అట్టుంటాది బంగారం ఆట... చరిత్రలో తొలిసారి అల్లకల్లోలం!
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరల పెరుగుదలపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
By: Raja Ch | 30 Jan 2026 7:03 PM ISTప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరల పెరుగుదలపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి, గతంలో ఎన్నడూ చూడనంత వేగంగా అన్నట్లుగా బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో గురువారం ఒక్కరోజు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల మధ్య మార్కెట్ ను బంగారం ఎవరి ఊహకూ అందని స్థాయిలో ఆటాడుకుంది. ఇప్పుడు దీనికి గల కారణాలపై తీవ్ర చర్చ జరుగుతోంది.
అవును... గురువారం ఉదయం ఈటీ ప్రకారం ఉదయం 9.30 గంటల నుంచి 10.25 గంటల మధ్య అంటే కేవల 55 నిమిషాల్లో బంగారం చరిత్ర సృష్టించింది అనే కంటే.. మార్కెట్ ను అల్లకల్లోలం చేసింది అనడం సముచితమేమో! ఇందులో భాగంగా.. ఆ స్వల్ప వ్యవధిలో బంగారం మార్కెట్ విలువ 3.2 ట్రిలియన్ డాలర్లు కృంగి పోయింది. ఇది సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో మరింత తీవ్రమైంది. మార్కెట్ నిపుణులు ఒప్పుకోకపోయినా అనధికారికంగా షాకైన పరిస్థితి!
అంటే... నిమిషానికి సుమారు 58 బిలియన్ డాలర్లు.. అంటే... మన కరెన్సీలో సుమారు రూ.5 లక్షల కోట్ల చొప్పున ఆవిరైందన్నమాట. ఇది నష్టాల చరిత్ర. కట్ చేస్తే... గురువారం ఉదయం 10.25 గంటల నుంచి సాయంత్రం 4 గంటల (మార్కెట్ ముగిసే) మధ్య బంగారం విలువ మళ్లీ ఊపందుకుంది.. ఇందులో భాగంగా ఈ వ్యవధిలో మళ్లీ 2.3 ట్రిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. అంటే మొత్తంగా ఈ ట్రేడింగ్ సెషన్ లో 5.5 ట్రిలియన్ డాలర్ల మేర హెచ్చుతగ్గులకు గురైంది!
దీనికి సంబంధించిన వివరాలను 'ది కోబెయిసీ లెటర్' తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. అంటే నిమిషానికి దాదాపు రూ.5 లక్షల కోట్లు చొప్పున అల్లకల్లోల్లం చేసిందన్నమాట. ఈ సందర్భంగా స్పందించిన నిపుణులు 2008 ఆర్థిక మాద్యం సమయంలో సైతం ఈ స్థాయిలో అలజడి జరగలేదని చెప్పడం గమనార్హం. దీంతో.. ఇదొక చరిత్ర అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన మార్కెట్ నిపుణులు... పెట్టుబడిదారులు నిరంతర ద్రవ్యోల్బణ ప్రమాదాలు, అస్పష్టమైన వడ్డీ రేట్ల పథాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాల మధ్య కరెన్సీ స్థిరత్వంపై ఆందోళనలతో పోరాడుతున్నారని.. ఇవన్నీ సాంప్రదాయకంగా బంగారం వంటి సురక్షితమైన ఆస్తులకు డిమాండ్ ను పెంచుతూ.. సరికొత్త ఆందోళనలకు తెరతీస్తున్నాయని అంటున్నారు.
బంగారం ఒకటే గొప్ప లోహమా...?:
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ అస్థిరత కేవలం బంగారానికి మాత్రమే పరిమితం కాలేదు. బంగారం సంగతి కాసేపు పక్కన పెడితే... కొండెక్కుతున్న వెండితో పాటు ప్లాటినం, పల్లాడియం కూడా ఇటీవలి సెషన్లలో పదునైన కదలికలను చూసిన పరిస్థితి. ఈ హెచ్చుతగ్గులు పెట్టుబడిదారులు వేగంగా రిస్క్-ఆన్, రిస్క్-ఆఫ్ స్థానాల మధ్య మారుతున్నాయని సూచిస్తున్నాయి. అది కూడా గంటల వ్యవధిలోనే కావడం గమనార్హం.
