Begin typing your search above and press return to search.

పవన్ మరో పదిహేనేళ్ళు అయినా...వైసీపీ ఎమ్మెల్సీ హాట్ కామెంట్స్ !

తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం గోడి గ్రామలో జరిగిన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్‌ సంచలన కామెంట్స్ చేశారు.

By:  Satya P   |   9 Aug 2025 3:00 AM IST
పవన్ మరో పదిహేనేళ్ళు అయినా...వైసీపీ ఎమ్మెల్సీ హాట్ కామెంట్స్ !
X

వైసీపీ రాజకీయ విమర్శలు ఎపుడూ వివాదం అవుతూనే ఉన్నాయి. అధినాయకత్వం ఈ విషయంలో ఏ రకమైన దిశా నిర్దేశం చేస్తుందో తెలియదని ప్రత్యర్థి పార్టీలు అంటూంటాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా ఫోకస్ అవవచ్చు అన్న ఆలోచన ఏమైనా ఉందేమో తెలియదు కానీ కీలక నేతలు బాధ్యత కలిగిన వారు చేస్తున్న ఆరోపణలు విమర్శలు ఆ పార్టీని ఇబ్బందులోకి నెడుతున్నాయని అంటున్నారు. తాజాగా గోదావరి జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ ఒకరు పవన్ మీద నోరు జారేశారు. దాంతో జనసేన నేతలు గట్టిగానే తగులుకున్నారు.

పాలేరుగానే అంటూ :

తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం గోడి గ్రామలో జరిగిన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్‌ సంచలన కామెంట్స్ చేశారు. పవన్ పదిహేనేళ్ళు ఏమిటి మరో పదిహేనేళ్ళు అయినా టీడీపీ వద్ద చంద్రబాబు వద్ద పాలేరుగానే ఉంటారని ఆయన ఘాటుగా విమర్శించారు. ఎవరైనా పార్టీ పెట్టి తాము ముఖ్యమంత్రి కావాలని అనుకుంటారు కానీ పవన్ మాత్రం తన పార్టీని బీజేపీతో కానీ చంద్రబాబు టీడీపీతో కానీ విలీనం చేసేలా ఉన్నారని కూడా అన్నారు.

మండిపోతున్న జనసేన :

అయితే ఇజ్రాయిల్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల జనసేన వర్గాలు మండిపోతున్నాయి. తమ నాయకుడి మీద ఈ తరహా విమర్శలు చేస్తారా అని నిప్పులు చెరుగుతున్నారు. సోషల్ మీడియా వేదికగా వైసీపీ ఎమ్మెల్సీని గట్టిగానే తగులుకుంటున్నారు. మీ విధానం ఇదేనా అంటూ వారు నిలదీస్తున్నారు. పద్ధతి లేదా అని తప్పుపడుతున్నారు.

నోరు జారొద్దన్న ఎమ్మెల్యే :

ఇదిలా ఉంటే వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయిల్‌ చేసిన వ్యాఖ్యల పట్ల జనసేనకు చెందిన పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఒక రేంజిలో ఫైర్ అయ్యారు. ఆయన ఏ మాత్రం ఊరుకోలేదు. నేరుగా ఇజ్రాయిల్ తోనే ఫోన్ కలిపారు. పాలేరు తనం అన్న పదాలు వాడతారా ఏమిటిది అంటూ మండిపడ్డారు. నోరు జారవద్దు అని హెచ్చరించారు. పవన్ అంటే ఏమనుకుంటున్నారు అని కూడా క్లాస్ తీసుకున్నారు. ఆయన అంటే దేశ ప్రధాని కూడా దగ్గరకు పిలిచి మాట్లాడుతారని అన్నారు. పవన్ పేరు చెబితేనే ఎన్నో నిధులు కేంద్రం నుంచి వస్తున్నాయని గుర్తు చేశారు. విమర్శలు చేసేటపుడు ఈ విధంగా దిగజారవద్దు అని ఎమ్మెల్యే స్ట్రాంగ్ గానే రియాక్ట్ అయ్యారు.

తగ్గేది లేదన్న ఎమ్మెల్సీ :

అయితే తన మీద జనసేన నాయకులు దండెత్తడం మీద ఇజ్రాయిల్ మండిపడుతున్నారు. పవన్ ని తాను ఒక్కడినే అంటున్నానా అని ఆయన ప్రశ్నించారు. ఎంతో మంది అగ్ర నాయకులు పవన్ ని విమర్శిస్తున్నారు అని వారిని అనే ధైర్యం మీకు ఉందా అని ఆయన ప్రశ్నిస్తున్నారు తన మీద మాత్రం నేరుగా ఫోన్ చేసి హెచ్చరించారు అని జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఈ తాటాకు చప్పుళ్ళకు జడిసేది లేదని అన్నారు. తాను ఇపుడే కాదు ఇక మీదట కూడా విమర్శలు చేస్తూనే ఉంటానని అన్నారు. మొత్తానికి పవన్ మీద వైసీపీ ఎమ్మెల్సీ చేసిన విమర్శలు అయితే ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.