బంగారం అంటే వైరాగ్యం
భారతీయులకు బంగారం అంటే ఎంతటి ప్రేమ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఏడాదికి ఏకంగా 800 టన్నులకు పైగా బంగారం భారత్ దిగుమతి చేసుకుంటుంది.
By: Satya P | 12 Jun 2026 8:45 AM ISTభారతీయులకు బంగారం అంటే ఎంతటి ప్రేమ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఏడాదికి ఏకంగా 800 టన్నులకు పైగా బంగారం భారత్ దిగుమతి చేసుకుంటుంది. భారతదేశం తన విదేశీ మారక ద్రవ్యంలో నూటికి తొంబై శాతం ఖర్చు చేసేది బంగారం దిగుమతుల మీద అలాగే ముడి చమురు కోసం. ఇపుడు చూస్తే అంతర్జాతీయ పరిణామాలు పూర్తిగా అనుకూలించడం లేదు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపధ్యంలో ఇంధన ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ముడి చమురు అన్నది దేశ రధ చక్రం తిరిగేందుకు ఇంధనం అవసరం. మరో వైపు చూస్తే అంతర్జాతీయంగా డాలర్ ధరతో పోలిస్తే రూపాయి పతనం అవుతోంది. వీటి నేపధ్యంలోనే అన్నీ ఆలోచించి ప్రధాని నరేంద్ర మోడీ బంగారం కొనవద్దు ఒక్క ఏడాది పాటు సహకరించండి అని ప్రజలకు వినతి చేశారు.
ప్రభావం చాలానే :
మోడీ గత నెల 10వ తేదీన హైదరాబాద్ వచ్చినపుడు ఇచ్చిన ఈ పిలుపు ప్రజలలో బాగానే పనిచేసినట్లుంది. మొత్తం బంగారం కొనుగోళ్ళలో ఎనభై శాతం తగ్గుదల కనిపిస్తోందని బులియన్ మార్కెట్ గణాంకాలు తెలియచేస్తున్నాయి. బంగారం కొనుగోళ్ళతో కళకళలాడే మార్కెట్లు వెలవెలబోతున్నాయి. మరో వైపు చూస్తే అంతర్జాతీయ పరిణామాల నేపధ్యంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతే కాదు ప్రపంచ మార్కెట్ లో డాలర్ బలపడడం డాలర్లలోనే బంగారం కొనుగోళ్ళు చేయాల్సి ఉండడంతో అనేకే దేశాలు బంగారం కొనుగోళ్ళను తగ్గించడం కూడా బంగారం ధరలు తగ్గుదలకు కారణం అంటున్నారు
బిగించిన కేంద్రం :
కేవలం నోటి మాటతోనే కాకుండా కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతుల మీద భారీగానే సుంకాలను వేసింది. ఏకంగా ఆరు శాతం నుంచి 15 శాతానికి ఈ పెంపు ఉండడం వల్ల కూడా దిగుమతులు తగ్గిపోయాయని అంటున్నారు. ఇక దేశంలో బంగారం కొనుగోళ్ళు తగ్గడానికి ఆర్ధిక మాంద్యం ప్రభావం కూడా కారణం అని అంటున్నారు. చేతిలో లిక్విడ్ క్యాష్ ని ఉంచుకోవాలని బంగారం మీద అధిక ఖర్చు పెట్టడం దండుగ అన్న భావన వల్ల కూడా పొదుపు పాటిస్తున్నారు అని అంటున్నారు. ఇక పశ్చిమాసియా ఉద్రిక్తల నేపథ్యం, అవి ఒక కొలిక్కి రాకపోవడం వల్ల ఏ సమయంలో ఏమి జరుగుతుందో అన్న ఆదుర్ధా కూడా బంగారం వైపుగా జనాలను వెళ్ళనీయకుండా చేస్తోంది అని విశ్లేషిస్తున్నారు.
తగ్గుతున్నా అదే వైఖరి :
ఈ నేపధ్యంలో గత పది రోజులుగా చూస్తే రోజుకు వేయి రూపాయలు వంతున బంగారం తగ్గు ముఖం పట్టింది. తులం బంగారం లక్షా 65 వేల నుంచి ఈ రోజుకు లక్షా 45 వేలకు దిగిపోయింది. అయినా సరే బంగారం వైపు చూసే నాధుడే లేడు. దాంతో వినియోగదారులు లేక బంగారం దుకాణాల నిర్వాహకులు గోడు మంటున్నారు. ఇంకో వైపు చూస్తే బంగారం విషయంలో జనాల ఆశలు ఆలోచనలు కూడా ప్రస్తుతానికి కొనుగోలు చేయకుండా ఆపుతున్నాయని అంటున్నారు.
లక్షకు దిగుతుందని ఆశ :
బంగారం ఎటూ లక్షా 45 వేలకు దిగింది కదా ఇంకా డిమాండ్ తగ్గి లక్షకు దిగితే అపుడు ఆలోచించవచ్చు అన్నది కూడా చాల మందిలో ఉందని అంటున్నారు. ఈ కారణం చేతనే చాలా మంది బంగారం వైపు కన్నెత్తి చూడడం లేదు అని అంటున్నారు. అవసరం అనుకుంటే తమ వద్ద ఉన్న పాత బంగారాన్నే రీ డిజైన్ చేయిస్తున్నారు తప్పించి కొత్తగా బంగారం జోలికి పోవడం లేదని అంటున్నారు.
మళ్ళీ పుంజుకుంటుందా :
అయితే బంగారానికి సంబంధించి ముందు ముందు అన్నీ మంచి రోజులే అని బులియన్ మార్కెట్ అంచనా వేస్తోంది. పసిడి విషయంలో స్వల్పకాలిక తగ్గుదల గమనించదగినదే అని అంటున్నారు. అయినప్పటికీ, 2025 లో ఉన్న బంగారం ధరలతో పోలిస్తే ప్రస్తుతం బంగారం ధరలు ఇప్పటికీ గణనీయంగా ఎక్కువగా ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ ఆర్థిక పరిణామాలు వడ్డీ రేట్ల విధానాలు భవిష్యత్ ధరల గమనాన్ని నిర్దేశిస్తాయని అంచనా వేస్తున్నారు. మొత్తానికి చక్కనమ్మ చిక్కినా అందమే అని బంగారం తగ్గినా జోరు అందుకోవడం ఖాయమని అంటున్నారు.
