మార్కెట్ లో నయా ట్రెండ్.. అద్దెకు బంగారు నగలు..
సాధారణంగా అమ్మాయిలకి.. బంగారానికి మధ్య విడదీయరాన్ని సంబంధం ఉంటుంది.
By: Madhu Reddy | 2 Nov 2025 12:28 PM ISTసాధారణంగా అమ్మాయిలకి.. బంగారానికి మధ్య విడదీయరాన్ని సంబంధం ఉంటుంది. సందర్భం ఏదైనా సరే ఒంటినిండా నగలు ఉండాల్సిందే. ముఖ్యంగా ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు సాంప్రదాయమైన దుస్తులు ధరించడమే కాకుండా వాటికి అనుకూలంగా బంగారు ఆభరణాలతో తమ అందాన్ని రెట్టింపు చేసుకుంటూ ఉంటారు. అయితే అలాంటి అమ్మాయిలకు ఇప్పుడు భారీ షాక్ తగులుతోందని చెప్పాలి. రోజురోజుకీ బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో సామాన్యులు బంగారం వైపు ఆలోచించడమే మానేశారు. గత వారం రోజులుగా సుమారుగా 11,000 వరకు తగ్గిన బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ అనూహ్యంగా పెరిగిపోయి అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
ఇక ఇలా బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో తాజాగా ఒక కొత్త ట్రెండు మార్కెట్లో మొదలయ్యింది. ఈ ట్రెండ్ చూసి కొంతమంది సంతోషం వ్యక్తం చేస్తే.. మరి కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు బట్టలు, రోల్డ్ గోల్డ్ ఆఖరికి లగ్జరీ కార్లను కూడా అద్దెకు ఇవ్వడం చూసాం.. కానీ ఇప్పుడు ఏకంగా బంగారాన్ని కూడా అద్దెకు ఇస్తున్నారా అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే ఈ కొత్త ట్రెండు. మరి ఈ ట్రెండ్ ఎప్పుడు ఎక్కడ మొదలయ్యింది దీని పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
విషయంలోకి వెళ్తే.. ప్రతి వేడుకకు సరికొత్తగా తయారవ్వాలనుకునే ఈతరాన్ని దృష్టిలో పెట్టుకొని మార్కెట్లో కొన్ని సంస్థలు పార్టీవేర్ డ్రస్సులను, వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలను అద్దెకు ఇవ్వడం మొదలుపెట్టాయి. వీటి సహాయంతో తక్కువ ఖర్చుతోనే అనుకున్నట్టుగా తయారయ్యే విధంగా వీలు ఉండడంతో ఈ ట్రెండ్ చాలా వరకు కూడా అందర్నీ ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఇదే పద్ధతిని బంగారు దుకాణాలు కూడా ప్రారంభించాయి. కర్ణాటకకు చెందిన శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీలో బంగారు నగలను కొనుక్కోవడం అమ్ముకోవడమే కాదు అద్దెకు కూడా తీసుకోవచ్చట.
వి గివ్ గోల్డ్ ఆన్ రెంట్ అనే పేరుతో ఈ సర్వీస్ ను అందిస్తున్నారు. చెన్నై , హైదరాబాద్ నగరాలలో కూడా ఈ సంస్థ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ అద్దె vyaadhi ఒక రోజు నుంచి వారం రోజుల వరకు అందుబాటులో ఉంటుంది. దానికి కొన్ని ఖచ్చితమైన నిబంధనలు కూడా ఉంటాయి. ఎవరైతే బంగారు ఆభరణాలను అద్దెకు తీసుకోవాలనుకుంటున్నారో అలాంటివారు ఐడి ప్రూఫ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది . కాబట్టి ఇక బంగారు నగలను తీసుకొని పారిపోయే అవకాశాలు ఉండవు. గడువు పూర్తయిన తర్వాత ఆ నగలను భద్రంగా తెచ్చి అప్పగించాల్సి ఉంటుంది.. ముఖ్యంగా నగ విలువను బట్టి, తీసుకునే రోజులను బట్టి కూడా అద్దె వసూలు చేస్తారు . పైగా నగ ధరను బట్టి డబ్బు కూడా డిపాజిట్ చేయించుకొని ఆ వివరాలన్నింటినీ చెక్ చేశాకే అద్దెకు ఇస్తుంటారు.
మొత్తానికి అయితే పెరిగిన బంగారు ధరలను దృష్టిలో పెట్టుకొని ఈ సంస్థ తీసుకొచ్చిన ఈ వినూత్న ట్రెండు మార్కెట్లో బాగా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇక ప్రతిసారి ఒకే నగ ధరించాలా అని ఆలోచించే మహిళలకు.. ధరలు చూసి అమ్మో ఇంత మనం పెట్టి కొనగలమా అని ఆలోచించే వారికి ఇది చక్కటి సదుపాయం అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఈ ట్రెండు అందరిని ఆశ్చర్యపరుస్తోంది .
