గూగుల్ కేరాఫ్ విశాఖ...రెండో కోణమిదే !
గూగుల్ డేటా సెంటర్ విశాఖకు వచ్చింది. ఏకంగా ఒక లక్షా 37 వేల కోట్ల విలువైన పెట్టుబడులతో గూగుల్ ని విశాఖలోని అయిదు వందల ఎకరాలలో ఏర్పాటు చేస్తున్నారు.
By: Satya P | 20 Oct 2025 9:10 AM ISTగూగుల్ డేటా సెంటర్ విశాఖకు వచ్చింది. ఏకంగా ఒక లక్షా 37 వేల కోట్ల విలువైన పెట్టుబడులతో గూగుల్ ని విశాఖలోని అయిదు వందల ఎకరాలలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీలో తాజాగా ఒక కీలక ఒప్పందం కుదిరింది. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్ ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ గూగుల్ అధిపతులు అంతా కలసి ఈ ప్రతిష్టాత్మకమైన ఒప్పందాన్ని చేసుకున్నారు. ఆనాటి నుంచి గూగుల్ ఒప్పందం విషయంలో ప్రశంసలు ఏ విధంగా వస్తున్నాయో అదే విధంగా విమర్శలు కూడా కొంత మంది చేస్తున్నారు.
కేవలం ఉద్యోగాలేనా :
గూగుల్ అన్నది అత్యంత ప్రఖ్యాతమైన సంస్థ. అంతే కాదు సాఫ్ట్ వేర్ ఫీల్డ్ లో దిగ్గజ సంస్థ. అలాంటి సంస్థ అమెరికా దాటి మరీ వేరే ఏ దేశంలో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది లేదు. కానీ ఇండియా వైపు చూసింది. అందునా ఏపీ వైపు చూసింది. ఏపీలోని విశాఖను వేదికగా చేసుకుంది. అయితే గూగుల్ విశాఖకు రావడం మీద రకరకాలైన చర్చలు అంతా చేస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయని కూడా ప్రశ్నిస్తూ ఈ ప్రాజెక్ట్ వల్ల ఉపయోగం ఏమిటి అన్న మాటా అంటున్నారు. అయితే ఇక్కడ ఉద్యోగాలు అన్నది ఒక విషయం కాదు, ఆ మాటకు వస్తే ఆ పాయింట్ మీద కూడా డిబేట్లు పెట్టాల్సిన అవసరం అయితే లేదు.
బ్రాండ్ ఇమేజ్ :
గూగుల్ వంటి సంస్థ విశాఖకు వచ్చింది అంటే విశాఖ బ్రాండ్ ఇమేజ్ ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయికి పాకిపోయింది. అంతే కాదు విశాఖ డేటా సెంటర్ నుంచి ఏకంగా పన్నెండు దేశాలకు కనెక్షన్ ఏర్పడుతోంది. విశాఖ ఇంటర్నేషనల్ మ్యాప్ మీద మెరుస్తుంది. సాఫ్ట్ వేర్ ఫీల్డ్ లో విశాఖకు ఒక ప్రత్యేక స్థానం కూడా దక్కుతుంది. ఇలా చాలానే చెప్పాల్సి ఉంటుంది. ఇక డేటా సెంటర్ లో ఎన్నో ఉద్యోగాలు వస్తాయి. అదే సమయంలో అనుబంధ ఉద్యోగాలు అయితే చెప్పలేనన్ని వస్తాయని అంటున్నారు.
ప్రత్యక్ష పరోక్ష ఉపాధి :
డేటా సెంటర్ రావడంతో అనుబంధ సంస్థలు అనేకం వరసగా విశాఖ వస్తాయి. గూగుల్ దిగ్గజమే విశాఖను ఎంచుకుంది అంటే ఐటీ దిగ్గజ సంస్థలు మరిన్ని విశాఖకు తప్పకుండా వస్తాయి. అలాగే డెవలప్మెంట్ సెంటర్లు కానీ ఇతర ఐటీ ఫీల్డ్ కి సంబంధించిన సంస్థలు కానీ రానున్న కాలంలో తప్పకుండా వచ్చి తీరుతాయని అంటున్నారు. దాంతో విశాఖ ఐటీ హబ్ గా మారడం తధ్యమని కూడా చెబుతున్నారు. మరో వైపు చూస్తే రియల్ బూమ్ ఒక్కసారిగా పుంజుకుంటుంది. ఇది విశాఖ అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి మీద ప్రభావం చూపిస్తుంది. అంతే కాదు ఇతర పరిశ్రమలు కూడా వచ్చే వీలుంది.
గూగుల్ గర్వం :
చివరిగా అంతా చెప్పే మాట ఒక్కటే. గూగుల్ రావడం అన్నది విశాఖకు ఒక గర్వమని. గూగుల్ రకతో విశాఖ రూపు రేఖలే సమీప భవిష్యత్తులో మారిపోతాయి. ఇప్పటికే కాస్మోపాలిటన్ కల్చర్ తో ఉన్న విశాఖ రానున్న రోజులలో ఇంటర్నేషనల్ సిటీగా మారడం ఖాయమని అంటున్నారు. విశాఖ బ్రాండ్ ని పెంచే గూగుల్ రాక ఒక శుభ పరిణామంగానే చూడాలని అంతా అంటున్నారు.
