Begin typing your search above and press return to search.

ఆల్ టైం రికార్డ్ సృష్టించిన బంగారం,వెండి ధరలు.. ధనవంతుడికి కూడా కష్టమేనా?

ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గత నెల రోజుల్లోనే ఆల్ టైం రికార్డ్ సృష్టించింది బంగారం. అయితే ఇక్కడ బంగారం మాత్రమే కాదు వెండి ధరలు కూడా ఆకాశాన్ని అంటుతూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి.

By:  Madhu Reddy   |   6 Oct 2025 2:02 PM IST
ఆల్ టైం రికార్డ్ సృష్టించిన బంగారం,వెండి ధరలు.. ధనవంతుడికి కూడా కష్టమేనా?
X

గత నెల రోజులుగా బంగారం ధరలు ఆగకుండా జెడ్ స్పీడులో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా ఈ బంగారం పెరుగుదల పెట్టుబడుదారులకు శుభవార్తను కలిగించినా.. ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు అత్యంత భారంగా మారింది. ప్రస్తుతం పెరుగుతున్న ధరలను బట్టి చూస్తే సామాన్యుడు ఎప్పుడో బంగారం కొనడం ఆపేశాడు. అయితే ఇప్పుడు పెరుగుతున్న ఈ బంగారం ధరలు ధనవంతుడికి కూడా కష్టంగా మారిపోయాయి అని చెప్పవచ్చు. గత రెండు నెలల క్రితం వరకు లక్షలోపే నమోదైన 22 క్యారెట్ల తులం బంగారం విలువ కూడా ఇప్పుడు దాదాపు రూ.1,10,000 దాటిపోయింది. దీన్ని బట్టి చూస్తే అసలు ధనవంతుడు కూడా ఈ బంగారం వైపు మొగ్గు చూపుతాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. గత నెల రోజుల్లోనే ఆల్ టైం రికార్డ్ సృష్టించింది బంగారం. అయితే ఇక్కడ బంగారం మాత్రమే కాదు వెండి ధరలు కూడా ఆకాశాన్ని అంటుతూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి.

ఈరోజు అనగా అక్టోబర్ 6వ తేదీన నమోదైన బంగారు ధరల విషయానికి వస్తే.. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,370 పెరిగి తొలిసారి రూ.1,20,770 కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1250 పెరిగి రూ.1,10,700 కి చేరుకుంది. ఇది ఆల్ టైం రికార్డ్ అని చెప్పవచ్చు. బంగారం మాత్రమే కాదు అటు వెండి ధరలలో కూడా భారీ మార్పులు వచ్చాయి. హైదరాబాదులో ఈరోజు ఈ కేజీ వెండి పై 1000 రూపాయలు పెరిగి ఏకంగా రూ.1,66,000 కి చేరుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఏది ఏమైనా అటు బంగారం మాత్రమే కాకుండా ఇటు వెండి ధరలు కూడా భారీగా పెరిగిపోయి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని చెప్పవచ్చు.

ఇకపోతే బంగారం ఈ రేంజ్ లో ధరలు పెరగడానికి కారణం.. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొంటున్న పరిస్థితులే అని చెప్పవచ్చు. ముఖ్యంగా అమెరికాలో ప్రస్తుతం గవర్నమెంట్ షట్ డౌన్ కార్యక్రమం నడుస్తోంది. దీనికి కారణం డాలర్ విలువ తగ్గిపోవడంతోనే.. ఇప్పుడు బంగారానికి డిమాండ్ భారీగా పెరిగిందని చెప్పవచ్చు. దీనికి తోడు చాలామంది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం మార్కెట్ పై పెట్టడం బంగారం ధరలు పెరగడానికి కారణం అనే చెప్పాలి. అంతేకాదండోయ్ జపాన్, చైనా వంటి దేశాలు భారీ ఎత్తున బంగారు నిలువలు చేపడుతున్న నేపథ్యంలోనే ఇక్కడ బంగారం ధరలు పెరిగిపోతున్నాయి..

పెరుగుతున్న బంగారం ధరల కారణంగా ప్రజలు ఎవరు కూడా బంగారం కొనడానికి ఆసక్తి కనబరచడం లేదు. దీనికి తోడు కస్టమర్లు ఎక్కువగా రావడం లేదని, బంగారు ఆభరణాల షాపుల యజమానులు కూడా వాపోతున్నారు. ఇలాగే జరిగితే నష్టం వాటిల్లక తప్పదు అని, షాపులు మూసే పరిస్థితి వస్తుందేమో అని భయాందోళనలు గురవుతున్నారు షాపుల యజమానులు. జనవరి నుంచి అక్టోబర్ నెల వరకు చూసుకుంటే దాదాపు 55 శాతానికి పైగా బంగారం ధరలు పెరిగిపోయాయి ఇక భవిష్యత్తులో ఈ స్థాయి నుంచి బంగారం దిగివస్తుందా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం.