మలేషియా `గ్లో-ఇన్-ద-డార్క్` రోడ్ల ప్రయోగం: భారతదేశంలో ట్రై చేయాలంటే?
భారతదేశంలోని చాలా నిశీధి రోడ్లు ఉన్నాయి. ఏజెన్సీలోని మారు మూల ప్రాంతాలకు రోడ్ మార్గంలో వెళ్లాలంటే రాత్రి పూట విద్యుత్ ద్వీపాలు కూడా అందుబాటులో ఉండవు.
By: Sivaji Kontham | 30 April 2026 5:00 PM ISTభారతదేశంలోని చాలా నిశీధి రోడ్లు ఉన్నాయి. ఏజెన్సీలోని మారు మూల ప్రాంతాలకు రోడ్ మార్గంలో వెళ్లాలంటే రాత్రి పూట విద్యుత్ ద్వీపాలు కూడా అందుబాటులో ఉండవు. ఇంకా చెప్పాలంటే సరిగా రోడ్లు వేయని దుస్థితి ఇంకా ఉంది. అయితే మారుమూల ప్రాంతాలకు కూడా భయం బెరుకు లేకుండా వెళ్లాలంటే మలేషియా దేశంలో చేసిన ఈ ప్రయోగం నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. అయితే ఇది ప్రభుత్వాలకు ఆర్థిక భారంగా మారడం దురదృష్టకరం. ఆలోచన మంచిదే అయినా అది ఆచరణలో సాధ్యపడకపోవడం నీరసపడేట్టు చేస్తోంది.
రాత్రిపూట వీధి దీపాలు లేని రహదారులపై ప్రయాణించే వాహనదారులకు అండగా నిలుస్తుందని భావించిన `గ్లో-ఇన్-ద-డార్క్` (చీకటిలో మెరిసే) రోడ్ మార్కింగ్స్ ప్రయోగానికి మలేషియా ప్రభుత్వం స్వస్తి చెప్పే ఆలోచనలో ఉంది. మలేషియాలోని సెలాంగర్ రాష్ట్రంలో అత్యంత ఆసక్తికరంగా ప్రారంభమైన ఈ ప్రయోగంపై అక్కడి పార్లమెంట్ తాజాగా పెదవి విరిచింది. ఈ వినూత్న సాంకేతికతపై తమ మంత్రిత్వ శాఖ నిపుణులు సంతృప్తికరంగా లేరని.. దీనికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉందని డిప్యూటీ వర్క్స్ మినిస్టర్ అహ్మద్ మస్లాన్ స్పష్టం చేశారు.
నిజానికి విద్యుత్ వినియోగాన్ని తగ్గించి.. కార్బన్ ఉద్గారాలను నియంత్రించాలనుకునే నగరాలకు ఈ `స్వయంగా వెలిగే` లైన్ల ఆలోచన అద్భుతంగా అనిపిస్తుంది. కానీ మలేషియా ఉదంతం ఒక విషయాన్ని గుర్తు చేస్తోంది. ఏదైనా సాంకేతికత చూడటానికి ఆకర్షణీయంగా ఉండి ప్రజల ఆదరణ పొందినా నిర్వహణ ఖర్చులు.. ప్రభుత్వ బడ్జెట్ పరిమితుల ముందు అది నిలబడటం కష్టమని తేలిపోయింది. పైలట్ ప్రాజెక్ట్ స్థాయిలో బాగున్నా.. క్షేత్రస్థాయిలో అమలుకు ఆర్థిక సవాళ్లు అడ్డుగా నిలిచాయి.
ఈ ప్రయోగాన్ని తొలుత హులు లంగత్ ప్రాంతంలోని ఒక చీకటి రహదారిపై చేపట్టారు. కేవలం వాహనాల హెడ్‌లైట్లపైనే ఆధారపడే డ్రైవర్లకు దిశానిర్దేశం చేసేందుకు సుమారు 245 మీటర్ల మేర ఈ `ఫోటోలూమినిసెంట్` మార్కింగ్‌లను వేశారు. సాధారణంగా వాడే `క్యాట్స్ ఐస్` కు ప్రత్యామ్నాయంగా వీటిని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పగటిపూట మామూలు పెయింట్‌లా కనిపించే ఈ లైన్లు, రాత్రి కాగానే స్వయంగా వెలుగుతూ వాహనదారులకు భద్రతా భావాన్ని కల్పించాయి.
