Begin typing your search above and press return to search.

ఇండియా...డేంజర్ బెల్స్ మోగుతున్నాయ్ జాగ్రత్త

మరి మనదేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమై పోతుందా? మరో శ్రీలంకగా మారే ప్రమాదముందా అంటే అలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదంటున్నారు కొందరు నిపుణులు.

By:  Tupaki Political Desk   |   1 Jan 2026 1:37 PM IST
ఇండియా...డేంజర్ బెల్స్ మోగుతున్నాయ్ జాగ్రత్త
X

దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు వాటిల్లబోతోందా? ప్రపంచ ఆర్థిక అనిశ్చితి ప్రభావం ఇండియాపై పడనుందా? రానున్న కాలంలో మనం ఆర్థికంగా మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కొనక తప్పదా? ద్రవ్యోల్బణం పెరుగుదలకు అడ్డుకట్ట పడదా? రూపాయి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇవన్నీ దేశ ఆర్థిక నిపుణులను వేధిస్తున్న ప్రశ్నలు. భారత్ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం పొంచి ఉందని రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరికలు జారీ చేయడంతో పలు అనుమానాల నీడలు మనపై కమ్ముతున్నాయి. అయితే ఈ గడ్డు పరిస్థితికి కారణాలేంటి? ఇండియాలో విధాన లోపాలే ప్రధానాంశాల అంటే అదొక్కటే కాదు...ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక స్థితిగతులూ కారణాలే అన్న మాట వినవస్తోంది.

అమెరికా స్టాక్ మార్కెట్లో నెలకొన్న సంక్షోభం కావచ్చు...కరెన్సీ మారకంలో హెచ్చుతగ్గులు కావచ్చు, అంతర్గత పరిస్థితులు కావచ్చు...ఇలా పలు కారణాల ప్రభావం ఇండియా ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశాలు చాలా హెచ్చుగా కనిపిస్తున్నాయని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. ఇదే విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా స్పష్టం చేసింది. ఈ కారణాల వల్లే విదేశీ పోర్ట్ ఫోలియో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. విక్రయాల వల్ల భారత్ ఆర్థిక వ్యవస్థకు కొంతమేర నష్టం వాటిల్లినా వాటిల్లవచ్చని అంటున్నారు.

మరి మనదేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమై పోతుందా? మరో శ్రీలంకగా మారే ప్రమాదముందా అంటే అలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదంటున్నారు కొందరు నిపుణులు. ఎలాంటి ఆర్థిక హెచ్చరికలు వచ్చినా, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వాటిని సమర్థంగా ఎదుర్కొనే సత్తా మన దేశానికి ఉందని ఆర్ బీఐ అంటోంది. బ్యాంక్ ఇటీవల విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదిక లో ఈ విషయాన్ని వివరించింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితుల ప్రభావాలు మనపై పడే అవకాశాలను కొట్టిపారేయలేమని, అయితే ఇవి కేవలం భారత్ మాత్రమే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని లోపాలను సైతం బహిర్గతం చేస్తున్నాయని ఆర్ బీఐ అంటోంది.

భారత్ ప్రస్తుతం ఆర్థికంగా సక్రమ దిశగానే అడుగులేస్తోంది. ప్రధానంగా ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఆర్థిక లోటును నియంత్రించేలా కేంద్రం తీసుకుంటున్న చర్యలు సత్పలితాలనిస్తున్నాయి. అలాగే స్థూల ఆర్థిక విధానాలు కూడా దేశాన్ని మరింత బలోపేతం చేస్తున్నట్లు ఆర్ బీఐ వివరిస్తోంది. కేవలం మనదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ వివాదాలకు తక్కువేం లేదు. ఇవి కచ్చితంగా అభివృద్ధి చెందుతున్న భారత్ కు పెను సవాళ్ళు విసరవచ్చు. ముఖ్యంగా కరెన్సీ మారకపు ధరల్లో అస్థిరత, అంతర్జాతీయ వాణిజ్యం బలహీనపడటం, కార్పొరేట్ లాభాలు క్షీణించడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల శాతం తగ్గడం లాంటి పరిణామలు చోటుచేసుకోవచ్చని ఆర్ బీఐ అంటోంది.

అయితే మనదేశ అర్థిక పటిష్ఠతకు మార్గాలే లేవా? అంటే అంత నిరాశచెందాల్సిన అవసరం కూడా లేదు. ఆర్థిక పరిస్థితులు ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి. రుతుపవనాలు సకాలంలో వర్షాలు కురిపించే అవకాశాలున్నాయి. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల సంస్కరణలు, డిజిటల్ సదుపాయాల విస్తరణ తదితర విషయాలు భారత్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేవేనని ఆర్థిక స్థిరత్వ నివేదిక లో ఆర్ బీఐ తెలిపింది. గణాంకాల ప్రకారం చూసుకున్నా...2026 ఆర్థిక సంవత్సరం రెండో ట్రైమిస్టర్ లో కరెంట్ ఖాతా లోటు జీడీపీలో 13 శాతానికి చేరుకుంది. కానీ బలమైన ఎగుమతుల వల్ల ఈ లోటును పూడ్చుకోవచ్చు. డిసెంబర్ 19, 2025 నాటికి భారత్ విదేవీ మారక నిల్వలు 693.3 బిలియన్ డాలర్లు చేరుకుంది. సో పరిస్థితి చేయిదాటిపోలేదు కానీ ముందస్తు జాగ్రత్తగా వ్యవహరించడం, రానున్న సవాళ్ళను ఎదుర్కోడానికి సంసిద్దంగా ఉండటం అవసరమని ఆర్ బీఐ తన నివేదిక ద్వారా పరోక్షంగా హెచ్చరిస్తోంది.