కర్ణాటక కాంగ్రెస్ Vs టీడీపీ.. గూగుల్ వార్ కంటిన్యూ
ఏపీలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటు ప్రకటన తర్వాత దక్షిణ భారతదేశంలో ఇన్విస్టిమెంట్ రేస్ మరింత ఆసక్తికరంగా మారుతోంది.
By: Tupaki Political Desk | 28 Oct 2025 3:36 PM ISTఏపీలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటు ప్రకటన తర్వాత దక్షిణ భారతదేశంలో ఇన్విస్టిమెంట్ రేస్ మరింత ఆసక్తికరంగా మారుతోంది. విశాఖలో రూ.1.36 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు గూగుల్ ప్రకటించిన వెంటనే.. ఈ విషయంలో వెనకబడిన సౌత్ ఇండియా రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. ముఖ్యంగా కర్ణాటక సిలికాన్ వ్యాలీ ఈ భారీ పెట్టుబడిని చేజార్చుకోవడంపై విస్తృత చర్చ జరిగింది. అయితే ఏపీకి గూగుల్ తరలిపోవడానికి ఆ రాష్ట్రం ఇచ్చిన భారీ రాయితీలే కారణమని కర్ణాటక కాంగ్రెస్ చెబుతోంది. ఈ విషయమై తాజాగా కాంగ్రెస్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. దీనికి కౌంటరుగా ఏపీ టీడీపీ కూడా ట్వీట్ వార్ మొదలుపెట్టింది.
గూగుల్ పెట్టుబడులపై ఏపీలో రాజకీయం దుమారం ఒక వైపు కొనసాగుతుండగానే పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 1.80 లక్షల ఉద్యోగాలు కల్పించే గూగుల్ చేజారడంపై అక్కడి ప్రతిపక్షాలు ఆయా ప్రభుత్వాలను దుమ్మెత్తిపోస్తున్నాయి. తమిళనాడులో ఈ విమర్శలు ఒక విధంగా ఉంటే సిలికాన్ వ్యాలీ ఉన్న కర్ణాటకలో తీవ్ర రాజకీయ దుమారం కొనసాగుతోంది. ప్రతిపక్షం విమర్శల నుంచి తప్పించుకోవడం ఒక ఎత్తు అయితే, ఇటీవల తమ రాష్ట్ర ప్రభుత్వంతో ట్వీట్ వార్ కు దిగుతున్న ఏపీ మంత్రి లోకేశ్ జోరుకు బ్రేక్ వేయడమే లక్ష్యంగా కర్ణాటక కాంగ్రెస్ విమర్శలకు దిగుతోంది.
ఏపీకి పెట్టుబడులు తరలివెళ్లిపోవడం, కర్ణాటకలో పారిశ్రామిక వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై కొద్ది రోజులుగా రెండు రాష్ట్రాల మంత్రుల మధ్య ట్వీట్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. కర్ణాటకలో మౌలిక వసతుల సరిగా లేవని అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ రాష్ట్రానికి చెందిన పారిశ్రామిక వేత్తలు తమ ట్విటర్ ఖాతాల్లో పోస్టులు చేస్తే, వారిని తమ రాష్ట్రానికి ఆహ్వానిస్తూ ఏపీ మంత్రి లోకేశ్ వెంటనే స్పందిస్తుండటం వివాదానికి కారణమవుతోంది. ఇది తమ రాష్ట్రానికి నష్టం చేస్తుందని కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే గూగుల్ పెట్టుబడి ప్రకటన కర్ణాటకకు మరింత మంట పుట్టించింది. ఈ నెల 14న గూగుల్ ప్రకటన వచ్చిన వెంటనే, ఈ ఘాటు పక్క రాష్ట్రాలకు మంట పుట్టిస్తుందని లోకేశ్ ట్వీట్ చేశారు. ఆయన అన్నట్లుగానే ఇప్పటికీ కర్ణాటక కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తాజాగా ఒక ట్వీట్ లో గూగుల్ పెట్టుబడులపై అక్కసు వెళ్లగక్కింది. ‘‘కర్ణాటక గూగుల్ ను కోల్పోలేదు. దానిని మరో రాష్ట్రానికి మళ్లించారు. ఉచితాలు, సబ్సిడీల ఆశచూపి దానిని పొందారు. మేము పెట్టుబడుల కోసం అభ్యర్థించం, అడుక్కోం’అంటూ ట్వీట్ చేసింది.
అయితే, ఈ ట్వీట్ పై ఏపీ టీడీపీ కూడా ఘాటుగానే స్పందించింది. ‘‘ఏపీ పురోగతి కర్ణాటక కాంగ్రెస్ ఫేవరెట్ టాపిక్ అయిపోయింది. మన అభివృద్ధి వారికి కాస్త ఘాటు అనిపిస్తోంది’’ అంటూ తిప్పికొట్టింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ సహకారంతో ఏపీ సర్కారు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం పదేళ్లపాటు పన్ను రాయితీలను కల్పించింది. కేంద్రం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదనకు ఒకే చెప్పడంతో అమెరికా వెలుపల భారీ పెట్టుబడి పెట్టేందుకు గూగుల్ రెడీ అయింది. అయితే ఈ పరిణామం రాజకీయంగా కాంగ్రెస్ సర్కారుకు ఇరకాటంగా మారడంతో ఇటు ఏపీ ప్రభుత్వంతోపాటు కేంద్రంలోని బీజేపీపై కర్ణాటక నేతలు విరుచుకుపడుతున్నారు.
