థాయ్ లాండ్ లో దొరికిన గోవా నైట్ క్లబ్ ఓనర్లు
కిచెన్ లో పేలిన గ్యాస్ సిలిండర్ కారణంగా ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్లుగా కొన్ని రిపోర్టులు.. కాదు డ్యాన్స్ ఫ్లోర్ మీద పేల్చిన బాణసంచా కారణంగా భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుందనన వాదనలు వినిపించటం తెలిసిందే
By: Garuda Media | 12 Dec 2025 9:32 AM ISTతాము నిర్వహించే నైట్ క్లబ్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకొని పెద్ద ఎత్తున బాధితులు ప్రాణాలు పోగొట్టుకునే దారుణ విషాదం వేళ.. తమను తాము రక్షించుకోవటానికి.. చట్టానికి మస్కా కొట్టేసేందుకు వీలుగా ఫారిన్ కు పారిపోవాలని ప్లాన్ చేసి.. విజయంతంగా తాము అనుకున్నది చేసిన గోవా నైట్ క్లబ్ యజమానుల ఆట కట్టించారు పోలీసులు. ఐదారు రోజుల క్రితం (డిసెంబరు 6) గోవాలోని నైట్ క్లబ్ (బిర్క్ బై రోమియో లైన్)లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకోవటం.. పాతిక మంది మరణించటం తెలిసిందే. అందులో ముగ్గురు క్లబ్ కు వచ్చిన అతిధులు కాగా.. మిగిలిన 22 మంది క్లబ్ సిబ్బంది అన్న విషయం తెలిసిందే.
కిచెన్ లో పేలిన గ్యాస్ సిలిండర్ కారణంగా ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్లుగా కొన్ని రిపోర్టులు.. కాదు డ్యాన్స్ ఫ్లోర్ మీద పేల్చిన బాణసంచా కారణంగా భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుందనన వాదనలు వినిపించటం తెలిసిందే. అయితే.. ఈ రెండు పరిణామాలతోనే అగ్రిప్రమాద తీవ్రత అంత భారీగా ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి విషాద వేళలో బాధితులకు దన్నుగా నిలవటం.. వారిని కాపాడటం లాంటి వాటిని వదిలేసి.. అప్పటికప్పుడు విదేశాలకు టికెట్లు బుక్ చేసుకొని ఎస్కేప్ అయిన వైనం వెలుగు చూసి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఆరో తేదీ రాత్రి 11.45 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే.. నిందితులు తెల్లవారుజామున ఐదున్నర గంటల ప్రాంతంలో థాయ్ లాండ్ లోని పుకెట్ కు పారిపోయిన వైనాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్.. నైట్ క్లబ్ యజమానుల (సౌరభ్ లుథ్రా, గౌరవ్ లూథ్రా) పాస్ పోర్టులను సస్పెండ్ చేసిన వైనం తెలిసిందే. థాయ్ లాండ్ చట్టాల ప్రకారం పాస్ పోర్టు సస్పెండ్ అయిన వారు వెంటనే తమ దేశాలకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా తమ దేశంలో ఉంటున్న ఈ నైట్ క్లబ్ యజమానులను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని 24 గంటల్లో భారత్ కు తరలించే వీలుంది.
