వామ్మో ఈ రాష్ట్రాలలో ఏకంగా 4 బంగారు గనులు.. తీసే కొద్దీ బంగారమే!
అంతర్జాతీయంగా ఏర్పడిన పలు పరిణామాల కారణంగా బంగారం ధరలలో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి.
By: Madhu Reddy | 18 Sept 2025 10:56 AM ISTఅంతర్జాతీయంగా ఏర్పడిన పలు పరిణామాల కారణంగా బంగారం ధరలలో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎన్నడూ లేని విధంగా 22 క్యారెట్ల బంగారం కూడా ఏకంగా లక్ష దాటేయడంతో సామాన్య ప్రజలు విలవిలాడుతున్నారు. ముఖ్యంగా పెట్టుబడిదారులు సేఫ్టీ పెట్టుబడి కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఇలాంటి ధరలు కాస్త ఊరట కలిగించినా.. సామాన్యులు మాత్రం బంగారం కొనుగోలు చేయాలి అంటేనే భయపడిపోతున్నారు. ముఖ్యంగా విదేశాల నుండి మనం బంగారం దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో అధిక భారం మన పైన పడుతోంది. ఇలాంటి సమయంలో మన దేశంలో కూడా బంగారం నిధులు ఉన్నాయని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇలాంటి సమయంలో మన బంగారాన్ని మనమే ఉపయోగించుకుంటే ధరలు ఈ రేంజ్ లో ఉండవు కదా అంటూ తమ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. మొన్నటి వరకు ఉత్తర భారత దేశంలో రెండు బంగారు నిధి నిక్షేపాలు కలిగి ఉన్న గనులు బయటపడగా.. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలలో కూడా ఏకంగా నాలుగు బంగారు గనులు బయటపడడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో ఏకంగా నాలుగు బంగారు గనులు బయటపడ్డాయి.. అవి ఎక్కడ ఉన్నాయి? వాటి సామర్థ్యం ఎంత ? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
ప్రపంచంలో అత్యధిక బంగారం తవ్వకాలు జరిగే దేశాలలో భారతదేశం కూడా ఒకటి. మార్చి 31 2025 నాటికి మనదేశంలో మొత్తం బంగారు నిలువలు సుమారుగా 879.58 మెట్రిక్ టన్నులు. అయితే ఇందులో ఎక్కువ భాగం కర్ణాటక నుండి లభిస్తోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వం బంగారు గనులను గుర్తించింది. అందుకే బంగారం ధర మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో ప్రత్యేక ఆదాయ వనరుగా నిలిచిన ఆ బంగారు గనులేంటో ఇప్పుడు చూద్దాం..
ఆంధ్రప్రదేశ్ రామగిరి బంగారు గనులు..
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉన్న రామగిరిలో కూడా బంగారు గనులు ఉన్నాయి. గతంలో ఇక్కడ తవ్వకాలు కూడా విస్తృతంగా జరిగాయి. అయితే ఇక్కడ ప్రస్తుతం ఉత్పత్తి తక్కువగా ఉన్నా.. భూమి కింద ఇంకా బంగారు నిక్షేపాలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ చిత్తూరు బంగారు గనులు..
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో కూడా ఈ బంగారు గనులు ఉన్నట్లు సమాచారం. ఇది రామగిరి బంగారు గనులకు అనుసంధానమైన ఒక చిన్న తవ్వకాల ప్రాంతమని.. అయితే ఇప్పుడు ఇక్కడ ఎటువంటి తవ్వకాల కార్యకలాపాలు కూడా జరపలేదని తెలుస్తోంది.
కర్ణాటక హెగ్గడదేవనకోట బంగారు గని..
కర్ణాటకలోని మైసూర్ సమీపంలో ఈ బంగారు గని బయటపడినట్లు సమాచారం. అయితే ఇక్కడ కూడా ఇంకా తవ్వకాలు ప్రారంభించలేదు. భవిష్యత్తులో తవ్వకాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
కర్ణాటక కోలార్ బంగారు గని..
ఇకపోతే కోలార్ గని.. ఇది ఒకప్పుడు భారతదేశంలో అతిపెద్ద బంగారు గనిగా ప్రసిద్ధి చెందింది. 2001లో తవ్వకాలు నిలిపివేయబడ్డాయి. కానీ 1880లోనే బ్రిటిష్ వారు ఈ గని నుండి సుమారుగా 800 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేశారు.
కర్ణాటక హట్టి బంగారు గని..
కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఈ గని ఉంది. ప్రభుత్వ హట్టి గోల్డ్ మైన్స్ లిమిటెడ్ దీనిని నిర్వహిస్తోంది. ఈ గని నుండి ప్రతి యేటా సుమారుగా 2 టన్నుల వరకూ బంగారం ఉత్పత్తి అవుతోంది.
