100 హెక్టార్ల విస్తీర్ణంలో బంగారు నిక్షేపాలు..తవ్వే కొద్దీ బంగారమే.. ఎక్కడో తెలుసా?
ఇండియాలో గోల్డ్ కి ఉన్న డిమాండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు బంగారం దుకాణాలు జనాలతో కళకళలాడుతూ ఉంటాయి.
By: Madhu Reddy | 7 Aug 2025 4:06 PM ISTఇండియాలో గోల్డ్ కి ఉన్న డిమాండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు బంగారం దుకాణాలు జనాలతో కళకళలాడుతూ ఉంటాయి. అటు రష్యా అమెరికా వంటి దేశాలలో ఏర్పడిన ఉద్రిక్త వాతావరణం మరొకవైపు రూపాయి విలువ పడిపోవడం కారణంగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర లక్షకు పైమాటే. తప్పని పరిస్థితుల్లో బంగారం కొనుగోలు చేయాల్సి వస్తోందని దీనివల్ల సామాన్యులపై మరింత భారం పడుతుందని పలువురు చెప్పుకొస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న ధరలను చూసి భయపడిపోతున్న ఎంతోమంది ప్రజలు ఎక్కడైనా గని ఉంటే వెళ్లి తవ్వుకుందాం అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ మాటలే నిజమవుతున్నాయని చెప్పవచ్చు. వాస్తవానికి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, రాజస్థాన్ ,ఝార్ఖండ్ వంటి కొన్ని ప్రాంతాలలో బంగారు గనులు కూడా ఉన్నాయి.. కానీ ప్రత్యేకించి కొన్ని ప్రాంతాలలో మాత్రం తవ్వే కొద్ది బయటపడేంత బంగారు గనులు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు తాజా పరిశోధనలో తేల్చారు.
పరిశోధనలో బయటపడిన విషయానికి వస్తే.. ఒక ప్రాంతంలో 100 హెక్టార్ల విస్తీర్ణంలో బంగారు గని ఉందని, అందులో తవ్వే కొద్ది బంగారు నిక్షేపాలు బయటపడుతున్నాయని ఒక వార్త వెలుగు చూడడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అది ఎక్కడ ఉంది? అని తెలుసుకోవడానికి ప్రజలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జబల్‌పూర్ నగరంలో భూమిలోపల లక్షల టన్నుల బంగారం ఉందంటూ కొంతమంది శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అక్కడ కొంతమంది సైంటిస్టులు పరిశోధనలు చేసిన తర్వాత.. అక్కడ వారు సేకరించిన కొన్ని నమూనాలను పరిశీలించడంతో బంగారు గనుల నిక్షేపాలు ఉన్నట్లుగా తేలిందని.. ఈ బంగారు గనులు సిహోరా తాలూకాలోని మహాంగ్వా కేవల్రి ప్రాంతాలలో ఉన్నట్లుగా గుర్తించారు పరిశోధకులు. ఇప్పటికే జబల్‌పూర్ ప్రాంతం ఎక్కువగా మాంగనీస్, ఇనుము వంటి ఖనిజాలకు పెట్టింది పేరు. ఇప్పుడు కొత్తగా బంగారు నిక్షేపాలు ఉన్నాయని తేలడంతో జబల్‌పూర్ ప్రాంతం అధిక ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా ఇప్పుడు ఈ ప్రాంతంపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రత్యేకించి మరీ ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఇకపోతే ఈ జబల్‌పూర్ నగరం సమీపంలోని మహాంగ్వా కేవల్రి ప్రాంతంలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు భౌగోళిక సర్వే ద్వారా సైంటిస్టులు తేల్చి చెప్పడంతో.. ఈ ఆవిష్కరణ జరిగిన తర్వాత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గణనీయంగా మార్చేందుకు ఇదే మంచి పరిణామం అని భావిస్తోంది. ఇక్కడ సుమారుగా 100 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ బంగారు గనులు విస్తరించి ఉన్నాయని , దీంతో పాటు రాగి, ఇతర విలువైన ఖనిజాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఉండే బంగారు నిక్షేపాలు దేశంలో బంగారు ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం కూడా ఉంది అని చెప్పవచ్చు. ఇప్పుడు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లాంటి చారిత్రక గనులు గతంలో దేశ బంగారు ఉత్పత్తికి ఎంతో దోహదపడ్డాయి. ఇప్పుడు ఈ జబల్‌పూర్ గనులు కూడా భవిష్యత్తులో ముఖ్యమైన ఆర్థిక వనరుగా మారే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. పైగా ఇక్కడ వేలాదిమందికి ఉపాధి లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ ప్రాంతంలోని గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు కూడా మారబోతున్నాయని అక్కడి ప్రాంత ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు
