Begin typing your search above and press return to search.

నకిలీ జాబ్స్, కోడి గుడ్డుపై ఈకల్స్.. ఏపీలో ట్రోలింగ్స్ పీక్స్!

పెట్టుబడులు చెడగొట్టడం, పరిశ్రమలను తరిమేయడం అలవాటైన వైసీపీ నేతలు డేటా సెంటర్ తో ఏదో అయిపోతుందని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని లోకేష్ దుయ్యబట్టారు.

By:  Raja Ch   |   17 Oct 2025 2:00 PM IST
నకిలీ జాబ్స్, కోడి గుడ్డుపై ఈకల్స్.. ఏపీలో ట్రోలింగ్స్  పీక్స్!
X

ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్‌ విశాఖలో ఏర్పాటు చేయనున్న ఏఐ హబ్, డేటా సెంటర్‌ ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ శరవేగంగా దూసుకెళ్లేందుకు ఓ బలమైన శక్తిగా మారనుందని అధికార కూటమి నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఇది కచ్చితంగా గేమ్ ఛేంజర్ ప్రాజెక్ట్ అనేది ప్రభుత్వ పెద్దల మాట. ఈ విషయంలో దీన్ని ఆహ్వానిస్తున్నామని అంటూనే వైసీపీ పలు ప్రశ్నలు లేవనెత్తుతుంది.. ఇది ఉద్యోగాల విషయంలో మరో 'నకిలీ' అని ఎద్దేవా చేస్తుంది.

అవును... ఏపీలో రాజకీయం ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ చుట్టూ తిరుగుతుందని చెప్పినా అతిశయోక్తి కాదేమో. ఈ ప్రాజెక్టును తమ గ్రేట్ సక్సెస్ గా కుటమి ప్రభుత్వం చెప్పుకుంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో మైక్రోసాఫ్ట్‌ సంస్థ తమ డెవలప్మెంట్‌ సెంటర్‌ ను హైదరాబాద్‌ లో పెట్టాక.. ఐటీ రంగంలో భాగ్యనగరం ఎలా అభివృద్ధి చెందిందో.. విశాఖ ఐటీ రంగంలో ఎదిగేందుకు ఈ ప్రాజెక్టు దోహద పడనుందని చెబుతుంది.

అయితే... సుమారు రూ.22,000 కోట్ల భారీ రాయితీల వల్ల ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి చితికిపోతుందని, ఇంతటి రాయితీలు ఇచ్చి గూగుల్ ని తెచ్చుకున్నారని కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే చేసిన వ్యాఖ్యలను వైసీపీ ఎత్తి చూపుతోంది. గూగుల్ రూ.87 వేల కోట్ల పెట్టుబడులతో విశాఖలో డేటా సెంటర్‌ ఏర్పాటుకు ప్రతిపాదించిందని, అయితే... ఈ ప్రాజెక్ట్ వల్ల వచ్చే ఉద్యోగాల సంఖ్య ఎంతో గూగుల్ తో అధికారికంగా చెప్పించాలనేది వైసీపీ మాట.

ఎందుకంటే... పెట్టుబడి మొత్తం ఒక్కో కోటికి ఒక ఉద్యోగాన్ని లేక్కేసుకున్నా.. ఈ డేటా సెంటర్‌ తో 87 వేల ఉద్యోగాలు రావాలని.. పరోక్షంగా ఉపాధి పొందేవారు దీనికి అదనమని.. కాని, అటు సీఎం చంద్రబాబు, ఇటు రైడెన్‌ సంస్థ ప్రతినిధులు.. ఉద్యోగాల సంఖ్య విషయంలో పెదవి విప్పడంలేదని.. ప్రభుత్వ జీవోలోనూ ఈ విషయంపై స్పష్టత కరువైందని వైసీపీ నేతలు వాదిస్తున్నారు.

అయితే... ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్టు ద్వారా 1.88 లక్షల మంది వరకూ ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వస్తాయని చెబుతుంది! దీనిపైనా ట్రోలింగ్స్ మొదలుపెట్టిన వైసీపీ... ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌ ఉద్యోగుల సంఖ్య 1.87 లక్షలైతే.. కొత్తగా ఏర్పాటయ్యే ఒక డేటా సెంటర్‌ లోనే అంతమొత్తంలో ఉద్యోగాలు వస్తాయంట అంటూ వ్యగ్యాస్త్రాలు సంధిస్తోంది.

మరోవైపు.. విపరీతమైన నీటి వినియోగం, విద్యుత్తు వినియోగం వీటికి అనివార్యమైన పరిస్థితుల్లో ప్రజలు కొత్త డేటా సెంటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారనేది ఈ ప్రాజెక్ట్ పై వినిపిస్తోన్న మరో మాటగా ఉంది! దీనిపై స్పందించిన వైసీపీ నేత, మాజీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్... విశాఖ నగరానికి ఏడాదికి ఐదు టీఎంసీల నీళ్లు అవసరమైతే.. ఒక్క గూగుల్ డేటా సెంటర్‌ కే ఏడాదికి మూడు టీఎంసీల నీళ్లు అవసరం అని.. అవి ఎలా సర్దుబాటు చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

కోడిగుడ్డు మంత్రికి ఏమి తెలుసు?:

పెట్టుబడులు చెడగొట్టడం, పరిశ్రమలను తరిమేయడం అలవాటైన వైసీపీ నేతలు డేటా సెంటర్ తో ఏదో అయిపోతుందని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని లోకేష్ దుయ్యబట్టారు. టీసీఎస్, కాగ్నిజెంట్‌ లకు తక్కువ ధరకు భూములివ్వడంపై వైసీపీ వాళ్లే పిల్‌ వేయించారని.. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తే వారికి సమస్య ఏమిటో అర్థం కావడం లేదని అన్నారు.

ఇదే సమయంలో... అప్పటి ఐటీ మంత్రిని పెట్టుబడుల గురించి అడిగితే కోడిగుడ్డు కథలు చెప్పారని, విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమిట్‌ పెట్టినప్పుడు కంపెనీల పేర్లు అడిగితే ఒక్క పేరూ చెప్పలేకపోయారని.. అలాంటి వ్యక్తికి డేటా కేంద్రాల గురించి ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే... కోడి గుడ్డుపై ఈకలు పీకుతున్నట్లు ఉన్న అమర్నాథ్ ను పోలిన ఏఐ ఇమేజ్ ను టీడీపీ తన అధికారిక 'ఎక్స్' లో పోస్ట్ చేసింది.

ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అమరావతి నుంచి దృష్టి మళ్లించడానికే ఈ ప్రచారం, ఈ ట్రోలింగ్ అని వైసీపీ వాళ్లు చెబుతుంటే... ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉంది, అప్పటివరకూ ఓపిక పడితే చేయాల్సింది చేసి చూపిస్తామని టీడీపీవాళ్లు చెబుతున్నారు. ఏది ఏమైనా... ప్రస్తుతం గూగుల్ డేటా సెంటర్ పేరు చెప్పి ఏపీ పాలిటిక్స్ లో ట్రోలింగ్ పీక్స్ కి చేరిందనే చెప్పాలి.