ఈ ప్రపంచానికి ఏమైంది? ఐదు సంపన్న దేశాల్లో యుద్ధాలు?
ప్రపంచానికి ఏమైంది? ఒకటి తర్వాత ఒకటి చొప్పున జరుగుతున్న యుద్ధాలు ప్రపంచానికి తలనొప్పిగా మారాయి.
By: Garuda Media | 18 March 2026 8:07 PM ISTప్రపంచానికి ఏమైంది? ఒకటి తర్వాత ఒకటి చొప్పున జరుగుతున్న యుద్ధాలు ప్రపంచానికి తలనొప్పిగా మారాయి. రష్యా - ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచానికి కొంత మేర ప్రభావాన్ని చూపినా.. ఇటీవల మొదలై.. అంతకంతకూ ముదురుతున్న ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా యుద్దం కారణంగా యావత్ ప్రపంచం ఏదో ఒక విధంగా ప్రభావితమవుతున్న సంగతి తెలిసిందే. నాలుగు వారాల్లో యుద్ధాన్ని ముగిస్తామని చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇప్పుడు అందుకు భిన్నంగా మరికొంతకాలం సాగుతుందన్న మాటను చెబుతున్నారు. యుద్దం సా..గుతున్న కొద్దీ కొత్త సమస్యలు అంతకంతకూ చుట్టుముడతాయన్నది మర్చిపోకూడదు.
ఇప్పుడున్న యుద్దాలు..అనిశ్చితి పరిస్థితులు సరిపోవన్నట్లు మరికొన్ని కొత్త యుద్దాలు మొదలు కానున్నాయా? యుద్దాల దిశగా అడుగులు వేస్తున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఈ వాదనకు బలం చేకూరే పరిణామాలు ఇప్పుడు మొదలై.. ప్రపంచానికి మరింత భయాందోళనలకు గురి చేస్తున్న పరిస్థితి. ఇరాతైవానన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం పేరుకు పశ్చిమాసియాలో జరుగుతున్న దీని ప్రభావం ప్రపంచం మీద ఉంది. ఇప్పుడు ఆసియాలోని మరిన్ని దేశాల మధ్య యుద్దం మొదలయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. దీనికి తగ్గట్లే అంతర్జాతీయ మీడియాలో ఈ వాదనను బలపరిచే కథనాలు పబ్లిష్ అవుతున్నాయి.
ఎంతో కాలంగా నివురు గప్పిన నిప్పులా ఉన్న తైవాన్ పై చైనా, జపాన్ లు గురి పెడుతున్నాయి. దక్షిణకొరియాపై ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు షురూ చేసినట్లు చెబుతున్నారు. ఇరాన్ లోని ఘర్షణను పరిష్కరించే పని భాగంగా.. అమెరికా మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలోనే ఇదంతా జరుగుతుందా? లేదంటే ఆయా దేశాలు నిజంగానే దాడులకు దిగుతున్నాయా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
తైవాన్ పై చైనా ఎప్పటి నుంచో యుద్ధానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న సమయంలోనే చైనా.. తైవాన్ ను చుట్టుముట్టింది. ఇప్పటివరకు 26 చైనా యుద్ధ విమానాలు, ఏడు యుద్ధ నౌకలు తైవాన్ చుట్టూ మొహరించాయి. తైవాన్ సరిహద్దుల్లో చైనా సైన్యం భారీ స్థాయిలో మొహరించింది. ఈ తరహా పరిణామం చరిత్రలో తొలిసారిగా చెబుతున్నారు. తాజా పరిణామాలు ప్రపంచ శాంతికి ఏ మాత్రం మేలు చేసేవి కాదన్నది మర్చిపోకూడదు. తైవాన్, చైనా, జపాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియాలో మొదటి నాలుగు దేశాలు ఆర్థికంగా సంప్నమైనవి మాత్రమే కాదు.. బలమైన దేశాలు. ఇలాంటి దేశాల మధ్య నడిచే యుద్ధం ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేయటం ఖాయం. మరేం జరుగుతుందో చూడాలి.
