Begin typing your search above and press return to search.

పిస్తా హౌస్.. కిచెన్ ఇంత అరాచకమా?

కొన్నేళ్ల క్రితం పాతబస్తీలో ఏర్పాటు చేసిన పిస్తా హౌస్ కు తక్కువ వ్యవధిలోనే ఎంతటి పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకుందో తెలిసిందే.

By:  Garuda Media   |   13 Aug 2025 3:26 PM IST
పిస్తా హౌస్.. కిచెన్ ఇంత అరాచకమా?
X

కొన్నేళ్ల క్రితం పాతబస్తీలో ఏర్పాటు చేసిన పిస్తా హౌస్ కు తక్కువ వ్యవధిలోనే ఎంతటి పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకుందో తెలిసిందే. కొవిడ్ తర్వాత పిస్తా హౌస్ లను భారీ ఎత్తున ఫ్రాంఛైజీల పేరుతో కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ మహానగరంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. విదేశాల్లోనూ దీని బ్రాంచ్ లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకించి రంజాన్ మాసంలో వండి వడ్డించే హలీమ్ కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. దీని కోసం పిస్తా హౌస్ ముందు బారులు తీరి ఉండటం తెలిసిందే.

ఇదంతా ఒక ఎత్తు.. తాజాగా పిస్తా హౌస్ కు చెందిన షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు మంగళవారం హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న రెండు డజన్లకు పైనే ఉన్న పిస్తా హౌస్ లను కాస్త తేడాతో ఒకే కాలంలో తనిఖీలు చేపట్టారు. మొత్తం పాతిక రెస్టారెంట్లను తనిఖీ చేసిన అధికారులు 23 శాఖల్లో నమూనాలు సేకరించారు.

వీటికి సంబంధించిన వివరాల్ని అధికారిక ప్రకటన రూపంలో విడుదల చేశారు. ఆ పిస్తా హౌస్.. ఈ పిస్తా హౌస్ అన్న తేడా లేకుండా అత్యధికంగా ఉన్న పిస్తా హౌస్ లలో కామన్ గా కొన్ని అరాచకాల్ని అధికారులు గుర్తించారు. అందులో కీలకం..

- కిచెన్ శుభ్రంగా లేకపోవటం

- ఫ్రిజ్ ల నిర్వహణ దారుణంగా ఉండటం

- చిమ్నీలు మురికిగా ఉండటం

- వంట గదులకు జాలీల ఏర్పాటు లేకపోవటం

- ఫుడ్ సేఫ్టీ నిబంధనల్ని పట్టించుకోవటం

- వంట గదిలో ఎలుకలు.. బొద్దింకల గుర్తింపు

- నాన్ వెజ్ వంటకాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగం

- తుప్పు పట్టిన ఫ్రిజ్ లో నాన్ వెజ్ ను నిల్వ ఉంచటం

- తుప్పు పట్టిన కత్తులతో కూరగాయల్ని కట్ చేయటం

ఇలా పెద్ద ఎత్తున నిబంధనల ఉల్లంఘన జరుగుతున్న విషయాన్ని గుర్తించారు. ఒక పెద్ద బ్రాండ్ గా పిస్తా హౌస్ ఎదుగుతున్న వేళలో.. ఈ తరహాలో వంట గది.. అందులోని వస్తువుల నిర్వహణ ఉండటం విస్మయానికి గురి చేస్తోంది. భారీ ఎత్తున రెస్టారెంట్లను ఏర్పాటు చేసే సంస్థలు.. నాణ్యత.. ప్రజల ఆరోగ్యం లాంటి అంశాల్లోనూ మరింత అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. అధికారుల తనిఖీల్లో వెల్లడైన అంశాలు షాకింగ్ గా మారాయి. ఇప్పటికైనా పిస్తా హౌస్ సంస్థలు కళ్లు తెరిచి.. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.