వైద్యశాస్త్రంలో అద్భుతం: ప్రపంచంలోనే అత్యంత అరుదైన ‘గోల్డెన్ బ్లడ్’ విశేషాలివీ
మానవ శరీరం ఒక అంతుచిక్కని రహస్యం. అందులో ప్రవహించే రక్తం ప్రాణధార. సాధారణంగా మనం రక్తం అంటే ఏ, బీ, ఏబీ, ఓ గ్రూపుల గురించే వింటుంటాం.
By: A.N.Kumar | 20 March 2026 4:00 AM ISTమానవ శరీరం ఒక అంతుచిక్కని రహస్యం. అందులో ప్రవహించే రక్తం ప్రాణధార. సాధారణంగా మనం రక్తం అంటే ఏ, బీ, ఏబీ, ఓ గ్రూపుల గురించే వింటుంటాం. వీటికి తోడు పాజిటివ్, నెగటివ్ అనే వర్గీకరణలు మనకు తెలుసు. కానీ, వీటన్నింటికీ భిన్నంగా వైద్య ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసే ఒక అరుదైన రక్త గ్రూప్ ఉంది. అదే ‘ఆర్.హెచ్–నల్’. దీని అరుదుదనం, ప్రాముఖ్యత దృష్ట్యా వైద్యులు దీనిని “గోల్డెన్ బ్లడ్” (బంగారు రక్తం) అని పిలుస్తారు. గడచిన 60 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా కేవలం సుమారు 50 మందిలో మాత్రమే ఈ రక్తాన్ని గుర్తించారంటే ఇది ఎంతటి అరుదైనదో అర్థం చేసుకోవచ్చు.
అసలు ఏమిటీ ‘గోల్డెన్ బ్లడ్’?
సాధారణంగా మన రక్తంలోని ఎర్ర రక్త కణాల (ఆర్.బీసీ) పైన ‘యాంటిజెన్లు’ అనే ప్రోటీన్లు ఉంటాయి. ఇవే మన రక్త గ్రూప్‌ను నిర్ణయిస్తాయి. ఉదాహరణకు ఆర్.హెచ్ సిస్టమ్‌లో దాదాపు 61 రకాల యాంటిజెన్లు ఉంటాయి. వీటిలో ‘డీ’ యాంటిజెన్ ఉంటే దానిని పాజిటివ్ అని, లేకపోతే నెగటివ్ అని అంటాం. అయితే ఈ ఆర్.హెచ్–నల్ రక్తం ఉన్నవారిలో ఆర్.హెచ్ సిస్టమ్‌కు చెందిన 61 యాంటిజెన్లు అసలు ఉండవు. అంటే వీరి ఎర్ర రక్త కణాలు యాంటిజెన్ రహితంగా పూర్తిగా ‘ఖాళీ’గా ఉంటాయి. ఈ విలక్షణమైన జన్యు స్థితి కారణంగానే ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైనదిగా నిలిచింది.
ఎందుకు దీనిని ‘గోల్డెన్ బ్లడ్’ అంటారు?
దీనికి ఆ పేరు రావడానికి ప్రధాన కారణం దాని అరుదైన వినియోగం. ఆర్.హెచ్–నల్ రక్తం ఏ రకమైన ఆర్.హెచ్ యాంటిజెన్లను కలిగి ఉండదు కాబట్టి ఆర్.హెచ్ గ్రూపులో అత్యంత అరుదైన సమస్యలు ఉన్న ఎవరికైనా ఈ రక్తాన్ని ఎక్కించవచ్చు. ఇది ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు సంజీవనిలా పనిచేస్తుంది. రక్త గ్రూపుల పరిణామ క్రమాన్ని రక్త మార్పిడిలో తలెత్తే సంక్లిష్టతలను అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలకు ఈ రక్తం ఒక అమూల్యమైన వనరు. అందుకే దీనిని 'బంగారం'తో సమానంగా చూస్తారు.
అరుదైన వరం.. అంతకంటే పెద్ద సవాలు!
గోల్డెన్ బ్లడ్ వినడానికి అద్భుతంగా ఉన్నా, ఈ రక్తం కలిగిన వ్యక్తుల జీవితం అప్రమత్తంగా సాగాల్సిందే. వీరు ఎదుర్కొనే ప్రధాన సవాళ్లున్నాయి. ఈ రక్తం ఉన్న వ్యక్తులకు రక్తం అవసరమైతే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ 50 మందిలో ఎవరో ఒకరు స్పందించాలి. వారి రక్తాన్ని ఒక దేశం నుండి మరో దేశానికి తరలించడం చట్టపరంగా, రవాణా పరంగా చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఆర్.హెచ్ యాంటిజెన్లు లేకపోవడం వల్ల వీరి ఎర్ర రక్త కణాల నిర్మాణం సాధారణం కంటే భిన్నంగా ఉంటుంది. దీనివల్ల వీరికి తరచుగా మైల్డ్ ఎనీమియా (రక్తహీనత) వచ్చే అవకాశం ఉంటుంది. వీరికి ప్రమాదం జరిగి రక్తం అవసరమైతే, సాధారణ రక్తం అస్సలు సెట్ కాదు. పొరపాటున వేరే రక్తం ఎక్కిస్తే శరీరం దానిని తీవ్రంగా ప్రతిఘటించి ప్రాణాపాయం సంభవించవచ్చు.
ముందస్తు జాగ్రత్తలు - భద్రత
ప్రస్తుతం ఈ రక్త గ్రూప్ ఉన్నవారు అంతర్జాతీయ రక్తదాతల నెట్‌వర్క్‌లతో నిరంతరం అనుసంధానమై ఉంటారు. వైద్యులు వీరికి ఇచ్చే ప్రధాన సూచన ఏంటంటే.. వీరు తమ రక్తాన్ని ముందుగానే దానం చేసి బ్లడ్ బ్యాంకుల్లో భద్రపరుచుకోవాలి. తద్వారా భవిష్యత్తులో వారికే అవసరమైతే ఆ రక్తాన్ని వాడుకునే వీలుంటుంది.
వైద్యశాస్త్ర వింతల్లో ఒకటైన ఈ ‘గోల్డెన్ బ్లడ్’, ప్రకృతి ప్రసాదించిన ఒక అరుదైన అద్భుతం. 800 కోట్ల జనాభా ఉన్న ఈ భూమిపై కేవలం కొద్దిమందిలో మాత్రమే ఇది ఉండటం ఆశ్చర్యకరం. భవిష్యత్తులో జన్యుశాస్త్రం మరింత అభివృద్ధి చెందితే, ఈ అరుదైన రక్తం ద్వారా మరిన్ని ప్రాణాలను కాపాడే మార్గాలు సుగమం అవుతాయని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. అందుకే "వంద రోజుల్లో వంద వింతలు" అనే క్రమంలో ఆర్.హెచ్ నల్ రక్తం నిజంగా ఒక మేటి ఆశ్చర్యకరమైన విషయం.
