జీహెచ్ఎంసీలో 'వందేమాతరం' వివాదం.. మజ్లిస్ కార్పొరేటర్లు ఏం చేశారు?
హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగటం తెలిసిందే.
By: Garuda Media | 26 Nov 2025 3:35 PM ISTహైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగటం తెలిసిందే. ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామం కొత్త వివాదానికి తెర తీసింది. వందేమాతరం గీతం విషయంలో బీజేపీ.. మజ్లిస్ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. పోటాపోటీగా నినాదాలు చేయటంతో సభ ప్రాంగణం హోరెత్తింది. బీజేపీ సభ్యులు పట్టుబట్టటంతో కౌన్సిల్ సమావేశంలో జయజయహే తెలంగాణ గీతంతో పాటు వందేమాతరం గీతాన్ని కూడా ఆలపించాలని మేయర్ విజయలక్ష్మి నిర్ణయించారు.
వందేమాతరం గీతాన్ని ఆలపిస్తున్న వేళలో మజ్లిస్ కు చెందిన కొందరు సభ్యులు లేచి నిలబడకుండా తమ కుర్చీల్లోనే కూర్చున్నారంటూ బీజేపీ సభ్యులు ఆరోపించారు. వందేమాతరం ఆలపిస్తున్నప్పుడు కనీస గౌరవం లేకుండా కూర్చున్న వారికి సభలో ఉండే అర్హత లేదని బీజేపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఈ తీరును ప్రశ్నించారు. దీనికి ఎదురుదాడికి దిగిన మజ్లిస్ కార్పొరేటర్లు బీజేపీ సభ్యులు తమను అవమానించారని.. క్షమాపణలు చెప్పాలని డిమాండ చేశారు.
ఈ సందర్భంగా కుర్చీల మీదకు ఎక్కి బీజేపీ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. దీనికి ప్రతిగా బీజేపీ కార్పొరేటర్లు సైతం అదే తరహాలో ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఇరు పార్టీల సభ్యులపై మేయర్ తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు. కుర్చీలు ఎక్కిన వారిని బయటకు పంపాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఎంపీ రఘునందన్ రావు.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఈ మొత్తం వ్యవహారంపై బీజేపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఏ రీతిలో స్పందిస్తారో చూడాలి.
