Begin typing your search above and press return to search.

రెప్పపాటులో సోషల్ మీడియాలో ఏమి జరుగుతుందో తెలుసా..!

ప్రస్తుతం ప్రపంచంలో మెజారిటీ ప్రజానికం సోషల్ మీడియాకు అలవాటు పడినవారే అనే సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   30 Jan 2026 9:54 AM IST
రెప్పపాటులో సోషల్  మీడియాలో ఏమి జరుగుతుందో తెలుసా..!
X

ప్రస్తుతం ప్రపంచంలో మెజారిటీ ప్రజానికం సోషల్ మీడియాకు అలవాటు పడినవారే అనే సంగతి తెలిసిందే. అగ్రరాజ్యం, అభివృద్ధి చెందుతున్న దేశం, పేద రాజ్యం అనే తారతమ్యాలు పెద్దగా లేకుండా ప్రపంచ జనాభాలో సుమారు 69.9% మంది (దాదాపు 5.66 బిలియన్లు) సోషల్ మీడియా వినియోగదారులుగా ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయంటే.. ఈ డిజిటల్ ప్రపంచంలో మనిషి ఏ స్థాయిలో లీనమైపోయాడో తెలుస్తోంది. ఈ సమయంలో ఒక్క సెకనులో సోషల్ మీడియా ప్రపంచంలో జరిగే షాకింగ్ విషయాలు తెరపైకి వచ్చాయి.

అవును... తాజా గణాంకాల ప్రకారం ప్రపంచ జనాభాలో సుమారు 5.66 బిలియన్ల మంది ప్రజానికం సోషల్ మీడియా వినియోగదారులుగా ఉన్నారు. ఇందులో కొంతమంది రకరకాల ఫ్లాట్ ఫామ్ లలో యాక్టివ్ గా ఉండగా.. మరికొంతమంది కనీసం ఒక్క ఫ్లాట్ ఫామ్ లో అయినా యాక్టివ్ గా ఉన్నారు! అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 10 మందిలో ఏడుగురు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారన్నమాట! వాస్తవానికి గత ఏడాదిలో ఈ సంఖ్య 5.41 బిలియన్లుగా ఉండగా.. దాదాపు 4.6% పెరుగుదల నమోదైందని చెప్పొచ్చు!

ఈ విషయంలో.. అమెరికా విషయానికొస్తే అక్కడ ప్రతీ ఐదు మంది ఇంటర్నెట్ వినియోగదారుల్లోనూ నలుగురు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారు. ఇది ఆ దేశ జనాభాలో దాదాపు 73%గా లెక్కలు చెబుతున్నాయి. అయితే... ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగదారులు అత్యధిక సంఖ్యలో (1.18 బిలియన్లు) చైనాలో ఉండగా.. ఆ తర్వాత స్థానంలో భారతదేశం (0.87 బిలియన్లు) గా ఉన్నారు. ఈ సంఖ్యలు 2030 నాటి మరింతగా( చైనా - 1.36బి, భారత్ - 1.12బి) పెరుగుతాయని చెబుతున్నారు.

ఈ క్రమంలో సగటున ప్రజలు రోజూ కనీసం 2 గంటల 21 నిమిషాలు సోషల్ మీడియాలో గడుపుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ విషయంలో మిగిలిన ప్రపంచంతో పోలిస్తే అమెరికా ప్రజలు కాస్త తక్కువ సమయమే గడుపుతున్నారు. ఇందులో భాగంగా.. అమెరికన్లు రోజుకు సగటున 2 గంటల 9 నిమిషాలు సోషల్ మీడియాలో గడుపుతున్నారని చెబుతున్నారు. అంటే.. ప్రపంచ సగటు కంటే 12 నిమిషాలు తక్కువగా అన్నమాట.

ఈ పరిణామాల నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ఒక సెకనుకు వాట్సప్ లో సుమారు 10 లక్షల మెసేజ్ లు, 'ఎక్స్' లో 10 వేల ట్వీట్లు చేస్తుండగా.. ఇన్ స్టాగ్రామ్ లో 1,000 ఫోటోలు అప్ లోడ్ అవుతున్నాయని గూగులు జెమినీ ఆసక్తికర డేటాను వెల్లడించింది. ఇదే సమయంలో.. గూగుల్ లో ఒక్క సెకనులో లక్షకు పైగా సెర్చ్ లు జరుగుతుండగా.. ఇక యూట్యూబ్ లో 90,000 వీడియోలు చూస్తున్నారని తెలిపింది. దీంతో.. ఈ ఫిగర్స్ ఆసక్తికరంగా మారాయి!

ఈ విధంగా సోషల్ మీడియాలో ప్రజలు కనెక్ట్ అవ్వడానికి అలవాటు పడుతుండగా.. అధిక స్క్రీన్ సమయం శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొన్న ఆస్ట్రేలియా, తాజాగా ఫ్రాన్స్ 16, 15 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం అమలు చేస్తున్న పరిస్థితి! ఈ దిశగానే భారత్ లో ఏపీ రాష్ట్రం కూడా ఆలోచిస్తుందని అంటున్నారు!