ఆ జిల్లాలకు రియల్ గా దశ తిరిగింది !
అభివృద్ధి ఉన్న చోటే అంతా ఉంటుంది. అభివృద్ధి చుట్టూనే అన్నీ అల్లుకుని ఉంటాయి. ఎక్కడ పరిశ్రమలు ప్రాజెక్టులు వస్తాయో అక్కడే జనాలు చేరుతారు.
By: Satya P | 25 Oct 2025 6:16 AM ISTఅభివృద్ధి ఉన్న చోటే అంతా ఉంటుంది. అభివృద్ధి చుట్టూనే అన్నీ అల్లుకుని ఉంటాయి. ఎక్కడ పరిశ్రమలు ప్రాజెక్టులు వస్తాయో అక్కడే జనాలు చేరుతారు. అక్కడే ట్రాఫిక్ ఏర్పడుతుంది. అలా ఉన్నఫళంగా భూములకు రెక్కలు వస్తాయి. ధరలు పెరుగుతాయి. నివాసాలకు కూడా ఎంతో గిరాకీ ఏర్పడుతుంది. ఏపీలో చూస్తే అనూహ్యంగా మూడు జిల్లాల దశ తిరిగింది. ఒక్కసారిగా ఆ మూడు జిల్లాలలో అనూహ్యమైన మార్పు కనిపిస్తోంది అని అంటున్నారు.
రియల్ బూమ్ తో :
ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఉత్తరాంధ్రాలో ఆ మూడు జిల్లాలకూ ఎక్కడ లేని డిమాండ్ వచ్చిపడుతోంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు అక్కడికే వస్తున్నాయి. భవిష్యత్తు అంతా అక్కడే ఉంది. దాంతో ఆటోమేటిక్ గా వాటి వైపు అందరి చూపు పడుతోంది. మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం ఈ ప్రాంతంలో శరవేగంగా పుంజుకుంటోంది. ఉత్తరాంధ్రాలో విశాఖ మొదటి నుంచి మంచి ఊపు మీద ఉన్న ప్రాంతమే. ఇపుడు విశాఖ శివారు ప్రాంతాలు కూడా మంచి డిమాండ్ ని అందుకుంటున్నాయి. అలాగే విజయనగరం అనకాపల్లి జిల్లలకు వైభోగం అందుతోంది.
పెట్టుబడుల వరదతోనే :
ఈ మూడు జిల్లాలకు పెట్టుబడుల వరద పారుతోంది. అనేక దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ప్రభుత్వం కూడా వారికి తగిన విధంగా ప్రోత్సాహకాలు రాయితీలు అందిస్తోంది. దాంతో పెట్టుబడులకు కేరాఫ్ గా ఈ జిల్లాలు ఏపీలో అన్నింటా ముందున్నాయి. విశాఖలో అంటేనే పారిశ్రామిక నగరంగా పేరు ఉంది. ఇపుడు ఐటీ సిటీగా చెబుతున్నారు దాంతో పాటు గూగుల్ డేటా సెంటర్ విశాఖకు రావడంతో ఇక రియల్ ఎస్టేట్ రంగం ఉత్సాహంగా ఉరకలు వేస్తోంది. అలాగే అనేక ఐటీ దిగ్గజ కంపెనీలు విశాఖలో పెట్టుబడులు పెడుతూండడంతో సమీప ప్రాంతాల్లో భూములకు రెక్కలు వస్తున్నాయి.
అక్కడ దూకుడుగా :
అనకాపల్లి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఈ ప్రాంతంలోనే వస్తోంది. దాంతో సమీప గ్రామీణ ప్రాంతాలకు ఎంతో గిరాకీ ఏర్పాడుతోంది. అక్కడ భూముల ధరలు ఇపుడు బంగారం తో సమానంగా ఉన్నాయని రియల్ ఎస్టేట్ రంగం నిపుణులు చెబుతున్నారు. ఇక గూగుల్ డేటా సెంటర్ ఏకంగా అనందపురం మండలంలోకి తర్లువాడలో ఏర్పాటు అవుతోంది. ఇక ఆనందపురం మండలంలో చాలా భాగం విశాఖలో ఉంది. తర్లువాడ ప్రాంతం అనకాపల్లి జిల్లాలో ఉంది. దాంతో అక్కడ దశ తిరిగినట్లే అని అంటున్నారు. అలాగే అడవివరం రాంబిల్లి లో మూడు క్యాంపస్లలో డేటా సెంటర్ క్లస్టర్లు వస్తున్నాయి. ఇలా అనకాపల్లికే పెద్ద పీట వేయడం జరుగుతోంది అంటున్నారు.
ఏఐతో విశాఖకు ఘనత :
ఏఐతో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ తో కొత్త కళ రానుంది. అలాగే విశాఖ నుంచి సీ కేబుల్స్ ద్వారా ప్రపంచంలోని పన్నెండు దేశాలతో కనెక్షన్ నేరుగా ఉంటుంది. అంతే కాదు విశాఖ టూ సింగపూర్, అలాగే మలేషియా, ఆస్ట్రేలియా థాయిలాండ్ లకు కూడా డేటా సెంటర్ ద్వారా అనుసంధనం అవుతుంది దాంతో విశాఖ అంతర్జాతీయంగా కూడా వెలిగిపోతుందని అంటున్నారు. దీంతోనే రియల్ బూమ్ ఇంకా పెరిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎయిర్ పోర్టు చాలుగా :
విజయనగరం వెనకబడిన జిల్లా అని అంతా అంటారు. అయితే భోగాపురం వద్ద ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు రాకతో ఆ జిల్లా దశ పూర్తిగా మారిపోతోంది. ఇప్పటికే రియల్ వ్యాపారం అంతా విజయనగరం వైపుగా షిఫ్ట్ అవుతోంది. నిన్నటి దాకా పెద్దగా పలకని భూములకు కూడా ఇపుడు రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎయిర్ పోర్టుతో పాటు అనుబంధ కార్య కలాపాలు పెద్ద ఎత్తున ఉండబోతున్న క్రమంలో విజయనగరం కూడా ఇక అంతర్జాతీయంగా ప్రముఖ స్థానంలోకి వస్తుందని అంటున్నారు. దీంతో ఈ జిల్లా రియల్ బూమ్ తో కొత్త లెక్కలు చెబుతోంది.
