Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్రాకు గోదావరి నీరు... రిజర్వాయర్లు ఏవీ ?

ఉత్తరాంధ్రాకు గోదావరి జలాలను తరలించాలన్న ప్రతిపాదనకు రెండు దశాబ్దాల వయసు దాటిపోయింది. వైఎస్సార్ ఉమ్మడి ఏపీకి సీఎం గా ఉన్న కాలంలో దీని మీద ప్రతిపాదనలు అయితే వచ్చాయి.

By:  Satya P   |   23 Aug 2026 9:29 AM IST
ఉత్తరాంధ్రాకు గోదావరి నీరు... రిజర్వాయర్లు ఏవీ ?
X

ఏదైనా అభివృద్ధితోనే మరింతగా అవసరాలు పెరుగుతాయి. వాటితోనే అవకాశాలు కూడా వస్తాయి. చాన్నాళ్ళుగా ప్రతిపాదనల్లో ఉన్నవి కూడా ఒక్కసారిగా వేగం పుంజుకుని మరీ కళ్ల ముందే బ్రహ్మాండమైన ప్రాజెక్టులుగా అవతరిస్తాయి. ఇపుడు గూగుల్ డేటా సెంటర్ అలాంటిదే అని అంటున్నారు. డేటా సెంటర్ తో నీటి కొరత భారీగా ఏర్పడుతుందని డేటా సెంటర్ వల్ల అనావృష్టి తాండవిస్తుందని దుర్భిక్షం అవుతుందని భావించే వారికి రెండవ కోణం తెలియదు, తెలిస్తే డేటా సెంటర్ ని నెత్తిన పెట్టుకుంటారు. ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్ రాకతోనే పోలవరం ఎడమ కాలువ పనులు వేగవంతం అవుతున్నాయి. గోదావరమ్మ బిరబిరా పారుకుంటూ ఉత్తరాంధ్రా వైపు దూకుడుగా పరుగులు తీస్తోంది. విశ్లేషించుకుంటే ఇదే అసలైన సత్యంగా కనిపిస్తుంది.

అనూహ్యంగా ముందుకు :

ఉత్తరాంధ్రాకు గోదావరి జలాలను తరలించాలన్న ప్రతిపాదనకు రెండు దశాబ్దాల వయసు దాటిపోయింది. వైఎస్సార్ ఉమ్మడి ఏపీకి సీఎం గా ఉన్న కాలంలో దీని మీద ప్రతిపాదనలు అయితే వచ్చాయి. ఉత్తరాంధ్రా సుజల స్రవంతి పేరుతో శంకుస్థాపన కూడా జరిగింది. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అయితే ఇన్నాళ్ళకు ఇన్నేళ్ళకు గూగుల్ డేటా సెంటర్ పుణ్యమాని వడి వడిగా పోలవరం కుడి కాలువ పనులు పూర్తి చేసుకుని గోదావరి దూసుకుని వస్తోంది. ఉత్తరాంధ్రా జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి తరలి వస్తొంది. తాండ‌వ డ్యామ్ లోకి పోల‌వ‌రం నీళ్లు వచ్చి పడనున్నాయి. మొత్తం 20 చిన్న డ్యామ్‌ల‌లో నీరు నిల్వ ఉంచేందుకు ప్ర‌య‌త్నం కూడా జరగనుంది. దీంతో ఒక్కసారిగా ఉత్త‌రాంధ్ర ఏరియా గ్రౌండ్ వాట‌ర్ లెవ‌ల్ ని ఇదంతా పెంచనుంది. ఒక రకంగా గూగుల్ చేస్తున్న ఈ భగీరధ ప్రయత్నం ఫలిస్తోంది. ఉత్తరాంధ్రాతో గోదావరమ్మ పెనవేసుకోనుంది.

