Begin typing your search above and press return to search.

బంగారం ధరలు ఆకాశానికి… 26 ఏళ్లలో ఇంత మార్పా?

ఇక 2020 సంవత్సరానికి వచ్చేసరికి పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. అప్పట్లో కరోనా సంక్షోభం, ఇతర ఆర్థిక కారణాల వల్ల బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి.

By:  Madhu Reddy   |   10 Jun 2026 8:00 PM IST
బంగారం ధరలు ఆకాశానికి… 26 ఏళ్లలో ఇంత మార్పా?
X

మిడిల్ క్లాస్ జనాలకు బంగారం కొనడం అనేది ఒక పెద్ద కల. అయితే రోజురోజుకూ పెరిగిపోతున్న పసిడి ధరలు చూస్తుంటే ఆ కల కాస్తా భారంగా మారుతోంది. ఇరవై ఆరేళ్ల క్రితం లక్ష రూపాయలకు ఎంతో బంగారం కొనగలిగేవాళ్లమని, ఇప్పుడు అదే డబ్బుకు చాలా తక్కువ బంగారం మాత్రమే వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్న ఒక ఇంట్రెస్టింగ్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

2000 సంవత్సరంలో లక్షకు కొండంత పసిడి:

మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. 2000 సంవత్సరంలో బంగారం ధరలు సామాన్యుడికి చాలా అందుబాటులో ఉండేవి. అప్పట్లో ఎవరైనా ఒక లక్ష రూపాయలు పట్టుకుని వెళ్తే అక్షరాలా 227 గ్రాముల బంగారం వచ్చేదట. అంటే దాదాపు 28 తులాలు బంగారం అన్నమాట! అప్పట్లో పెళ్లిళ్లు, శుభకార్యాలకు తులాల కొద్దీ బంగారం కొనడం పెద్ద కష్టంగా అనిపించేది కాదు.

పదేళ్లలోనే సగానికి పైగా కరిగిన విలువ:

కాలం మారుతున్న కొద్దీ బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. 2010 సంవత్సరం నాటికి బంగారం విలువ బాగా పెరిగిపోయింది. అప్పుడు అదే ఒక లక్ష రూపాయలు పెడితే కేవలం 54 గ్రాముల బంగారం మాత్రమే లభించేది. అంటే కేవలం పదేళ్ల వ్యవధిలోనే లక్ష రూపాయలకు వచ్చే బంగారం బరువు సగానికి పైగా తగ్గిపోయింది. ఇక దీంతో సామాన్యులు బంగారం కొనాలంటే ఆలోచించడం మొదలుపెట్టారు.

2020 నాటికి మరింత ప్రియమైన పసిడి:

ఇక 2020 సంవత్సరానికి వచ్చేసరికి పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. అప్పట్లో కరోనా సంక్షోభం, ఇతర ఆర్థిక కారణాల వల్ల బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇక 2020లో ఒక లక్ష రూపాయలకు కేవలం 21 గ్రాముల బంగారం మాత్రమే మార్కెట్లో దొరికేది. అంటే రెండు తులాలు దాటడమే కష్టంగా మారిపోయింది. పెట్టుబడిదారులకు ఇది మంచి విషయమే అయినా, సామాన్యుడికి మాత్రం పెద్ద షాక్.

నిన్న మొన్నటి వరకు ఎలా ఉందంటే?:

ఇక గత రెండేళ్ల లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. 2024వ సంవత్సరంలో ఒక లక్ష రూపాయల బడ్జెట్ పెడితే కేవలం 13 గ్రాముల బంగారం మాత్రమే చేతికి వచ్చింది. అంటే ఒకటిన్నర తులం కూడా పూర్తిగా రాలేదన్నమాట. ఇక అప్పటికే రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు, సామాన్యుడి మంగళసూత్రం ముక్కో, చిన్న ఉంగరమో చేయించాలన్నా జేబులు ఖాళీ అయ్యేలా చేశాయి.

2026 మే నాటికి గోరంతే మిగిలింది:

ఇక లేటెస్ట్ గా 2026 మే నెల నాటి లెక్కలు చూస్తే బంగారం ధరలు ఏ రేంజ్ లో పెరిగాయో అర్థమవుతుంది. ప్రస్తుతం ఒక లక్ష రూపాయలు పట్టుకుని షాపునకు వెళ్తే కేవలం 6 గ్రాముల బంగారమే వస్తోంది. అంటే ఒక తులం బంగారం కొనాలన్నా లక్ష రూపాయల కంటే చాలా ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక ఇరవై ఆరేళ్లలో 227 గ్రాముల నుంచి కేవలం 6 గ్రాములకు పడిపోవడం అంటే మామూలు విషయం కాదు.

బంగారం అనేది కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, భారతీయులకు అదొక సెంటిమెంట్ మరియు ఆపదలో ఆదుకునే ఆస్తి. కానీ 26 ఏళ్లలో వచ్చిన ఈ ఊహించని మార్పు సామాన్యులను పసిడికి దూరం చేస్తోంది. రూపాయి విలువ పడిపోవడం, ద్రవ్యోల్బణం పెరగడమే ఇందుకు ముఖ్య కారణాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే భవిష్యత్తులో బంగారం ధరలు ఇంకెన్ని రికార్డులను సృష్టిస్తాయో, సామాన్యుడికి ఇంకెంత భారం అవుతాయో చూడాలి.