10 గ్రాముల బంగారం రూ.లక్ష లోపు రానుందా?
ఇంతలా డిమాండ్ కు గురి చేసి.. రోజుకో రేటుతో కొత్త రికార్డుల్ని క్రియేట్ చేసిన బంగారం ఇప్పుడు నేలచూపులు చూడటం మొదలైంది.
By: Garuda Media | 16 Feb 2026 1:00 PM ISTగడిచిన రెండు నెలలుగా ఎక్కడ చూసినా బంగారం.. వెండి మీదనే చర్చనంతా. కొందరైతే పొదుపు మొత్తాల్ని తీసి బంగారం.. వెండి కొనుగోలు చేస్తే..మరికొందరు మరో అడుగు ముందుకు వేసి బ్యాంకుల్లో లోన్లు తీసుుకొని కొనేయటం.. ఇంకొందరు తమ ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టేసి అప్పుగా తీసుకున్న మొత్తంతో బంగారం కొనటం.. అమ్మటం లాంటివి పెద్ద ఎత్తున చేసిన వైనం తెలుగు రాష్ట్రాల్లో కొట్టొచ్చినట్లు కనిపించింది. ఒకదశలో హైదరాబాద్ లాంటి మహానగరాల్లో అయితే.. బంగారం బిస్కెట్లు.. డాలర్లు నో స్టాక్ అన్న బోర్డులు పెట్టిన పరిస్థితి. కొన్నిచోట్ల అయితే ఉదయం వేళలో టోకెన్లు ఇచ్చి.. సాయంత్రానికి డెలివరీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి,
ఇంతలా డిమాండ్ కు గురి చేసి.. రోజుకో రేటుతో కొత్త రికార్డుల్ని క్రియేట్ చేసిన బంగారం ఇప్పుడు నేలచూపులు చూడటం మొదలైంది. ఇది మరింత పెరుగుతుందని చెబుతున్నారు. దీంతో.. ఇప్పటికి పది గ్రాముల బంగారం రూ.1.5 లక్షల వరకు ఉన్న బంగారం రానున్న రోజుల్లో భారీగా తగ్గుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో 31.10 గ్రాములు (ఔన్సు) బంగారం 5వేల డాలర్ల వరకు ఉంటే.. రానున్న రోజుల్లో 3వేల డాలర్ల వరకు పడిపోయే వీలుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల కాలంలో ఎప్పుడై లేని విధంగా 2025లో బంగారం.. వెండి ధరలు వాయు వేగంతో దూసుకెళ్లాయి. ఏడాది వ్యవధిలో బంగారం ధర 70 శాతం పెరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1.80 లక్షలకు మించి వెళ్లింది. ప్రస్తుతం అది కాస్తా పది గ్రాములు రూ.1.59 లక్షల వద్ద ఉంది. అంతర్జాతీయంగా కూడా ఔన్సు బంగారం 5600 డాలర్ల వరకు వెళ్లి ఇప్పుడు 600 డాలర్లు తగ్గి 5వేల డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
రష్యా నుంచి భారత్ చమురు కొనకుండా చేసిన అమెరికా.. రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని జూన్ నాటికి ముగించేలా ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో అమెరికాతో రష్యా తన వాణిజ్య సంబంధాల్ని పునరుద్ధరించుకునేందుకు డాలర్లతో వ్యాపారం చేయటానికి వీలుగా సిద్ధమవుతోంది. అదే జరిగితే డాలర్ కు ప్రత్యామ్నాయ కరెన్సీ తీసుకురావాలని భావిస్తున్న బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల ప్రయత్నాలకు దెబ్బగా చెప్పాలి.
ఒకవేళ రష్యా కానీ తన వాణిజ్యాన్ని అమెరికా డాలర్లతో చేయటం మొదలుపెడితే.. మళ్లీ డాలర్ కు కొత్త శక్తి వస్తుంది. పసిడిపై పెట్టిన పెట్టుబడులు మళ్లీ డాలర్ వైపు మళ్లుతాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బంగారు నిల్వల్లో 20 శాతం బ్రిక్స దేశాల వద్దే ఉన్నాయి. బ్రిక్స్ దేశాలు.. దాని అనుబంధ దేశాలు బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్నా.. అమ్మకాలు మాత్రం ఆచితూచి అన్నట్లు చేస్తున్నాయి. ఇది కూడా బంగారం ధర పెరుగుదలకు కారణంగా చెప్పాలి. డాలర్ కు మద్దతు పెరిగతే అమెరికా బాండ్లకు గిరాకీ పెరుగుతుంది.
అందుకు అనుగుణంగా బంగారం డిమాండ్ తగ్గుతుంది. అదే జరిగితే రానున్న రోజుల్లో పది గ్రాముల బంగారం రూ.లక్ష.. అంతకంటే తక్కువ (రూ.90 వేలవరకు)కు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న ఒక అంచనా వినిపిస్తోంది. ముఖ్యమైన మరో అంశం ఏమంటే.. ఇప్పుడు అందించిన సమాచారం మొత్తం ఒక అంచనా మాత్రమే. బంగారాన్ని కొనమని కానీ.. పెట్టుబడులుపెట్టమని కానీ.. అమ్ముకోవాలని కానీ ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వట్లేదు. ఈ కథనం ఆధారంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ సొంత విచక్షణతో తుది నిర్ణయం తీసుకోవటం ఉత్తమం అన్నది మర్చిపోవద్దు.
