చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు.. కొనడం సంగతేమో కానీ.. వీరికి బ్రతుకే భారమవుతోందా?
బంగారం.. భారతీయుల సెంటిమెంట్. కానీ నేడు ఆ పసిడి సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకుంది.
By: Madhu Reddy | 12 Feb 2026 6:00 PM ISTబంగారం.. భారతీయుల సెంటిమెంట్. కానీ నేడు ఆ పసిడి సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకుంది. ధరలు పెరగడం వల్ల కొనేవారికి ఇబ్బంది కలుగుతుంటే, ఆ బంగారాన్ని నమ్ముకుని తరతరాలుగా వృత్తిని కొనసాగిస్తున్న స్వర్ణకారులు ఇప్పుడు వీధిన పడుతున్నారు. అటు ధరల భారం, ఇటు ఆధునిక టెక్నాలజీ పోటీ మధ్య వారి చేతివృత్తి ఉనికిని కోల్పోతోంది. ఒకప్పుడు కళకళలాడిన స్వర్ణకారుల వీధులు ఇప్పుడు వెలవెలబోతున్నాయి.
ఆకాశాన్ని తాకుతున్న ధరలు.. నేలచూపులు చూస్తున్న బ్రతుకులు:
బంగారం ధర పెరిగితే మనమందరం పెట్టుబడిగా చూస్తాం. అయితే, ఆ ధర వెనుక ఉన్న అసలు కష్టం స్వర్ణకారులది. ధరలు పెరగడం వల్ల ప్రజలు కొత్త నగలు చేయించుకోవడం తగ్గించేశారు. దీనివల్ల ఆర్డర్లు లేక చిన్నపాటి స్వర్ణకారులు ఉపాధి కోల్పోతున్నారు. పెద్ద పెద్ద షోరూమ్‌ల హోరులో, ఈ చేతివృత్తి కళాకారులు అదృశ్యమవుతున్నారు. మీకు తెలుసా? ఒకప్పుడు చేత్తో నగిషీలు చెక్కే పనివారు ఇప్పుడు రోజు గడవడానికి ఇతర కూలీ పనులకు వెళ్తున్నారు.
AI మరియు మిషన్ల ధాటి.. సాంప్రదాయానికి చేటు:
ఇక మారుతున్న కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)కారణంగా పెద్ద పెద్ద ఉద్యోగ సంస్ఠలు కుదేలు అవుతున్నాయి. ఇక చిన్న స్వర్ణకారుల జీవితాలు తారుమారవ్వటం లో ఆశ్చర్యం ఏముంది. ఇక ఇప్పటికే త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ జ్యువెలరీ రంగంలోకి ప్రవేశించాయి. అసలు విషయం ఏమిటంటే, ఒక మనిషి వారాల తరబడి కష్టపడి చేసే డిజైన్‌ను ఇప్పుడు మిషన్లు నిమిషాల్లో తయారు చేస్తున్నాయి. కంప్యూటర్ జనరేటెడ్ డిజైన్లు మార్కెట్‌ను ముంచెత్తుతుంటే, సాంప్రదాయక జ్ఞానం కలిగిన పనివారికి విలువ తగ్గుతోంది. సాంకేతికత పెరగడం మంచిదే కావచ్చు, కానీ దానివల్ల ఒక తరం యొక్క నైపుణ్యం కనుమరుగవడం విచారకరం ..
గడ్డు కాలంలో జీవనోపాధి:
ఇకపోతే, ముడిసరుకు ధరలు పెరగడం వల్ల చిన్న చిన్న దుకాణాలు నిర్వహించే వారు పెట్టుబడులు పెట్టలేక పోతున్నారు. స్వర్ణకారులు మాత్రమే కాదు, కుమ్మరి వృత్తి, నేత పని, మేదరి వృత్తి, వడ్రంగి లాంటి చేతి పని వారు కార్పొరేట్ సంస్థల మార్కెటింగ్ మాయాజాలం ముందు నిలబడలేకపోతున్నారు. ఫలితంగా మన సంస్కృతిలో భాగమైన అద్భుతమైన హస్తకళలు మరుగున పడిపోతున్నాయి. అందుకే చదువుకున్న యువత కూడా తండ్రుల వృత్తిని స్వీకరించడానికి వెనుకాడుతున్నారు.
సాంకేతికత ఎంత ముందుకు వెళ్లినా, చేత్తో చేసే పనిలో ఉండే ఆత్మీయత మిషన్లలో దొరకదు. కానీ ధరల భారం మరియు ఆధునికత ఆ అత్మీయతను మింగేస్తున్నాయి అన్నది నిజం. ప్రభుత్వం మరియు సమాజం కలిసి ఈ సంప్రదాయ వృత్తులను కాపాడుకోకపోతే, భవిష్యత్తులో స్వర్ణకారుల వృత్తి కేవలం చరిత్ర పుస్తకాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
