Begin typing your search above and press return to search.

దేశంలో పెరిగిన దెయ్యం పాఠశాలలు... తెలంగాణలో ఎక్కువ 'గురూ'!

ప్రధానంగా భారతీయ విద్యా వ్యవస్థలో పెరుగుతున్న ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, ప్రైవేటు ఆధిపత్యాన్ని ఇది సూచిస్తుందని అంటున్నారు.

By:  Raja Ch   |   21 Dec 2025 10:00 PM IST
దేశంలో పెరిగిన దెయ్యం పాఠశాలలు... తెలంగాణలో ఎక్కువ గురూ!
X

కావాలని చేస్తున్నారో.. యాదృశ్ఛికంగా జరిగిపోతుందో తెలియదు కానీ.. ఇటీవల కాలంలో ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలపై చాలా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయనే చర్చ బలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓట్ల కోసమో ఏమో కానీ టీచర్ పోస్టులను మాత్రం భర్తీ చేస్తూ.. ఆ టీచర్లు పని చేస్తున్న స్కూల్స్ లో పిల్లలు ఉన్నారో లేదో అనే సృహ లేని పరిస్థితుల్లో నడుపుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో తెరపైకి షాకింగ్ గణాంకాలు వచ్చాయి. ఇవి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

అవును... పేపర్ పై స్కూల్స్ ఉన్నాయి.. వాటి సైన్ బోర్డులు చెక్కు చెదరకుండా మెరుస్తున్నాయి.. ఆ స్కూల్స్ లో ప్రభుత్వ నియమించిన క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారు.. నిధులు సైతం కేటాయించబడ్డాయి.. కాకపోతే ఆ స్కూల్స్ లో విద్యార్థులే లేరు! పార్లమెంటులో సమర్పించబడిన తాజా ప్రభుత్వ డేటా ఓ షాకింగ్ సత్యాన్ని వెల్లడించింది. ఇందులో భాగంగా.. 2024-25 విద్యా సంవత్సరంలో దేశంలో 5,149 గవర్నమెంట్ స్కూల్స్ లో స్టూడెంట్స్ సంఖ్య సున్నా.

అలా అని ఆ స్కూల్స్ ఉన్న గ్రామాల్లో, ప్రాంతాల్లో కుటుంబాలు లేవా, ఆ కుటుంబాల్లో పిల్లలు లేరా, ఆ పిల్లలు చదువుకోవడం లేదా? అదేమీ కాదు.. ప్రభుత్వాల (ప్లాన్డ్) నిర్లక్ష్యం.. ప్రైవేటు స్కూల్స్ పక్కా ప్లానింగ్ వెరసి ఇది జరిగిందని అంటున్నారు! ఇలా ఈ దేశంలో మొత్తం 10.13 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లో 5,149 స్కూల్స్ లో ఒక్క విద్యార్థి కూడా చేరని విషయం ఆందోళనకరంగా అనిపిస్తుంది. ఈ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది షాకింగ్ గా మారింది.

ఇందులో భాగంగా... సున్నా విద్యార్థులు ఉన్న ప్రభుత్వ పాఠశాలలు సుమారు 70% కేవలం రెండు రాష్ట్రాల్లోనే ఉన్నాయని.. అవి పశ్చిమ బెంగాల్, తెలంగాణ అని నివేదిక స్పష్టం చేస్తోంది. దీని ప్రకరాం.. 5,149 ఘోస్ట్ స్కూల్స్ లో సుమారు 3,600 - 3,700 స్కూల్స్ కేవలం ఈ రెండు రాష్ట్రాల్లోనే ఉన్నాయని నివేదిక చెబుతోంది. ఇది చిన్న పరిపాలనా లోపం కాదని.. ఇది స్కూల్స్, టీచర్స్, స్టూడెంట్స్ మధ్య సమన్వయం లేని వ్యవస్థను సూచిస్తుందని అంటున్నారు!

వాస్తవానికి 2024-25 సంవత్సరంలో దేశంలో 10.13 లక్షలకు పైగా గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే.. వాటిలో పైన చెప్పుకున్నట్లుగా 5,149 స్కూల్స్ లో విద్యార్థుల సంఖ్య సున్నాగా ఉంటే.. 65,054 స్కూల్స్ లో 10 కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... సున్నా లేదా దాదాపు సున్నా స్టూడెంట్స్ ఉన్న స్కూల్స్ లో 1.44 లక్షల మంది ఉపాధ్యాయులను నియమించారు!

2022-23లో 10 కంటే తక్కువ విద్యార్థులు ఉన్న ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 52,309 నుంచి 2024-25 నాటికి 65,054కి పెరిగింది. అయితే దీనికి గల కారణాల్లో ఒకటి.. కొన్ని చోట్ల పాఠశాలలు ఉన్నా పిల్లలు రాకపోగా.. మరికొన్ని చోట్ల పిల్లలు ఉన్నారు కానీ స్కూల్స్ దూరంగా ఉండటం అంటున్నారు. ప్రధానంగా భారతీయ విద్యా వ్యవస్థలో పెరుగుతున్న ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, ప్రైవేటు ఆధిపత్యాన్ని ఇది సూచిస్తుందని అంటున్నారు.

ఈ సందర్భంగా 10 లేదా అంతకంటే తక్కువ విద్యార్థులు ఉన్న టాప్-5 రాష్ట్రాలను ఒకసారి పరిశీలిద్దామ్...!

1. పశ్చిమ బెంగాల్:

సున్నా లేదా అంతకంటే తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలు 6,703

ఈ పాఠశాలల్లో నియమించబడిన ఉపాధ్యాయుల సంఖ్య 27,348

2. ఉత్తరప్రదేశ్

సున్నా లేదా అంతకంటే తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలు 6,561

ఈ పాఠశాలల్లో నియమించబడిన ఉపాధ్యాయుల సంఖ్య 22,166

3. మహారాష్ట్ర

సున్నా లేదా అంతకంటే తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలు 6,552

ఈ పాఠశాలల్లో నియమించబడిన ఉపాధ్యాయుల సంఖ్య 11,056

4. రాజస్థాన్

సున్నా లేదా అంతకంటే తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలు 5,235

ఈ పాఠశాలల్లో నియమించబడిన ఉపాధ్యాయుల సంఖ్య 11,620

5. తెలంగాణ

సున్నా లేదా అంతకంటే తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలు 5,021

ఈ పాఠశాలల్లో నియమించబడిన ఉపాధ్యాయుల సంఖ్య 4,850