పెరిగిపోతున్న ఇల్లు లేని వారి సంఖ్య.. వరల్డ్ వైడ్ ఏ దేశంలో ఎంతమంది అంటే?
మనిషి భూమ్మీద జీవిస్తున్నాడు అంటే తప్పనిసరిగా ఈ మూడు ఉండాల్సిందే.కూడు గూడు గుడ్డ.
By: Madhu Reddy | 25 Oct 2025 12:00 AM ISTమనిషి భూమ్మీద జీవిస్తున్నాడు అంటే తప్పనిసరిగా ఈ మూడు ఉండాల్సిందే.కూడు గూడు గుడ్డ. ప్రతి మనిషి తన జీవితంలో ఈ మూడు సాధించుకోవడం కోసమే పోరాడుతూ ఉంటాడు. ఈ మూడింట్లో ఏది లేకపోయినా మనిషి పూర్తిస్థాయిలో వెనుకబడిపోయినట్టే. ముఖ్యంగా మానవుడు భూమిపై పుట్టిన టైంలో పొట్ట నింపుకోవడానికి వేటాడే వాడట. అలా ఆహారం సంపాదించుకోవడం నేర్చుకున్నాడు. అలా కాలం గడుస్తున్న కొలదీ పెద్ద పెద్ద రాళ్ల చాటున ఉండడం, బండల కింద తలదాచుకోవడం వంటివి నేర్చుకున్నాడు. అలా చెట్ల కింద గుడిసెలు వేసుకుని ఉండడం అలవాటు పడ్డాడు. అలా గూడును కూడా సంపాదించుకునే స్థాయికి చేరాడు. అయితే ఈ రెండు సంపాదించుకునే సమయానికి మానవులు పూర్తిగా బట్టలు లేకుండానే తిరిగేవారు. కానీ రాను రాను చెట్ల ఆకులు కట్టుకోవడం ఇలా మెల్లిమెల్లిగా బట్టలు నేసుకొని వేసుకోవడం వరకు వచ్చింది.
అలా ప్రతి మానవుడికి కూడు,గూడు,గుడ్డ అనేది తప్పనిసరి అయిపోయింది. కానీ ఇప్పుడు సమాజంలో చాలా టెక్నాలజీ పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు కూడా తమకి కావాల్సిన ఆహారం తింటున్నారు. నచ్చిన బట్టలు వేసుకుంటున్నారు. తమకు నచ్చిన ఇల్లు కట్టుకుంటున్నారు. కానీ ఈ టెక్నాలజీ ప్రపంచంలో కూడా పూర్తిగా ఇండ్లు లేని వారు లక్షలాది మంది ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. ముఖ్యముగా ప్రపంచవ్యాప్తంగా ఇల్లు లేకుండా లక్షలాదిమంది రోడ్లపైనే జీవిస్తున్నారట. మరి ఏ దేశంలో ఎంతమంది ఇల్లు లేనివారు ఉన్నారు అనేది ఇప్పుడు చూద్దాం..
ప్రపంచ దేశాలలో అన్ని దేశాల కంటే పాకిస్తాన్ దేశంలోనే ఇల్లు లేని వారి సంఖ్య అధికంగా ఉందట. పాకిస్తాన్ లో ఇల్లు లేని వారు దాదాపు 80లక్షల మందికి పైగా ఉన్నారు. అలాగే సిరియా దేశంలో 53 లక్షల మంది ఇల్లు లేకుండానే ఉన్నారట. అలాగే బంగ్లాదేశ్ లో 50 లక్షలు, నైజీరియాలో 45 లక్షలు, ఫిలిప్పీన్స్ లో 45 లక్షలు, ఉగాండాలో 4,016,980, అర్జెంటీనాలో 36 లక్షలు, సుడాన్ లో 30 లక్షలు, చైనాలో 25,79,000, నేపాల్ లో 25 లక్షలు, ఈజిప్టులో 20 లక్షలు, ఇరాక్ లో 20 లక్షలు ఇండియాలో 1,77,000, మయన్మార్ లో 15 లక్షలు, సోమాలియాలో 14 లక్షలు, జింబాబ్వేలో 12 లక్షలు, పెరూ దేశంలో ఏడు లక్షలు, బుర్ కినా ఫాసో దేశంలో ఏడు లక్షలు, కొలంబియాలో 6,62146, యునైటెడ్ స్టేట్స్ లో 6,53,104, మొజాంబిక్ దేశంలో 6,40,000, ఇథియోపియా దేశంలో ఆరు లక్షలు, యూకే లో 3,80,000 మంది ఇప్పటివరకు ఇల్లు లేకుండా దారుణమైన పరిస్థితిలో అనుభవిస్తున్నారనీ ఓఈసిడి అనే రిపోర్టు ద్వారా బయటకు వచ్చింది.
అయితే 2020 వరకే ఇన్ని దేశాలలో ఇన్ని లక్షల మందికి ఇల్లు లేవంటే.. ఇప్పుడు ప్రస్తుతం 2025 లో ఉన్నాం.కాబట్టి ఇప్పుడు ఆ దేశాలలో ఇల్లు లేని వారి సంఖ్య మరింతగా పెరిగిందని చెప్పుకోవచ్చు.. ఈ రిపోర్టు చూసుకుంటే మాత్రం ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా ఇంకా చాలా దేశాలు అభివృద్ధికి దూరంగానే ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు.
