు.

పెట్టుబడుల విషయంలో ఏపీకి తెలంగాణతోనే ఎక్కువ పోటీ ఉంటుందని భావిస్తే, ఇప్పుడు రివర్స్ లో పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. దీనికి కారణం ఏపీ మంత్రి లోకేశ్ వ్యూహమేనా? అని సందేహిస్తున్నారు. పెట్టుబడులు, పరిశ్రమల విషయంలో తెలంగాణతో ఏ మాత్రం పోటీపడకుండా, లోకేశ్ కర్ణాటకను లక్ష్యంగా చేసుకుని పావులు కదపడం వల్ల తమ పార్టీ మాజీ నేత, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరోక్షంగా మేలు చేశారని అంటున్నారు. లోకేశ్ ట్రాప్ లో పడిన కర్ణాటక నేతలు తెలంగాణ నేతలను సేఫ్ చేశారని అంటున్నారు. మరోవైపు తెలంగాణలో ప్రతిపక్ష నేతలు సైతం సైలెంటుగా ఉండటంపై పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.