నైట్ క్లబ్ తగలబడుతున్నవేళలోనే ఫారిన్ కు టికెట్ల బుకింగ్
పాతిక మంది ప్రాణాలు తీసిన గోవాలోని నైట్ క్లబ్ ఉదంతానికి సంబంధించిన షాకింగ్ నిజం ఒకటి తాజాగా వెలుగు చూసింది.
By: Garuda Media | 11 Dec 2025 9:38 AM ISTపాతిక మంది ప్రాణాలు తీసిన గోవాలోని నైట్ క్లబ్ ఉదంతానికి సంబంధించిన షాకింగ్ నిజం ఒకటి తాజాగా వెలుగు చూసింది. క్లబ్ లోపల చోటు చేసుకున్న ఘోర అగ్నిప్రమాదంలో ఐదుగురు పర్యాటకులు.. ఇరవై మంది క్లబ్ సిబ్బంది ప్రాణాలు పోయిన వైనం తెలిసిందే. బిర్చ్ బై రోమియో లేన్ పేరుతో నడుపుతున్న ఈ క్లబ్ లో బాలీవుడ్ బ్యాంగర్ నైట్ జరుగుతున్నప్పుడు డ్యాన్స్ ఫ్లోర్ మీద కాల్చిన టపాసులతో మంటలు చెలరేగటం.. అది కాస్తా తీవ్రంగా మారి పెను ప్రమాదానికి కారణమైంది. ఇప్పటివరకు ఈ ఉదంతానికి సంబంధించి నలుగురు సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు.
అయితే.. ఈ క్లబ్ యజమానులు మాత్రం విదేశాలకు వెళ్లిపోయారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో గోవాలోనే ఉన్న వారు.. ఓవైపు మంటలతో క్లబ్ తగలబడిపోతున్న వేళ.. ఒక ప్రైవేటు పోర్టల్ ద్వారా బ్యాంకాక్ కు టికెట్లు బుక్ చేసుకున్న క్లబ్ యజమానులు (సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా) థాయిలాండ్ కు పారిపోయారు. వారిని పట్టుకోవటానికి ఇంటర్ పోల్ బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో విదేశాలకు పారిపోయిన వారు ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టు ను ఆశ్రయించారు. అందుకు కోర్టు నో చెప్పింది.
మరోవైపు ఈ క్లబ్ సహ యజమాని అజయ్ గుప్తాను పోలీసులు అరెస్టు చేశారు. ఓవైపు నైట్ క్లబ్ లో అగ్నిప్రమాదం జరిగి.. బాధితుల్ని కాపాడేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్న వేళలో దాని యజమానులు మాత్రం విదేశాలకు పారిపోయేందుకు వీలుగా టికెట్లు బుక్ చేసుకొని వెళ్లిపోయారు. నిందితులు తప్పించుకునేందుకు పోలీసులు సహకరించారని వస్తున్న ఆరోపణల్ని గోవా పోలీసులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
మంటల్ని అదుపులోకి తీసుకురావంపైనే పోలీసులు.. రెస్క్యూ టీంలు ఫోకస్ చేసినట్లుగా పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. విదేశాలకు పారిపోయిన నిందితుల్ని తిరిగి తీసుకొచ్చేందుకు ఇంటర్ పోల్ సాయాన్ని కోరినట్లుగా గోవా పోలీసులు వెల్లడించారు. ఏమైనా.. ఓవైపు ప్రాణాలు పోతుంటే.. మరోవైపు తమను తాము రక్షించుకోవటానికి విదేశాలకు జంప్ అయిన క్లబ్ యజమానుల తీరు చూస్తే.. మామూలు ముదురు కేసులు కాదన్న భావన అనిపించక మానదు.
