ఒక దేశ మహిళా ప్రధానిపై చిల్లర కామెంట్.. భారతీయులు చులకనేగా!
అయితే పబ్లిక్ డొమైన్‌లో ఇలాంటి వ్యాఖ్యలు రావడం వల్ల అంతర్జాతీయంగా భారతీయుల ప్రవర్తనపై భిన్నమైన డిబేట్ నడిచే అవకాశం ఉందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
By: Sivaji Kontham | 24 July 2026 4:00 AM ISTఇటలీ తొలి మహిళా ప్రధాని జార్జియా మెలోని ఇన్‌స్టాగ్రామ్ పోస్టు కింద ఒక నెటిజన్ చేసిన వ్యాఖ్య ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. సాధారణంగా ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తులు పెట్టే పోస్టులకు ప్రపంచవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తుంటుంది. అయితే ఊహించని విధంగా ఒక నెటిజన్ ఆ పోస్టు కింద ``స్టూడెంట్ల సమస్యలు వినమని మీ బాయ్‌ఫ్రెండ్‌కు చెప్పండి`` అంటూ కామెంట్ చేయడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
గతంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని మెలోని కలయికకు సంబంధించిన దృశ్యాలు.. వీరిద్దరి పేర్లను కలిపి `మెలోడీ` అనే హాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ అంశాన్ని ఆధారంగా చేసుకుని.. నేరుగా ఇటలీ ప్రధాని పోస్టులోనే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. విదేశీ వేదికల ముందు.. అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్ఠను దిగజార్చేలా ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు.
నిజానికి ఇటలీ మహిళా ప్రధాని గొప్పతనం.. ఆమె రాజకీయ ప్రస్థానం గురించి తెలిసిన వారెవరూ ఇలాంటి తప్పుడు కూతలు కూయరు. ఒక దేశానికి నాయకత్వం వహిస్తున్న మహిళ పట్ల గౌరవం లేకుండా వ్యవహరించడం సమర్థనీయం కాదు. పైగా.. రోజువారీ పరిపాలనా వ్యవహారాల్లో ఎంతో బిజీగా ఉండే మెలోనికి ఇలాంటి ఆకతాయి కామెంట్లు చూసే తీరిక కూడా ఉండదు. సదరు మహిళా నాయకురాలు డిజిటల్ టీమ్ కూడా ఇలాంటి అనవసర విషయాలను ఆమె దృష్టికి తీసుకెళ్లదు కాబట్టి...ఆ కామెంట్ వల్ల మెలనీకి వచ్చే నష్టమేమీ లేదు.
అయితే పబ్లిక్ డొమైన్‌లో ఇలాంటి వ్యాఖ్యలు రావడం వల్ల అంతర్జాతీయంగా భారతీయుల ప్రవర్తనపై భిన్నమైన డిబేట్ నడిచే అవకాశం ఉందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ స్త్రీల గౌరవాన్ని, నాయకుల పరిమితులను కాపాడేలా నడుచుకోవాలని హితవు పలుకుతున్నారు. వ్యక్తిగత హద్దులు దాటి.. ఇతర దేశాల నాయకుల సోషల్ మీడియా వేదికలపై ఇలాంటి పిచ్చి కూతలు కూయడం బాధ్యతారాహిత్యమే అవుతుంది.
ఒకవేళ దేశంలో విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఉంటే.. వాటిని పరిష్కరించుకోవడానికి ప్రజాస్వామ్యబద్ధమైన మార్గాలు ఉన్నాయి. సంబంధిత ప్రభుత్వ శాఖలకు లేదా అధికారులకు అధికారికంగా విన్నపాలను అందించాలే తప్ప...ఇలా విదేశీ ప్రధాని పోస్టుల్లో హద్దులు దాటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తామంటే ఎవరూ ఊరుకోరు. ఇటువంటి బాధ్యతారాహిత్యమైన చర్యలను ఖండిస్తూ.. సోషల్ మీడియా వాడకంలో కనీస అవగాహన, గౌరవం ఉండాలని నెటిజన్లు గట్టిగా సూచిస్తున్నారు.
