Begin typing your search above and press return to search.

ఫ్రాన్స్ పై ట్రంప్ 200% సుంకాల వార్నింగ్.. మళ్లీ మొదలైన వార్

అంతర్జాతీయ వాణిజ్య రంగంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫ్రాన్స్‌ను లక్ష్యంగా చేసుకుని సంచలన ప్రకటన చేశారు.

By:  A.N.Kumar   |   20 Jan 2026 3:20 PM IST
ఫ్రాన్స్ పై ట్రంప్ 200% సుంకాల వార్నింగ్.. మళ్లీ మొదలైన వార్
X

అంతర్జాతీయ వాణిజ్య రంగంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫ్రాన్స్‌ను లక్ష్యంగా చేసుకుని సంచలన ప్రకటన చేశారు. ఫ్రాన్స్ నుంచి దిగుమతయ్యే ప్రపంచ ప్రసిద్ధ వైన్, షాంపైన్‌లపై ఏకంగా 200 శాతం టారిఫ్‌లు విధిస్తానని ఆయన హెచ్చరించారు. ఈ పరిణామం అగ్రరాజ్యం అమెరికా, యూరోపియన్ యూనియన్ మధ్య ఆర్థిక యుద్ధానికి దారితీసేలా కనిపిస్తోంది.

గాజాలో శాంతిని నెలకొల్పేందుకు ట్రంప్ 'బోర్డ్ ఆఫ్ పీస్' అనే ప్రత్యేక అంతర్జాతీయ శాంతి మండలిని ప్రతిపాదించారు. ఇందులో సభ్యులుగా చేరాలని ప్రపంచ దేశాలను ఆయన ఆహ్వానించారు. అయితే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. మెక్రాన్ నిర్ణయంపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. "నేను ఫ్రాన్స్ వైన్లు, షాంపైన్‌లపై 200 శాతం టారిఫ్‌లు వేస్తాను, అప్పుడు మెక్రాన్ కచ్చితంగా శాంతి మండలిలో చేరుతారు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.మెక్రాన్ పదవీకాలం త్వరలో ముగియనుందని, అందుకే ఎవరూ ఆయనను పట్టించుకోవడం లేదని ట్రంప్ సెటైర్లు వేశారు.

గ్రీన్‌లాండ్ చిచ్చు.. 'ట్రేడ్ బజూకా' హెచ్చరిక

కేవలం వైన్ మాత్రమే కాకుండా గ్రీన్‌లాండ్ ద్వీపాన్ని కొనుగోలు చేసే విషయంలో కూడా అమెరికాకు ఐరోపా దేశాలకు మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. గ్రీన్‌లాండ్ అమ్మకానికి మద్దతు ఇవ్వని ఎనిమిది ఐరోపా దేశాలు డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ సహా ఫిబ్రవరి 1 నుండి 10 శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తానని ట్రంప్ ప్రకటించారు. ఇది జూన్ నాటికి 25 శాతానికి పెరుగుతుందని హెచ్చరించారు.ఇలాంటి ఆర్థిక బెదిరింపులకు తలొగ్గేది లేదని మెక్రాన్ స్పష్టం చేశారు. అవసరమైతే ఐరోపా సమాఖ్య (ఈయూ) వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన 'యాంటీ కోయర్షన్ ఇన్‌స్ట్రుమెంట్' లేదా 'ట్రేడ్ బజూకా'ను ప్రయోగిస్తామని హెచ్చరించారు. ఇది అమల్లోకి వస్తే అమెరికా నుంచి వచ్చే వస్తువులు, సేవలు, పెట్టుబడులపై ఐరోపా దేశాలు కఠినమైన ఆంక్షలు విధిస్తాయి.

ఫ్రాన్స్ నుంచి వ్యంగ్యాస్త్రాలు

అమెరికా తీరుపై ఫ్రాన్స్ విదేశాంగ శాఖ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా స్పందించింది. "భవిష్యత్తులో ఎప్పుడో అగ్నిప్రమాదం జరుగుతుందని భయపడి, ఇప్పుడే ఇంటిని తగలబెట్టేయకండి. షార్క్ దాడి చేస్తుందని భయపడి లైఫ్‌గార్డునే తినేయకండి" అంటూ ట్వీట్ చేసింది. అంటే, గ్రీన్‌లాండ్ భద్రత పేరుతో అమెరికా చేస్తున్న ఈ గందరగోళం అర్థరహితమని ఫ్రాన్స్ అర్థం వచ్చేలా అగ్రరాజ్యానికి వార్నింగ్ ఇచ్చేసింది.

ఏం జరగబోతోంది?

ట్రంప్ తన హెచ్చరికలను అమలు చేస్తే, ఫ్రాన్స్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న వైన్ పరిశ్రమ భారీగా నష్టపోతుంది. అమెరికాలో ఫ్రెంచ్ వైన్ ధరలు సామాన్యులకు అందనంత స్థాయికి చేరుతాయి. ప్రతిగా ఐరోపా దేశాలు కూడా అమెరికా ఉత్పత్తులపై సుంకాలు పెంచితే, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే 'గ్లోబల్ ట్రేడ్ వార్'కు దారితీసే ప్రమాదం ఉంది.