కేసీఆర్ ఫాంహౌజ్ కు జీవన్ రెడ్డి.. అన్నా అంటూ ఆప్యాయంగా పలకరించిన జగిత్యాల టైగర్..!
రాజకీయాల్లో ‘టైమింగ్’ కి మించిన బలమైన అస్త్రం మరొకటి ఉండదు. పన్నెండేళ్ల క్రితం కేసీఆర్ పంపిన ఆహ్వానాన్ని అప్పుడు కాదన్న జీవన్ రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనపై అసంతృప్తితో నేరుగా ఎర్రవల్లి బాట పట్టారు.
By: Tupaki Political Desk | 10 April 2026 4:56 PM ISTపన్నెండేళ్ల నాటి స్కెచ్ ఇన్నాళ్లకు ఇలా ‘ఫ్రేమ్’ కట్టి ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఆవిష్కృతం కావడం తెలంగాణ రాజకీయాల్లోనే అతిపెద్ద మలుపు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ భావజాలంతో, ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న జీవన్ రెడ్డి.. ఇప్పుడు గులాబీ బాస్ కేసీఆర్‌తో భేటీ అవ్వడం ఒక కొత్త శకానికి నాంది అని చెప్పొచ్చు. ఈ భేటీ కేవలం మర్యాద పూర్వకమే కాదు.., ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేలా ఉంది.
‘దేవుడే పంపిండు’ అంటూ ఉద్వేగపూరిత వ్యాఖ్య!
రాజకీయాల్లో ‘టైమింగ్’ కి మించిన బలమైన అస్త్రం మరొకటి ఉండదు. పన్నెండేళ్ల క్రితం కేసీఆర్ పంపిన ఆహ్వానాన్ని అప్పుడు కాదన్న జీవన్ రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనపై అసంతృప్తితో నేరుగా ఎర్రవల్లి బాట పట్టారు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసిన జీవన్ రెడ్డి, అత్యంత ఆత్మీయంగా మాట్లాడారు. ‘అన్నా.. నన్ను మీతో కలిసి పనిచేయమని ఆ దేవుడే పంపిండు’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇన్నాళ్లూ ప్రత్యర్థులుగా ఉన్న ఇద్దరు నేతలు ఒక్కటవ్వడం గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
ఆత్మీయ ఆలింగనం..
ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ భేటీలో కేసీఆర్, జీవన్ రెడ్డి పాత రోజులను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ప్రస్తుత రాజకీయ పరిణామాల వరకు సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ పార్టీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను, తన ఆత్మగౌరవం దెబ్బతిన్న తీరును జీవన్ రెడ్డి వివరించినట్లు తెలుస్తోంది. ఇద్దరు సీనియర్ నేతలు ఒకే గొడుగు కిందకు రావడం అనేది రాష్ట్ర రాజకీయాల్లో బలమైన సంకేతాన్ని పంపింది.
జగిత్యాల ‘టైగర్’కు కేటీఆర్ గ్రాండ్ వెల్‌కమ్
ఈ కీలక భేటీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ కీలక నేతలను ఆయన జీవన్ రెడ్డికి పరిచయం చేశారు. నిన్నటి వరకు క్షేత్రస్థాయిలో ఒకరిపై ఒకరు పోరాడిన నేతలు, ఇప్పుడు చేతులు కలపడం విశేషం. ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంలో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, కేడర్‌ను ఎలా సమన్వయం చేయాలి అనే అంశాలపై ఒక పక్కా రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
కరీంనగర్ లో మారుతున్న సమీకరణాలు
జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత రాకతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్‌లోని అసంతృప్త నేతలు ఇప్పుడు జీవన్ రెడ్డి బాటలో నడిచే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న సీనియర్లకు జీవన్ రెడ్డి ఒక అడ్రస్‌గా మారబోతున్నారు. ఇది అధికార కాంగ్రెస్ పార్టీకి జగిత్యాల గడ్డపై పెద్ద సవాల్‌గా మారనుంది.
కేసీఆర్-జీవన్ రెడ్డి భేటీ కేవలం పార్టీ మార్పు మాత్రమే కాదు.., ఇది ఒక రాజకీయ సిద్ధాంత పునరేకీకరణ. ‘నన్ను దేవుడే పంపిండు’ అన్న జీవన్ రెడ్డి మాటల్లో ఎంతటి ఆవేదన, ఎంతటి సంకల్పం ఉందో అర్థం చేసుకోవచ్చు. మునిసిపల్ ఎన్నికల తర్వాత ఆయన తీసుకున్న ఈ నిర్ణయం, తెలంగాణ రాజకీయాల్లో మున్ముందు మరెన్ని మార్పులకు దారితీస్తుందో చూడాలి. ఏదేమైనా, 2014 నాటి కేసీఆర్ ఆకాంక్ష 2026లో ఇలా నెరవేరడం విశేషం.
