పుట్టపర్తిలో పెద్ద పండుగ.. తరలివస్తున్న ప్రముఖులు
భగవాన్ శ్రీసత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సహజంగా ఏటా నవంబరు 18న సత్యసాయి జయంత్యుత్సవాలను నిర్వహిస్తారు.
By: Tupaki Political Desk | 13 Nov 2025 1:47 PM ISTభగవాన్ శ్రీసత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సహజంగా ఏటా నవంబరు 18న సత్యసాయి జయంత్యుత్సవాలను నిర్వహిస్తారు. కానీ ఈ సారి శత జయంతిని పురస్కరించుకుని ఐదు రోజుల ముందుగానే కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇక భక్తుల కోసం గురువారం నుంచి పుట్టపర్తిలో నారాయణసేవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రశాంతి నిలయంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ నారాయణసేవను ప్రారంభించారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో వేర్వేరు ప్రాంతాల్లోనూ నారాయణసేవ కొనసాగేలా ఏర్పాట్లు చేశారు.
ఇక ఉత్సవాలలో భాగంగా ఈ నెల 18న సత్యసాయి రథోత్సవం నిర్వహిస్తారు. 19న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతుంది. 20, 21 తేదీల్లో అంతర్జాతీయ సమ్మేళనాలు, 22న సత్యసాయి యూనివర్సిటీ స్నాతకోత్సవం, 23న సత్యసాయి శత జయంతి వేడుకలు జరుగుతాయని ట్రస్టు తెలిపింది. ఈ నెల 19న ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టపర్తిలో పర్యటించనున్నారు. సత్యసాయి శత జయంతి వేడుకల్లో భాగం కానున్నారు. అదేవిధంగా 22న ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ వస్తారు. 23న జరిగే ముగింపు వేడుకలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు.
ప్రధాని, ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి పర్యటనలు ఉండటంతో పుట్టపర్తి పట్టణంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎస్ విజయానంద్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు సత్యసాయి జయంతి ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా వస్తున్నారు. దాదాపు 185 దేశాల నుంచి సుమారు 15 లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా. సత్యసాయి శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందున భక్తులు, వీవీఐపీల కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని డిసెంబర్ 1 వరకు 65 ప్రత్యేక రైళ్లతో పాటు మొత్తం 682 రైళ్లను రైల్వే శాఖ పుట్టపర్తికి నడపనుంది. ఇక పుట్టపర్తి బస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్‌కు ప్రతిరోజు 20 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. పట్టణంలో ట్రాఫిక్ నిర్వహణ కోసం ప్రత్యేక దృష్టి సారించారు.
