జార్జియా మెలోని తాజా బుక్ ఎందుకంత ఆసక్తికరం?
సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి.. తరచూ రీల్స్ చూసే వారికి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని వీడియో తరచూ స్క్రోల్ అవుతూ ఉంటాయి.
By: Garuda Media | 26 Jun 2026 10:30 AM ISTసోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి.. తరచూ రీల్స్ చూసే వారికి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని వీడియో తరచూ స్క్రోల్ అవుతూ ఉంటాయి. అంతర్జాతీయ వేదికల మీద తళుక్కున మెరిసే ఇమేజ్ ఆమె సొంతం. అన్నింటికి మించి ఆమె వ్యక్తిత్వం.. పాలన.. దేశ ప్రజల ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ పడని తత్త్వం ఆమె సొంతం. ఇటలీ తొలి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మెలోని తన పదవీ కాలాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మోడీతో కలిసి మెలోడీ.. ఇటీవల ముగిసిన జీ7 సదస్సులో మోడీ - మెలోనీ కలిసిన సందర్భంగా సరదాగా సాగిన వారి చిన్న సంభాషణ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారింది.
సదరు వైరల్ వీడియోలో సోషల్ మీడియాలో తమకున్న ప్రజాదరణ గురించి మాట్లాడిన సందర్భంలో మెలోనీ స్పందిస్తూ.. ‘అవును.. ఇన్ స్టా గ్రామ్ లో మేమే ఫేమస్ జంట’గా నవ్వుతూ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రాగానే.. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున షేర్ అయిన పరిస్థితి. మెలోనీ పేరు కాస్తా మెలోడీగా మారటానికి కారణం.. మెలోని.. మోడీ పేర్లను కలిపి మెలోడీగా మార్చారు. నెటిజన్లు సరదాగా స్టార్ట్ చేస్తే.. ఆ తర్వాతి కాలంలో మెలోనీ .. మోడీలు ఇద్దరు కూడా మెలోడీ పదానికి బలం చేకూరేలా వ్యవహరించటం.. ఇటీవల పార్లే సంస్థకు చెందిన మెటోడీ టోఫీలను మెలోనీకి మోడీ బహుకరించటంతో వీరిద్దరూ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన పరిస్థితి.
ఇదంతా ఒక ఎత్తు అయితే తాజాగా ఆమె సరికొత్త పుస్తకం జార్జియాస్ విజన్. అయితే.. ఈ పుస్తకాన్ని మోలోనీ స్వయంగా రాయలేదు. ప్రఖ్యాత జర్నలిస్టు అలెశాండ్రో సల్లుస్టితో జరిపిన సంభాషణల ఆధారంగా ఆమె పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకానికి ముందు మాటగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ రాయటం విశేషం. ఈ పుస్తకంలో భారత పర్యటనతో పాటు.. అంతర్జాతీయ దౌత్యం.. తన రాజకీయ సిద్ధాంతాలతో పాటు.. మధ్యతరగతి కుటుంబం నుంచి రాజకీయ నేతగా ఎదిగిన అంశాల్ని సందర్భానికి అనుగుణంగా ప్రస్తావించారు.
