Begin typing your search above and press return to search.

సైనిక బలంలో టాప్ 10దేశాలు ఇవే.. నిలబడ్డ భారత్, పడిపోయిన పాక్!

అవును... దేశాల సైనిక సామర్థ్యాల ఆధారంగా ర్యాంక్ ఇచ్చే సంస్థ గ్లోబల్ ఫైర్‌ పవర్ ఇండెక్స్.. ప్రపంచవ్యాప్తంగా 145 దేశాల సైనిక శక్తిని అంచనా వేసింది.

By:  Raja Ch   |   27 Jan 2026 8:00 PM IST
సైనిక బలంలో టాప్ 10దేశాలు ఇవే.. నిలబడ్డ భారత్, పడిపోయిన పాక్!
X

గత ఏడాది పహల్గాంలోని బైసరన్ లోయలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన మారణహోమం తర్వాత.. అందుకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. నాడు భారత సైన్యం దెబ్బకు బెంబేలెత్తిపోయిన పాక్.. సీజ్ ఫైర్ కు రిక్వస్ట్ పెట్టుకుంది. దీంతో.. అందుకు భారత్ అంగీకరించింది. కట్ చేస్తే.. ఆ యుద్ధంలో తమదే పై చేయి అని.. భారత క్షిపణులను తాము కూల్చేశామని కబుర్లు చెప్పుకుంది పాక్. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.. సైనిక బలం వివరాల్లో భారత్, పాక్ బలాలు స్పష్టమయ్యాయి!

అవును... దేశాల సైనిక సామర్థ్యాల ఆధారంగా ర్యాంక్ ఇచ్చే సంస్థ గ్లోబల్ ఫైర్‌ పవర్ ఇండెక్స్.. ప్రపంచవ్యాప్తంగా 145 దేశాల సైనిక శక్తిని అంచనా వేసింది. ఈ తాజా నివేదికలో భారత్ సహా అమెరికా, రష్యా, చైనా, దక్షిణ కొరియా తమ తమ స్థానాలను నిలబెట్టుకోగా పాక్ మరింతగా పడిపోయింది. ఇందులో కచ్చితంగా పవర్ ఇండెక్స్ స్కోరు 0.0000 గా అనుకుంటే.. ఇందులో ఎంత తక్కువ స్కోరు ఉంటే ఆ దేశం సంప్రదాయ పోరాట సామర్థ్యం అంత శక్తివంతంగా ఉంటుందని గ్లోబల్ ఫైర్ పవర్ తాజాగా తెలిపింది! ర్యాంకులు వెల్లడించింది.

ఇదే సమయంలో... ఈ స్కోర్‌ ను లెక్కించడానికి 60 కంటే ఎక్కువ విభిన్న పారామితులను మూల్యాంకనం చేస్తున్నట్లు తెలిపింది. వీటిలో దళాల సంఖ్యలు, ఆయుధ నిల్వలు మాత్రమే కాకుండా.. ఆ దేశ ఆర్థిక సామర్థ్యం, రక్షణ బడ్జెట్, లాజిస్టికల్ యాక్సెస్, భౌగోళిక ప్రయోజనం, సహజ వనరులు, మొత్తం సైనిక సంసిద్ధత వంటి మొదలైన అంశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తక్కువ పవర్ ఇండెక్స్ స్కోరు ఎక్కువ సైనిక శక్తిని సూచిస్తుందని తెలిపింది. అందుకే వీటిని ర్యాంకులుగా చెబుతోంది!

నిలబడ్డ భారత్, పడిపోయిన పాక్!:

ఈ జాబితాలో 2005 నుండి అగ్రస్థానంలో కొనసాగుగుతున్న అగ్రరాజ్యం.. 2026లోనూ తన స్థానాన్ని నిలుపుకుంది. ఇందులో భాగంగా.. 0.0741 పవర్ ఇండెక్స్ స్కోరుతో యునైటెడ్ స్టేట్స్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యంగా నిలిచింది. అనంతరం.. 0.0791 స్కోర్ తో రష్యా.. 0.0919 స్కోర్‌ తో చైనా వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ క్రమంలో.. 0.1346 స్కోరుతో భారత్ నాల్గవ స్థానంలో నిలిచింది. 0.1642తో దక్షిణ కొరియా ఐదో స్థానంలో నిలిచింది. ఈ ఐదు దేశాలు గత ఏడాది కూడా ఇవే స్థానాల్లో నిలిచాయి.

ఇదే క్రమంలో... గత ఏడాది 7వ స్థానంలో ఉన్న ఫ్రాన్స్ ఈ సారి 0.1798 స్కోరుతో ఆరో స్థానానికి చేరుకోగా.. గత ఏడాది 8వ స్థానంలో ఉన్న జపాన్ 0.1876 స్కోరుతో 7వ స్థానానికి ఎగబాకింది. అదేవిధంగా.. గత ఏడాది 6వ స్థానంలో ఉన్న యునైటెడ్ కింగ్ డమ్.. 0.1881తో ఈ సారి 8వ స్థానానికి పడిపోయింది. ఇదే క్రమంలో... 0.1975తో టర్కీ ఈ సారి తన 9వ స్థానాన్ని కాపాడుకోగా.. 0.2211తో ఇటలీ కూడా తన గత 10వ ర్యాంకును నిలుపుకుంది.

ఈ క్రమంలో... జర్మనీ 2024లో 19వ స్థానంలో నిలవగా తాజా 2026 ర్యాకింగ్స్ లో 12వ స్థానానికి చేరుకుంది. దీంతో.. ఇది దాని సైనిక సామర్థ్యాలలో గణనీయమైన మెరుగుదలలను ప్రతిబింబిస్తుంది. మరోవైపు పాకిస్థాన్ తన దిగజారుడు ధోరణిని కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా... 2024లో 9వ స్థానంలో 2025లో 12వ స్థానంలో నిలిచిన ఆ దేశం తాజా ర్యాకింగ్స్ లో 0.2626 పవర్ ఇండెక్స్ స్కోర్ తో 14వ స్థానానికి పడిపోయింది.