Begin typing your search above and press return to search.

భారీగా పడిపోతున్న బంగారం ధరలు.. గోల్డ్ కొనడానికి ఇదే మంచి సమయమా?

మరోవైపు అసలు బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? 24, 22, 18 క్యారెట్ల మధ్య ఉన్న తేడాలేంటి అనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

By:  Madhu Reddy   |   2 Sept 2026 2:10 PM IST
భారీగా పడిపోతున్న బంగారం ధరలు.. గోల్డ్ కొనడానికి ఇదే మంచి సమయమా?
X

పసిడి ప్రియులకు దిగొస్తున్న బంగారం ధరలు తీపి కబురు అందిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వరుసగా పతనమవుతున్నాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే వేల రూపాయలు తగ్గడంతో కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అసలు బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? 24, 22, 18 క్యారెట్ల మధ్య ఉన్న తేడాలేంటి అనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో పసిడి ధరల పతనం:

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,070 తగ్గి రూ.1,52,020కి చేరింది. ఇక గత మూడు రోజుల్లోనే ఏకంగా రూ.6,220 తగ్గడం విశేషం. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,900 పతనమై రూ.1,39,350 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే కేజీ వెండి ధర రూ.2,50,000గా నమోదు కాగా, ప్రాంతాన్ని బట్టి రేట్లలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలివే:

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావమే బంగారం ధరల తగ్గింపునకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చని ఫెడ్ ఛైర్ కెవిన్ వాష్ సూచనలు ఇవ్వడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. వడ్డీ రేట్లు పెరిగితే బంగారం కంటే రెగ్యులర్ వడ్డీ ఇచ్చే పెట్టుబడులకు డిమాండ్ పెరుగుతుంది. ఇక దాంతో ఇన్వెస్టర్లు గోల్డ్ అమ్మేసి ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడంతో ధరలు తగ్గుతున్నాయి.

24 క్యారెట్ల బంగారం అంటే ఏమిటి?:

బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. 24 క్యారెట్ల బంగారం అంటే 100% స్వచ్ఛమైనది. అయితే ఇది చాలా మెత్తగా ఉండటం వల్ల దీనితో నేరుగా ఆభరణాలు తయారు చేయలేరు. అందుకే దీనిని గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్స్ లేదా వస్తువులకు బంగారు పూత పూయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక ఎలాంటి మలినాలు లేని ఈ బంగారం మార్కెట్‌లో అత్యంత ఖరీదైనది.

22 అండ్ 18 క్యారెట్ల గోల్డ్ ప్రత్యేకత:

మనం రోజూ వాడే ఆభరణాల తయారీకి 22 క్యారెట్ల బంగారాన్ని ఉపయోగిస్తారు. ఇందులో 91.7% స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. ఇది ధృడంగా ఉండటమే కాకుండా 24 క్యారెట్ల కంటే తక్కువ ధరకు లభిస్తుంది. ఇక 18 క్యారెట్ల బంగారంలో 75% బంగారం, 25% రాగి లేదా వెండి ఉంటాయి.ఇక వజ్రాలు, రత్నాలు పొదిగే నెక్లెస్‌లు, ముక్కుపుడకల తయారీకి ఈ 18 క్యారెట్ల బంగారం చాలా బలంగా ఉపయోగపడుతుంది.

వరుసగా తగ్గుతున్న బంగారం ధరలు సామాన్యులకు, పెళ్లిళ్ల సీజన్ కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిచ్చాయి. బంగారం స్వచ్ఛత, క్యారెట్ల వివరాలను తెలుసుకొని కొనుగోలు చేయడం ఎప్పుడూ శ్రేయస్కరం. ఇక గ్లోబల్ మార్కెట్ పరిస్థితుల బట్టి రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరిన్ని మార్పులకు గురయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.