నిజానికి ఈ పుస్తకం రాయాలన్న నిర్ణయానికి వెనుక ఆసక్తికర కారణం ఉందని చెప్పాలి. ఇటలీ ప్రధానిగా మెలోనీ బాధ్యతలు స్వీకరించిన కొన్ని వారాల తర్వాత ప్రముఖ జర్నలిస్ట్ అలెశాండ్రో సల్లుస్టి ఆమెను కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒక దేశ ప్రధానమంత్రిగా ఉంటూ.. తమ ఫ్యూచర్ ప్లాన్లను వివరిస్తూ పుస్తకాలు రాయటం కుదరకపోవటం విచారకరమని వ్యాఖ్యానించారు. దీనికి మెలోనీ స్పందిస్తూ.. ఎందుకు రాయకూడదు? అందరూ చేసే పనులను చేయటం నాకు అలవాటు కాదని పేర్కొంటూ.. తమ మధ్య జరిగే సంభాషణలతో పుస్తకం రాయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఈ పుస్తకంలో పలు దేశాల అధ్యక్షులు.. ప్రధానమంత్రులతో ఉన్న మానవీయ సంబంధాలను ఈ పుస్తకంలో ప్రస్తావించారు. 2023లో ఆమె రెండుసార్లు భారత్ ను పర్యటించారు. ఆ సమయంలో న్యూఢిల్లీ వీధుల్లో ఆమె చిరునవ్వుతో కూడిన పెద్ద పోస్టర్లను భారీగా ఏర్పాటు చేయటంతో తాను ఆశ్చర్యపోయినట్లుగా పేర్కొన్నారు. తనను సంతోషానికి గురి చేసినట్లుగా ఆమె చెప్పారు. ఆమె తిరిగి వెళ్లే సమయంలో.. ఆమెకు స్వాగతం చెబుతూ ఏర్పాటు చేసిన పోస్టర్ల స్థానంలో.. థాంక్యూ ఫర్ విజిటింగ్ అని మార్చటం ఆమెను ఆశ్చర్యానికి గురి చేసేలా చేసింది. ఈ సందర్భంగా మెలోనీకి ఉన్న క్రేజ్ గురించి సరదాగా ఇటలీ ఉప ప్రధాని ఆంటోనియో తాజాని వ్యాఖ్యానిస్తూ.. ఈ క్రేజ్ చూస్తుంటే.. మీరుకానీ న్యూఢిల్లీలోని ఏదైనా నియోజకవర్గంలో పోటీ చేస్తే..కనీసం పది లక్షల ఓట్లతో గెలుస్తారంటూ జోక్ చేసిన విషయాన్ని ఈ పుస్తకంలో ప్రస్తావించటం విశేషం.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తనకున్న సాన్నిహిత్యం.. సోషల్ మీడియాలో వైరల్ అయిన మోలోడీ మీమ్స్ ప్రస్తావన కూడా ఈ పుస్తకంలో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గురించి పేర్కొంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. భారత ప్రధాని మోడీతో దౌత్యపరమైన చర్చల కంటే మించిన మానవీయ సంబంధం ఏర్పడిందని ఆమె ఈ పుస్తకంలో పేర్కొన్నారు. ఇరు దేశాల సంస్క్రతులు.. కుటుంబ విలువలపై ఇద్దరికీ ఉన్న ఉమ్మడి గౌరవం ఈ బంధాన్ని మరింత బలోపేతం చేసిందని పేర్కొన్నారు. అధికారిక సమావేశాల్లో కాకుండా.. అంతర్జాతీయ వేదిక వెనుక జరిగే చిన్న చిన్న సంభాషణలు ఎలాంటి పెద్ద మార్పులకు దారి తీస్తాయో ఈ పుస్తకంలో వివరించారు.
ట్యునీషియా అధ్యక్షుడితో అధికారిక చర్చలు జరుగుతున్నప్పుడు ప్రతిష్ఠంభనలు ఎదురైతే.. సిగిరెట్ బ్రేక్ వేళ.. ఇద్దరి మధ్య కుదిరిన అనధికారిక సంభాషణే చివరకు ఒక కీలకమైన వ్యూహాత్మక దౌత్య ఒప్పందానికి దారి తీసినట్లుగా పేర్కొన్నారు. జపాన్ మాజీ ప్రధాని ఫుమియో కిషిదా కేవలం ఒక దేశాధినేతగా కాకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా గుర్తుంచుకున్నట్లుగా పేర్కొన్నారు. తన కుమార్తె (గినెవ్రా) కోసం జపాన్ నుంచి ఒక పెద్ద హెల్లో కిట్టీ బొమ్మను ప్రత్యేకంగా తీసుకొచ్చి గిఫ్టుగా ఇవ్వటం తన మనసును ఎంతో హత్తుకుందన్నారు.