పాతిక లక్షల జనాభాతో :

విశాఖ మహా నగరంగా ఏపీలో ఈ రోజుకే ఉంది. అదే విధంగా పాతిక లక్షల జనాభా ప్రస్తుతం ఉంది. రానున్న కాలంలో ఇది రెట్టింపు అవుతుంది. ఇక అనకాపల్లి జిల్లా పరిశ్రమల ముఖ్య కేంద్రంగా మారనుంది. దాంతో పాటుగా తాగు నీటికి సాగునీటికి పరిశ్రమలకు ఇబ్బడి ముబ్బడిగా నీరు అవసరం అవుతుంది. ఇక కొత్తగా విశాఖలో డేటా సెంటర్లు ఏర్పాటు అవుతున్నాయి. వాటికి తగినంత నీరు సమకూర్చాల్సి ఉంది. వీటన్నింటి కోసం కూటమి ప్రభుత్వం శరవేగంగా పోలవరం ఎడమ కాలువ నుంచి గోదావరి నీటిని విశాఖకు తరలించే ప్రయత్నం చేస్తోంది.

గోదావరి నీటిని నిల్వ చేసేదెలా :

ఇవన్నీ ఒక ఎత్తు అయితే పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర కు తరలి వచ్చే గోదావరి జలాలను నిలువ చేసే ప్రయత్నాలు ఇపుడు చర్చనీయాంశం అవుతున్నాయి. నీరు తరలి వస్తుంది సరే రిజర్వాయర్ల మాటేమిటి అని మేధావుల నుంచి అంతా ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రస్తుతం ఉన్న రిజర్వాయర్లు ఏ మాత్రం సరిపోవు, కొత్తగా పెద్ద ఎత్తున రిజర్వాయర్లు నిర్మించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి చూస్తే విశాఖ తాగు నీటికి పరిశ్రమల అవసరాలకు ఏలేరు రిజర్వాయర్ ద్వారా నీరు వస్తోంది. అలాగే రైవాడ, గంభీరం, తాటిపూడి మేఘాద్రిగెడ్డ రిజర్వార్యలను కూడా ఉపయోగిస్తున్నారు. ఇక చూస్తే పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చే నీటిని అనకాపల్లిలోని మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి అలాగే విశాఖ గూగుల్ డేటా సెంటర్ కి కేటాయింపులు అయితే చేశారు. వాటిని కాలువల ద్వారా సరఫరా చేయడం సాధ్యం కాదు, వర్షాకాలంలో వచ్చిన నీటిని దాచుకుని మిగతా కాలాలలో వాడుకోవాల్సి ఉంటుంది.

కొత్త రిజర్వాయర్లు కట్టాల్సిందే :

గోదావరి నీరు రావడం కాదు వరద సమయంలో గ్రావిటీగా ఆ నీరు వస్తుంది. మరి వర్షాలు వరదలు లేని సమయంలో ఏమి చేస్తారు. అంటే తప్పనిసరిగా కొత్త రిజర్వాయర్లు కట్టాల్సిందే. అంతే కాదు గూగుల్ డేటా సెంటర్ కి అయినా మరే పరిశ్రమలకు అయినా పైపు లైన్లు వేసి మరీ రిజర్వాయర్ల నుంచి నీటిని తరలించాలి. అపుడే గోదావరి నీరు వచ్చినా సార్ధకత చేకూరుతుంది అని నిపుణులు అంటున్నారు. దీని మీద జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ ఎవరికైతే ఎక్కువ నీటి అవసరాలు ఉంటాయో వారే సొంతంగా కొత్తగా స్టోరేజ్ రిజర్వాయర్లు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అన్నారు. ఎంటీపీసీ, ఎస్సీజెడ్, రైల్వేస్, డిఫెన్స్ ఏయూ వంటి సంస్థలు స్టోరేజ్ పాయింట్స్ ని ఏర్పాటు చేసుకోవాలని ప్రతిపాదించారు. ఎన్ని వీలైతే అన్ని స్టోరేజ్ రిజర్వాయర్లు ఏర్పాటు చేసుకోవాలని కొణతాల సూచించారు. ఈ విషయం మీద దృష్టి పెట్టామని ఆయన చెప్పారు.