పాతిక మరణాల తర్వాత... లూథ్రా క్లబ్ విషయంలో గోవా సీఎం కీలక ఆదేశం!
గోవాలోని బ్రీచ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 25 మంది మరణించగా, అనేక మంది గాయపడిన సంగతి తెలిసిందే!
By: Raja Ch | 9 Dec 2025 4:37 PM ISTగోవాలోని బ్రీచ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 25 మంది మరణించగా, అనేక మంది గాయపడిన సంగతి తెలిసిందే! ఈ సమయంలో వివాదాస్పద లూథ్రా బ్రదర్స్ గోవా మెయిన్ షాప్ అయిన లేన్ వాగేటర్ ను వెంటనే కూల్చి వేయాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రస్తుతం ఈ బ్రదర్స్ ఇద్దరూ గోవా నుంచి విదేశాలకు పారిపోయారు!
అవును... గోవాలోని బ్రీచ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం తర్వాత లూథ్రా బ్రదర్స్ గోవా మెయిన్ షాప్ అయిన లేన్ వాగేటర్ ను వెంటనే కూల్చి వేయాలని గోవా సీఎం ఆదేశించారు. ఇదే సమయంలో... ఢిల్లీలోని ముఖర్జీ నగర్ లోని వారి నివాసానికి గోవా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు అతికించి, స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు.
బ్రదర్స్ కోసం బ్లూ కార్నర్ నోటీసులు!:
మరోవైపు.. నైట్ క్లబ్ లో అగ్నిప్రమాదం జరిగిన కొద్దిసేపటికే గోవా నుంచి లూథ్రా బ్రదర్స్ సౌరబ్, గౌరవ్ దేశం విడిచి పారిపోయారు. ఈ సమయంలో వీరు థాయిలాండ్ పారిపోయి ఉంటారని అంటున్నారు. వీరిలో గౌరవ్, థాయ్ లోని పుకెట్ లోని విమానాశ్రయంలో కనిపించినట్లు జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరిని గుర్తించడానికి బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు.
అన్ని క్లబ్ లూ కూల్చివేత!:
అదేవిధంగా.. వాగేటర్ తో పాటు ఇతర తీరప్రాంతాలలోనూ లూథ్రా సోదరులు నిర్వహిస్తున్న అన్ని క్లబ్ లు, కేఫ్ లను కూల్చివేయాలని గోవా ప్రభుత్వం నిర్ణయించిందని తెలుస్తోంది. వాగేటర్ బీచ్ వరకూ విస్తరించి ఉన్న కొండపై ఉన్న లూథ్రా నిర్వహించే మరో క్లబ్ ను ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించారని.. దీనికి ఎలాంటి అనుమతులు లేవనే ఆధారాలు వెలువడిన తర్వాత.. సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
వీరిని ఇంతకాలం ఎవరు రక్షించారు..?:
వాస్తవానికి లూథ్రా బ్రదర్స్ కు చెందిన క్లబ్ లకు అగ్నిమాపక భద్రతా అనుమతులు లేవని అంటున్నారు. మరోవైపు.. పోలీసులు, గోవా కోస్టల్ మేనేజ్మెంట్ అథారిటీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వంటి అనేక విభాగాల్లో అనేక ఫిర్యాదులు అందాయని.. అయినప్పటికీ సదరు క్లబ్ లు ఈ ఫిర్యాదులన్నింటినీ తట్టుకుని నిలబడి, పాతిక మంది ప్రాణాలు తీసుకుందని అంటున్నారు!
ఈ సమయంలో... ఈ నిర్మాణాలు, వీటి వల్ల సంభవించే ప్రమాదాల గురించి స్థానిక కార్యకర్త రవి హర్మల్కర్ పదే పదే అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. అయినప్పటికీ ఈ ఫిర్యాదులపై అధికారుల చర్యలు లేవు సరికదా... లూథ్రా బ్రదర్స్ నుంచి బెదిరింపులను ఎదుర్కొన్నట్లు హర్మల్కర్ చెబుతున్నారు. ఈ సందర్భంగా లూథ్రా బ్రదర్స్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై లోతైన రాజకీయ మద్దతు ప్రయోగించారని రవి ఆరోపిస్తున్నారు.