ప్రారంభంలో ఈ ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వం సానుకూలంగానే స్పందించింది. వర్క్స్ మినిస్టర్ అలెగ్జాండర్ నాంటా లింగి మాట్లాడుతూ.. ఈ మార్కింగ్‌లు చీకటిలో స్పష్టంగా కనిపిస్తున్నాయని... వీధి దీపాలు లేని చోట ప్రయాణికులు మరింత సురక్షితంగా దారి చూపుతున్నాయని భావిస్తున్నారని పేర్కొన్నారు. అయితే అప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు అయ్యే ఖర్చుపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ప్రాజెక్ట్ పనితీరును మెచ్చుకున్నా.. దాన్ని కొనసాగించాలంటే అయ్యే ఆర్థిక భారం వారిని వెనక్కి లాగింది.
ఈ ప్రాజెక్ట్ ఖర్చుల వివరాలను పరిశీలిస్తే ...అధికారుల భయం వెనుక ఉన్న అసలు కారణం అర్థమవుతుంది. సాధారణ రోడ్డు మార్కింగ్ పెయింట్ ధర ఒక చదరపు మీటరుకు కేవలం 40 రింగ్గిట్లు కాగా... ఈ మెరిసే పెయింట్ ధర ఏకంగా 749 రింగ్గిట్లుగా తేలింది. అంటే సాధారణ పెయింట్ కంటే ఇది సుమారు 19 రెట్లు ఎక్కువ ఖరీదైనది. అంతర్జాతీయ కరెన్సీ లెక్కలో చూస్తే.. సాధారణ పెయింట్ చదరపు అడుగుకు సుమారు 0.81 డాలర్లు ఖర్చయితే... ఈ గ్లో పెయింట్‌కు 15.20 డాలర్లు ఖర్చవుతోంది.
నిర్వహణ పరంగా చూస్తే ఈ వ్యయం ఇంకా పెరిగే అవకాశం ఉంది. వర్షాకాలం తర్వాత రోడ్లపై పెయింట్ వెలవెలబోతే... తిరిగి వేయడానికి భారీగా ప్రజా ధనం వెచ్చించాల్సి ఉంటుంది. తొలుత ఈ పథకాన్ని 15 అదనపు ప్రాంతాలకు విస్తరించి.. 15 కిలోమీటర్ల మేర రోడ్లను మెరిపించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో అది అసాధ్యమనిపిస్తోంది. పర్యావరణ హితమైన సాంకేతికతలు కూడా ఆర్థిక స్థిరత్వంతో తోడైతేనే విజయవంతమవుతాయని మలేషియా ప్రయోగం నిరూపించింది.
అయితే మలేషియాలో ప్రయోగం విఫలమైనా.. ఈ విధానాన్ని తక్కువ ఖర్చుతో అమలయ్యేలా చేయడానికి సాంకేతికంగా ఇంకేదైనా భారతదేశంలోని శాస్త్ర వేత్తలు కనిపెడితే బావుంటుందేమో! ప్రతిదానికి ఒక పరిష్కారం తప్పకుండా ఉంటుంది. మలేషియా ఏదైతే ఫ్లాప్ ప్రయోగం చేసిందో దానిని సక్సెస్ చేసేందుకు యువ ఔత్సాహిక శాస్త్ర వేత్తలు తరుణోపాయాన్ని కనుగొంటే బావుంటుంది. 30 వేలకే సోలార్ కార్ కనిపెట్టిన వ్యక్తి రాయలసీమలో ని ఒక గ్రామంలో ఉన్నాడు. అలాంటప్పుడు మారుమూల రోడ్ మార్గాలకు తక్కువ ఖర్చుతో ద్వీపాలను ఏర్పాటు చేసే ప్రయోగం ఎందుకు చేయలేరు? అయితే భారతదేశంలో రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు పర్సంటేజీల వ్యవస్థ సమూలంగా మారేందుకు ఆస్కారం లేనప్పుడు ఇలాంటి ప్రయోగాలు ఎంతవరకూ సాధ్యమవుతాయి? అన్నది ప్రశ్నగా ఉంది.
