విమానంలో రోజూ ఆఫీసుకు.. ప్రేమ కోసం ఓ టెకీ నెలకు రూ.2.8 లక్షల ఖర్చు
ఈ ప్రయాణాలకు అయ్యే ఖర్చు వింటే మరింత ఆశ్చర్యం కలుగుతుంది. రెండు నగరాల్లో ఇంటి అద్దెలు, విమాన టిక్కెట్లు, ఉబర్ ఛార్జీలు, కాలిఫోర్నియా పన్నులు కలిపి నెలకు దాదాపు 3,000 డాలర్లు ఖర్చవుతున్నాయి.
By: A.N.Kumar | 14 May 2026 5:00 PM ISTఅమెరికాలో ఉద్యోగం అంటే చాలామందికి మంచి జీతం.. లగ్జరీ లైఫ్.. కార్పొరేట్ కల్చర్ గుర్తొస్తాయి. కానీ కొందరి జీవితాల్లో ఆ విజయాల వెనుక ఎంతటి త్యాగం, కష్టపాటు ఉంటుందో తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గూగుల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హాంగ్ జాసన్ వై కథ కూడా అలాంటిదే. ఉద్యోగం, ప్రేమ, వ్యక్తిగత జీవితం.. ఈ మూడింటినీ బ్యాలెన్స్ చేయడానికి ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రతివారం ఒక నగరం నుంచి మరో నగరానికి విమానంలో ప్రయాణిస్తూ ఆఫీసుకు వెళ్లే ఆయనను ఇప్పుడు ‘సూపర్ కమ్యూటర్’గా పిలుస్తున్నారు.
దక్షిణ కొరియా నుంచి చిన్న వయసులోనే అమెరికాకు వలస వచ్చిన జాసన్ వై ప్రస్తుతం గూగుల్ సంస్థలోని ‘ఫ్లో-ఏఐ’ విభాగంలో పనిచేస్తున్నారు. ఇమేజ్, వీడియో జనరేషన్‌కు సంబంధించిన అత్యాధునిక ఏఐ ప్రాజెక్టులపై ఆయన పని చేస్తున్నారు. కెరీర్ పరంగా బే ఏరియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో పనిచేయడం ఆయన కల. అయితే మరోవైపు ఆయన జీవిత భాగస్వామి సీటెల్‌లోని అమెజాన్ కార్యాలయంలో మంచి స్థాయిలో కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎవరో ఒకరు తమ కెరీర్‌ను త్యాగం చేయాల్సి వస్తుందని చాలామంది భావిస్తారు. కానీ జాసన్ మాత్రం అలాంటి నిర్ణయం తీసుకోలేదు.
“ఆమె కెరీర్‌కు ఇబ్బంది కలగకుండా నా వృత్తి ఎదుగుదలను కూడా కొనసాగిస్తూ మా బంధాన్ని కాపాడుకోవాలనుకున్నాను. అందుకే ఈ ప్రయాణ జీవితం ఎంచుకున్నాను” అని ఆయన చెబుతున్నారు. అందుకే ప్రతి వారం సీటెల్ నుంచి కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌కు విమానంలో ప్రయాణించి ఆఫీసులో పనిచేస్తారు. సాధారణంగా సోమవారం లేదా మంగళవారం బయలుదేరి, గురువారం లేదా శుక్రవారం తిరిగి సీటెల్ చేరుకుంటారు. ఇలా వారానికి రెండు సార్లు విమాన ప్రయాణం ఆయన జీవితంలో భాగమైపోయింది.
ఈ ప్రయాణాలకు అయ్యే ఖర్చు వింటే మరింత ఆశ్చర్యం కలుగుతుంది. రెండు నగరాల్లో ఇంటి అద్దెలు, విమాన టిక్కెట్లు, ఉబర్ ఛార్జీలు, కాలిఫోర్నియా పన్నులు కలిపి నెలకు దాదాపు 3,000 డాలర్లు ఖర్చవుతున్నాయి. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.2.8 లక్షలకు సమానం. సాధారణ మధ్యతరగతి కుటుంబం ఏడాదికి ఖర్చు చేసే మొత్తాన్ని జాసన్ ఒక్క నెలలో తన కమ్యూటింగ్ కోసం వెచ్చిస్తున్నారు.
అయినా కూడా ఆయన తన నిర్ణయంపై ఎక్కడా పశ్చాత్తాపం వ్యక్తం చేయడం లేదు. “సౌకర్యం కంటే ఎదుగుదల ముఖ్యమని నేను నమ్ముతాను. ఈ ప్రయాణం నాకు ఇచ్చే అనుభవం, వ్యక్తిత్వ వికాసం, కెరీర్ అవకాశాలు.. నేను ఖర్చు చేస్తున్న డబ్బుకంటే ఎంతో విలువైనవి” అని ఆయన ధీమాగా చెబుతున్నారు.
ఇంత బిజీ షెడ్యూల్ మధ్య కూడా జాసన్ తన సృజనాత్మకతను వదిలిపెట్టలేదు. గూగుల్‌లో ఏఐ ప్రాజెక్టులతో పాటు, ఖాళీ సమయంలో ఒక పర్సనల్ న్యూస్‌లెటర్ కూడా నిర్వహిస్తున్నారు. దాదాపు 500 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్న ఈ న్యూస్‌లెటర్ ద్వారా టెక్నాలజీ, కెరీర్, జీవన అనుభవాలపై తన ఆలోచనలను పంచుకుంటున్నారు.
నేటి యువత కెరీర్ కోసం ఎంతటి కష్టానికైనా సిద్ధమవుతోందనే విషయం ఈ కథ మరోసారి నిరూపిస్తోంది. అదే సమయంలో ప్రేమ, కుటుంబ బంధాలను కాపాడుకోవడానికి కూడా వారు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారని జాసన్ వై జీవితం స్పష్టంగా చూపిస్తోంది. కెరీర్, రిలేషన్‌షిప్ రెండింటినీ సమానంగా చూసే కొత్త తరం ఆలోచనలకు ఆయన ఒక ప్రతీకగా నిలుస్తున్నారు.
