Begin typing your search above and press return to search.

2026లో భారీ ఆర్థిక సంక్షోభం.. వెంటనే సిద్ధమవ్వండి?

డాలర్ ఇప్పటికీ ప్రపంచ కరెన్సీ అయినప్పటికీ దాని మీద ఆధారపడడం వల్లే చాలా దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి.

By:  A.N.Kumar   |   17 Dec 2025 3:45 PM IST
2026లో భారీ ఆర్థిక సంక్షోభం.. వెంటనే సిద్ధమవ్వండి?
X

ప్రస్తుతం ఎక్కడా చూసినా గడ్డుకాలమే నడుస్తోంది. ఏఐ, ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలు పిట్టాల్లా రాలుతున్నాయి. అసలు కొత్త ఉద్యోగాలే రావడం లేదు. ఉన్నవీ పోతున్నాయి. ఏళ్లకు ఏళ్లు కట్టుబానిసలా పనిచేసిన ఉద్యోగులను కూడా దయా దాక్షిణ్యాలు లేకుండా కంపెనీలు సాగనంపుతున్నాయి.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరో కీలక మలుపు దిశగా సాగుతోందా? అంతర్జాతీయ ఆర్థికనిపుణులు, ఇన్వెస్టర్లు, ప్రముఖ రచయితలు 2026 నాటికి ఒక పెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశాలపై హెచ్చరికలు చేస్తున్నారు. డెట్ ట్రాప్, డాలర్ పై ఒత్తిడి, ఏఐ వల్ల ఉద్యోగాల్లో మార్పులు ఇవన్నీ కలిస్తే సామాన్యుడి జీవితంపై తీవ్ర ప్రభావం పడే పరిస్థితి కనిపిస్తోంది.

అప్పుల వలయంలో ప్రపంచం

ప్రస్తుతం చాలా దేశాలు భారీ అప్పుల్లో కూరుకుపోయాయి. ప్రభుత్వాలు తీసుకుంటున్న రుణాలు పెరుగుతూనే ఉన్నాయి. వడ్డీ రేట్లు అధికంగా ఉండడంతో ఆ అప్పులను చెల్లించడం కష్టంగా మారుతోంది. ఒక దశలో డెట్ బాంబ్ పేలితే.. ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలయ్యే ప్రమాదం ఉంటుంది. దీనినే నిపుణులు ‘డెట్ ట్రాప్’గా హెచ్చరిస్తున్నారు.

డాలర్ క్రైసిస్.. ఫియాట్ కరెన్సీలపై అనుమానాలు

డాలర్ ఇప్పటికీ ప్రపంచ కరెన్సీ అయినప్పటికీ దాని మీద ఆధారపడడం వల్లే చాలా దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. అమెరికా భారీగా డబ్బు ముద్రించడం.. పెరుగుతున్న లోటు.. ఇవన్నీ డాలర్ విలువపై ప్రశ్నలు లేపుతున్నాయి. ఫలితంగా రూపాయి వంటి కరెన్సీలు మరింత బలహీనపడే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఏఐ వల్ల జాబ్స్ రిస్క్

ఏఐ వేగంగా విస్తరిస్తోంది. ఇది ఒకవైపు అవకాశాలు తీసుకువస్తున్నా.. మరోవైపు లక్షలాది ఉద్యోగులకు ముప్పుగా మారుతోంది. ముఖ్యంగా రూటీన్, వైట్ కాలర్ ఉద్యోగాల్లో భారీ మార్పులు వస్తాయని అంచనాలు ఉన్నాయి. ఉద్యోగ భద్రతపై అనిశ్చితి పెరుగుతోంది.

ఈఎంఐలు, లోన్లతో జాగ్రత్త అవసరం

వడ్డీ రేట్లు పెరుగుతున్న వేళ భారీ లోన్లు, ఎక్కువ ఈఎంఐలు భవిష్యత్తులో భారంగా మారవచ్చు. అందుకే అవసరం లేని అప్పులను తగ్గించుకోవడం.. ఈఎంఐ భారం తగ్గించుకోవడం చాలా ముఖ్యమని ఆర్థికనిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి అనిశ్చితి కాలాల్లో చేతిలో నగదు ఉండటం చాలా అవసరం. అత్యవసర పరిస్థితుల్లో పెట్టుబడులు వెంటనే ఉపయోగపడవు. అందుకే కొంత క్యాష్ ను సేఫ్ గా ఉంచుకోవడం తెలివైన నిర్ణయం.

బంగారం.. సంప్రదాయ సురక్షిత ఆస్తి

చరిత్రలో ఎప్పుడైనా సంక్షోభం వచ్చినప్పుడు బంగారం తన విలువను నిలుపుకుంది. ఫియాట్ కరెన్సీలపై నమ్మకం తగ్గినప్పుడు బంగారం ఒక సురక్షిత ఆశ్రయంగా మారుతుంది. అందుకే గోల్డ్ ను సేఫ్ ఆస్తిగా చూడాలని నిపుణులు చెబుతున్నారు.

భయపడకుండా సిద్ధమవ్వండి..

2026లో నిజంగా పెద్ద ఆర్థిక సంక్షోభం వస్తుందా? లేదా? అన్నది కాలమే చెప్పాలి. కానీ జాగ్రత్తలు తీసుకోవడం తప్పు కాదు. ఫైనాన్షియల్ నాలెడ్జ్ పెంచుకోవడం.. స్కిల్స్ అప్టేట్ చేసుకోవడం అప్పులను నియంత్రించడం ఇవే మనకు నిజమైన రక్షణగా నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తును ఎదుర్కొనేందుకు ఇప్పుడే ప్లాన్ చేయండి.