Begin typing your search above and press return to search.

నవంబర్ లో నవ్వని పసిడి.. వాణిజ్య శాఖ తాజా లెక్కలివే!

అవును... ధరలు ఆకాశాన్నంటినా పండగల గిరాకీ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబరులో రికార్డ్ స్థాయిలో పసిడి దిగుమతులు నమోదవ్వగా.. అవి నవంబర్ నెలకు వచ్చేసరికి మాత్రం నెమ్మదించాయి.

By:  Raja Ch   |   16 Dec 2025 2:00 PM IST
నవంబర్  లో నవ్వని పసిడి.. వాణిజ్య శాఖ తాజా లెక్కలివే!
X

నవంబర్ లో బంగారం దిగుమతులు, మిగిలిన వస్తువుల ఎగుమతులకు సంబంధించిన వివరాలను వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా వాణిజ్య లోటు 5 నెలల కనిష్ట స్థాయికి చేరుకుందని చెబుతూ.. గత ఏడాది నవంబర్ తో పోలిస్తే ఈ ఏడాది నవంబర్ లో బంగారం దిగుమతులు పెద్ద ఎత్తున తగ్గాయని తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

అవును... ధరలు ఆకాశాన్నంటినా పండగల గిరాకీ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబరులో రికార్డ్ స్థాయిలో పసిడి దిగుమతులు నమోదవ్వగా.. అవి నవంబర్ నెలకు వచ్చేసరికి మాత్రం నెమ్మదించాయి. ఇందులో భాగంగా... 2024 నవంబర్ లో 9.8 బిలియన్ డాలర్ల బంగారం దిగుమతి కాగా.. ఈ ఏడాది నవంబర్ లో ఆ సంఖ్య 4 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అంటే.. తగ్గుదల 60% అన్నమాట.

అక్టోబర్ వరకూ అదిరింది!:

గత ఏడాది ఏప్రిల్ - నవంబరులో 43.8 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి కాగా.. 2025 ఏప్రిల్ - నవంబర్ లో 45.26 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి అయ్యింది. అంటే వృద్ధి 3.3శాతంగా ఉంది. ఇదే సమయంలో.. గతఏడాది అక్టోబర్ తో పోల్చినా ఈ ఏడాది అక్టోబరులోనూ దిగుమతులు 3 రెట్లు అధికంగా 14.72 బిలియన్ డాలర్కు పసిడి దిగుమతులు పెరిగాయి.

ఇలా మన దేశానికి దిగుమతయ్యే పసిడిలో అత్యధికంగా సుమారు 40% వాటా స్విట్జర్లాండ్ నుంచే కాగా.. ఆ తర్వాత స్థానాల్లో 16%తో యూఏయీ, 10%తో దక్షిణాఫ్రికా ఉన్నాయి.

పెరిగిన ఎగుమతులు!:

ఇక మిగిలినవాటి ఎగుమతుల విషయానికొస్తే... నవంబరులో 19.37% పుంజుకుని.. 38.13 బిలియన్ డాలర్లకు చేరాయి. వాస్తవానికి పసిడితో పాటు చమురు, బొగ్గు దిగుమతులు తగ్గడంతో ఈ బిల్లు భారం 1.88% తగ్గి, 62.66 బిలియన్ డాలర్లకు చేరింది. ఓవరాల్ గా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ కాలంలో 2.62% వృద్ధితో ఎగుమతులు 292.07 బిలియన్ డాలరుగా ఉన్నాయి.

ఇదే సమయంలో.. దిగుమతులు 5.59% పెరిగి, 515.21 బిలియన్ డాలర్కు చేరడంతో వాణిజ్యలోటు 223.14 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏది ఏమైనా... ఎగుమతులు పెరగడంతో దిగుమతులు, ఎగుమతుల మధ్య అంతరం (వాణిజ్య లోటు) నవంబర్ లో 5 నెలల కనిష్ట స్థాయి అయిన 24.53 బిలియన్ డాలర్లకు పరిమితమైంది.