హరీశ్ రావు ఆదర్శం.. టీడీపీ ఎమ్మెల్యే ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే గొండు శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు తెలంగాణకు చెందిన మాజీ మంత్రి హరీశ్ రావు ఆదర్శమంటూ వ్యాఖ్యానించి కొత్త చర్చకు తెరలేపారు.
By: Tupaki Political Desk | 28 Feb 2026 1:00 AM ISTశ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే గొండు శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు తెలంగాణకు చెందిన మాజీ మంత్రి హరీశ్ రావు ఆదర్శమంటూ వ్యాఖ్యానించి కొత్త చర్చకు తెరలేపారు. హరీశ్ రావు మాదిరిగా తాను శ్రీకాకుళానికి శాశ్వత ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటున్నానని శంకర్ మనసులో మాట బయటపెట్టారు. అయితే ఏపీలో వరుసగా గెలుస్తున్న నేతలు ఎందరో ఉండగా, ఎమ్మెల్యే శంకర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి హరీశ్ రావు పేరు ప్రస్తావించడమే ఆసక్తికర చర్చకు కారణమవుతోంది.
తెలంగాణలోని సిద్ధిపేట మోడల్ లో తన నియోజకవర్గం శ్రీకాకుళం కూడా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నానని ఎమ్మెల్యే శంకర్ వ్యాఖ్యానించారు. సిద్ధిపేటను బాగా అభివృద్ధి చేయడం వల్లే బీఆర్ఎస్ నేత హరీశ్ రావు వరుసగా గెలుస్తున్నారని ఆయన ఉదహరించారు. తాను కూడా హరీశ్ రావు మాదిరిగా వరుసగా గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో తనకు మంత్రి పదవులపై ఆశలేదని తెలిపారు. సొంత నియోజకవర్గం అభివృద్ధి, మళ్లీ మళ్లీ ఎమ్మెల్యేగా గెలవాలని అనుకోవడంలో భిన్నాభిప్రాయమేమీ లేకపోయినా, హరీశ్ రావు మాత్రమే తనకు ఆదర్శమంటూ టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ అవుతోంది.
శ్రీకాకుళం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు గొండు శంకర్. అంతకుముందు ఓ గ్రామానికి సర్పంచ్ గా మాత్రమే పనిచేశారు. కానీ, నేరుగా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. తొలి ప్రయత్నంలోనే విజయాన్ని కైవసం చేసుకున్నారు. మరోవైపు పార్టీలో ఆయనకు పోటీగా ఏ నేత లేకపోవడంతో రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపి రెండోసారి గెలవాలని అనుకుంటున్న ఎమ్మెల్యే శంకర్ బీఆర్ఎస్ నేత హరీశ్ రావును ఆదర్శంగా తీసుకున్నానని ఎటువంటి సంకోచం లేకుండా చెప్పడం విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు.
నిజానికి రాజకీయాల్లో హద్దులు ఉండవని, మంచి ఎక్కడ ఉన్నా స్వీకరించవచ్చని ఎమ్మెల్యే గొండు శంకర్ మాటలు స్పష్టం చేస్తున్నాయి. అయితే సిద్ధిపేట స్థాయి అభివృద్ధి శ్రీకాకుళంలో సాధ్యమవుతుందా? హరీశ్ రావు లాంటి 'అప్రతిహత విజేత'గా శంకర్ నిలుస్తారా? అనేది తేలాలంటే ఇలాంటి మాటలు ఒక్కటే సరిపోవని అందుకు అవసరమైన రోడ్ మ్యాప్ కూడా ఉండాలని అంటున్నారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా, రాబోయే ఐదేళ్లలో శ్రీకాకుళం రూపురేఖలు మార్చడానికి ఆయన ఏవిధమైన చర్యలు తీసుకుంటారన్నది ఇక్కడ అత్యంత కీలకంగా వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక టీడీపీలో విజనరీగా అభివృద్దికి రోల్ మోడల్ గా ముఖ్యమంత్రి చంద్రబాబును చెబుతుంటారు. ఆయన నాయకత్వంలో పనిచేస్తున్న ఎమ్మెల్యే శంకర్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి హరీశ్ రావు అభివృద్ది నమూనాను కొనియాడటంపై ఆ పార్టీ వర్గాలు ఎలా స్పందిస్తాయన్నది కూడా ఆసక్తికర చర్చగా మారింది. స్థానిక టీడీపీ కార్యకర్తలు ఈ వ్యాఖ్యలను ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చూడాల్సివుంది.