తనకు చిన్నప్పటి నుంచి ఫాంటసీ నవలలు ఇష్టంగా మెలోనీ పేర్కొన్నారు. ముఖ్యంగా ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ పుస్తకాలంటే విపరీతమైన ఇష్టం. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకున్న పోలాండ్ మాజీ ప్రధాని.. తాను ఆ దేశానికి వెళ్లినప్పుడు సదరు నవల థీమ్ తో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక స్థానిక కేఫ్ కు తీసుకెళ్లిన విషయాన్ని పేర్కొన్నారు. చిన్న చిన్న వ్యక్తిగత గుర్తింపులు దేశాల మధ్య మరింత సత్ సంబంధాలను మరింత పెంచుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తన జీవితాన్ని ఆమె ప్రస్తావించారు. తండ్రి లేని లోటు తనను ఇబ్బందికి గురి చేసిందని.. తనను పెంచి పెద్ద చేసిన తల్లి.. సోదరి.. తాతయ్య.. నానమ్మలను ఆమె గుర్తు చేసుకున్నారు.
టీనేజ్ వయసులో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన వైనం.. 29వ ఏట ప్రొఫెషనల్ జర్నలిస్ట్ గా మారిపార్లమెంట్ కు ఎన్నిక కావటం.. కేవలం 31 ఏళ్ల వయసులో ఇటలీ మంత్రిగా బాధ్యతలు చేపట్టటం.. ఆ దేశ చరిత్రలో అత్యంత చిన్న వయసులో మంత్రి కావటం ఒక రికార్డు. ప్రధానమంత్రిగా దేశాన్ని నడిపించటం ఒక ఎత్తు అయితే.. తన చిన్న కుమార్తె గినెవ్రాకు ఒక మంచి తల్లిగా సమయాన్ని కేటాయించటం మరో సవాలుగా ఆమె పేర్కొన్నారు. నిరంతరం మీడియా నిఘా.. ప్రజల అంచనాల కారణంగా తన వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోవటం.. కుటుంబానికి దూరం కావటం లాంటి విషయాల్లో తన అభిప్రాయాల్ని ఈ పుస్తకంలో పేర్కొన్నారు.
సాధారణ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కారణంగా తనకు ఏ పెద్ద కార్పొరేట్ సంస్థ.. లాబీయింగ్ శక్తుల అండ లేదని చెప్పే ఆమె.. తాను తీసుకునే ప్రతి నిర్ణయం కేవలం తన దేశ శ్రేయస్సు కోసమేనని స్పష్టం చేశారు. తన నిర్ణయాల్లో తప్పులు జరిగినా.. అవేమీ కావాలని చేసినవో.. ఎవరికో మేలు చేసే క్రమంలో కాదన్న విషయాన్ని స్పష్టం చేశారు. అత్యున్నత పదవిలో ఉన్నప్పుడు ఒక నాయకుడిగా ఎదుర్కొనే ఒంటరితనం.. ప్రజల అంచనాల భారం.. వ్యక్తిగత జీవితంలో చేయాల్సిన త్యాగాల ప్రస్తావన వివరాల్ని భావోద్వేగంతో రాసినట్లుగా కనిపిస్తుంది.
ఆఫ్రికా.. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉపాధి అవకాశాల్ని మెరుగుపర్చటం ద్వారా వలసల సమస్యల్ని శాశ్వితంగా అరికట్టే వ్యూహాన్ని వివరించారు. యూరోప్ ప్రస్తుతం తీవ్రమైన గుర్తింపు సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్న ఆమె.. ఆధునిక రాజకీయాలు.. ఆర్థిక మార్పులతో పాశ్చాత్య నాగరికత మూలాలు దెబ్బతింటాయన్న అభిప్రాయాన్ని పుస్తకంలో వ్యక్తం చేశారు. యూరోపియన్ యూనియన్ నుంచి ఇటలీ విడిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన మోలోనీ.. ‘రెండు వేల ఏళ్ల క్రితం ప్రాశ్చాత్య సంస్క్రతికి పురుడు పోసింది ఇటలీనే. ఇటలీ లేకుంటే యూరోపియన్ యూనియనే లేదు’ అంటూ తన దేశాన్ని గొప్పగా ఆవిష్కరించటం పుస్తకంలో కనిపిస్తుంది.
