కలకలం.. హైదరాబాద్ ఫేమస్ పార్క్ లో 20 అడుగుల భారీ కొండ చిలువ.. వైరల్ వీడియో
హైదరాబాద్ నగర నడిబొడ్డున పచ్చని పకృతికి నిలయమైన కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) నేషనల్ పార్క్ మరోసారి వార్తల్లో నిలిచింది.
By: A.N.Kumar | 19 July 2026 1:23 PM ISTహైదరాబాద్ నగర నడిబొడ్డున పచ్చని పకృతికి నిలయమైన కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) నేషనల్ పార్క్ మరోసారి వార్తల్లో నిలిచింది. కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న నగరంలో వన్యప్రాణుల ఉనికిని చాటుతూ.. పార్క్‌లోని వాకింగ్ ట్రాక్ సమీపంలో ఒక భారీ కొండచిలువ ప్రత్యక్షం కావడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
భయాందోళనలో వాకర్లు.. నెట్టింట వైరల్ వీడియో
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. పార్క్‌లోని వాకింగ్ ట్రాక్ పక్కనే ఉన్న గడ్డి పొదల మధ్య నుండి ఒక భారీ పైథాన్ నెమ్మదిగా రోడ్డుపైకి రావడం కనిపించింది. ఉదయం, సాయంత్రం వేళల్లో అక్కడ వాకింగ్ చేసే నగరవాసులు ఈ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు.
సోషల్ మీడియా వినియోగదారుల అంచనా ప్రకారం.. వీడియోలో కనిపిస్తున్న పాము దాదాపు 20 అడుగుల పొడవు ఉండవచ్చని తెలుస్తోంది. ఈ పైథాన్ చాలా భారీగా ఉండటంతో పాటు అత్యంత నెమ్మదిగా కదులుతుండటాన్ని బట్టి, అది ఇటీవలే ఏదైనా పెద్ద జంతువును మింగి ఉండవచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ పాము పొడవుపై కానీ, దాని ఆరోగ్య పరిస్థితిపై కానీ అటవీ శాఖ లేదా పార్క్ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
నగర జీవ వైవిధ్యానికి గుండెకాయ "కేబీఆర్"
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ మధ్య విస్తరించి ఉన్న కేబీఆర్ పార్క్ కేవలం నగరవాసుల వాకింగ్ స్పాట్ మాత్రమే కాదు. ఇది నగర కాలుష్యాన్ని తగ్గించే ఒక ఊపిరితిత్తి లాంటిది. సహజ ఆవాసంగా అనేక రకాల పక్షులు, సరీసృపాలు, చిన్న అడవి జంతువులకు ఇది సురక్షితమైన ఆశ్రయం. పాములు, ముంగిసలు, నెమళ్లు, వివిధ జాతుల అరుదైన పక్షులు , వందలాది సీతాకోకచిలుకలకు ఈ పార్క్ సహజ సిద్ధమైన నివాసంగా నిలుస్తోంది.
కేబీఆర్ వంటి సహజ అడవి ప్రాంతాల్లో పైథాన్‌లు ఉండటం అసాధారణం ఏమీ కాదు. ఇవి సాధారణంగా మనుషులపై దాడి చేయవు. తమకు ప్రమాదం పొంచి ఉందని భావించినప్పుడే రక్షించుకోవడానికి ప్రయత్నిస్తాయి. కాబట్టి పార్క్‌కు వచ్చేవారు వన్యప్రాణులను చూసినప్పుడు వాటిని రెచ్చగొట్టకుండా, దూరంగా ఉంటూ వెంటనే పార్క్ సిబ్బందికి సమాచారం అందించడం శ్రేయస్కరం.
పరిరక్షణపై మళ్లీ మొదలైన చర్చ
ఈ వైరల్ వీడియో కేవలం ఆందోళనను మాత్రమే కాదు, ఒక ముఖ్యమైన సామాజిక చర్చను కూడా తెరపైకి తెచ్చింది. గతంలో నగరాభివృద్ధి, రోడ్ల విస్తరణ పేరుతో కేబీఆర్ పార్క్ భూభాగాన్ని, దాని చుట్టూ ఉన్న బఫర్ జోన్‌ను తగ్గించేందుకు ప్రయత్నాలు జరిగినప్పుడు పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు పెద్ద ఎత్తున ఉద్యమించారు.
ప్రస్తుతం కనిపిస్తున్న ఈ భారీ కొండచిలువ.. నగరంలో ఇంకా వన్యప్రాణుల సహజ సిద్ధమైన జీవనవ్యవస్థ సజీవంగా ఉందనడానికి నిదర్శనం. ఇలాంటి అర్బన్ ఫారెస్ట్‌లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే కాకుండా ప్రతి పౌరుడిపైనా ఉందని పర్యావరణ శ్రేయోభిలాషులు స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని, పచ్చదనాన్ని అందించాలంటే కేబీఆర్ పార్క్ వంటి విలువైన సహజ వనరులను ఎలాంటి ఆటంకాలు లేకుండా పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
