రాజకీయ గోదాట్లో వైసీపీ ఇంచార్జిలు
ఉభయ గోదావరి జిల్లాలలో వైసీపీ ఇంచార్జిలకు స్థానిక ఫీవర్ పట్టుకుంది. అందరికీ స్థానిక సంస్థల ఎన్నికలు.
By: Satya P | 1 Sept 2026 8:10 AM ISTఉభయ గోదావరి జిల్లాలలో వైసీపీ ఇంచార్జిలకు స్థానిక ఫీవర్ పట్టుకుంది. అందరికీ స్థానిక సంస్థల ఎన్నికలు. కానీ వారి పాలిట మాత్రం అవి అగ్ని పరీక్షగా మారాయి. ఎందుకంటే వైసీపీ అధినేత జగన్ చేసిన హెచ్చరికతో వారికి 2029 ఎన్నికలు కనిపిస్తున్నాయి. ఇప్పటికి మూడేళ్ళు సార్వత్రిక ఎన్నికలు ఉండగా వైసీపీ ఇంచార్జిలలో మాత్రం లోకల్ ఫైట్ కంటే టికెట్ ఫైట్ ఇపుడు అర్జంటుగా ముందుకు తోసుకుని వచ్చింది. ఎక్కడైనా ఏకగ్రీవం అయిందా మీకు టికెట్ కట్ అని వైసీపీ అసెంబ్లీ ఇంచార్జిలకు జగన్ ఇటీవలనే మీటింగ్ పెట్టి మరీ గట్టిగానే హెచ్చరించారు. దాంతో ఇపుడు వైసీపీ ఇంచార్జిలకు ఫుల్ టెన్షన్ వస్తోంది అంటున్నారు.
ఫుల్ స్వింగ్ లో కూటమి :
ఇక ఉభయ గోదావరి జిల్లాలలో చూస్తే ఒక్క సీటు కూడా 2024 ఎన్నికల్లో వైసీపీ గెలుచుకోలేదు, అయుదు ఎంపీలు, 34 ఎమ్మెల్యేలు ఉంటే అన్నింటినీ కూటమి గెలుచుకుంది. దాంతో పాటుగా బలమైన క్యాడర్ అంతా ఆ వైపు ఉంది. ఒక విధంగా సామాజికవర్గం పరంగా భారీ చీలిక ఇక్కడ కనిపిస్తోంది. రెండేళ్లు పై దాటుతున్నా ఇంకా గోదావరి జిల్లాలలో వైసీపీ పరిస్థితిలో అయితే ఏ మాత్రం మార్పు లేదు, పార్టీని వీడి పోయిన వారు అనేక మంది ఉన్నారు. వారి ప్లేస్ లో కొత్త వారు రాలేదు, కీలక నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇక క్యాడర్ అయితే తమ దారిలో ఉంది. ఇప్పటిదాకా నాయకులు కూడా వారిని చేరదీసే పనికి పూనుకోలేదు, కానీ జగన్ హెచ్చరికల నేపథ్యంలో క్యాడర్ ని వెతుక్కుంటూ లీడర్లు ఇపుడు వారి బాట పట్టారని అంటున్నారు.
టీడీపీ సేనకు ప్రతిష్టగా :
ఇక కాకినాడ జిల్లాలో మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన స్థానిక ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నారు. దాంతో ఇక్కడ పట్టు గట్టిగానే బిగిస్తున్నారు అని అంటున్నారు. జనసేనలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది, అలాగే టీడీపీ నియోజకవర్గాలలో ఆ పార్టీ దూకుడు చేస్తోంది. దాంతో ఎక్కువగా ఏకగ్రీవాలు జరిగే జిల్లాగా చెబుతున్నారు. మరి ఈ జిల్లా వైసీపీ అధ్యక్షుడుగా ఉన్న దాడిశెట్టి రాజా ఏమి చేస్తారు అన్నది అంతా ఆలోచిస్తున్నారు. అలాగే గోదావరి జిల్లాలో మరో మాజీ మంత్రి ఉన్నారు. ఆయనే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఆయన రాజమండ్రి రూరల్ ఇంచార్జిగా ఉన్నారు. ఎన్నికల తరువాత ఇక్కడ కూటమి మరింతగా బలపడింది. ఏకగ్రీవాలకు తెర లేచే నియోజకవర్గంగా దీనిని చూస్తున్నారు. దాంతో చెల్లుబోయిన మాట చెల్లుతుందా అన్నదే చర్చగా ఉంది.
కోనసీమలో జోరు :
అదే విధంగా చూస్తే కోనసీమలో కూడా కూటమి జోరు మామూలుగా లేదు, స్థానిక ఎన్నికల ముందే ఉత్సాహం మూడు పార్టీలలో ఉరకలు వేస్తోంది. దాంతో ఇక్కడ అనేక నియోజకవర్గాలలో వైసీపీ బలహీనంగా కనిపిస్తోంది. చాన్స్ తీసుకుని ఏకగ్రీవాలు చేసుకోవడానికి కూటమి దూకుడు చేస్తూంటే వైసీపీ చేష్టలుడిగి చూడాల్సిన నేపథ్యం ఉంది అని అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితిలలో ఇక్కడ ఉన్న అనేక అసెంబ్లీ నియోజకవర్గాలలోని వైసీపీ ఇంచార్జిల పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచు ఎన్నికలలో జోరుగా ఏకగ్రీవాలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. దాంతో వైసీపీ ఇంచార్జిలకు రాజకీయ గోదావరిని ఈదేది ఎలా అన్నది అర్ధం కావడం లేదని అంటున్నారు.
